ఐఏఎస్ అధికారుల్లాగ అవ్వద్దని రేవంత్ చెప్పాడా ?

గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని వివాదాస్పద వ్యాఖ్యలు ఐఏఎస్ లపై రేవంత్ చేస్తున్నాడు;

Update: 2025-03-01 11:26 GMT
Revanth Reddy

ఎందుకనో ఈమధ్య రేవంత్ రెడ్డికి ఐఏఎస్ అధికారులతో సరిపడటంలేదు. నిజానికి ముఖ్యమంత్రిగా ఎవరున్నా ఐఏఎస్ అధికారులు సఖ్యతనే కోరుకుంటారు. వాళ్ళతో సరిగా పనిచేయించుకోవటం అన్నది ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి బాధ్యత. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని వివాదాస్పద వ్యాఖ్యలు ఐఏఎస్ లపై రేవంత్ చేస్తున్నాడు. తాను చెప్పిన మాటలు ఐఏఎస్ అధికారులు వినటంలేదని, ఐఏఎస్ లు ఫీల్డ్ విజిట్లుచేయటం మరచిపోయారని అన్నారు. తాజాగా సత్తుపల్లి ఎంఎల్ఏ మట్టా రాగమయి ఒక సమావేశంలో మాట్లాడుతు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. సమావేశంలో రాగమయి మాట్లాడుతు రేవంత్(Revanth) తమతో చెప్పిన మాటలను వివరించారు.

ఇంతకీ ఆమె ఏమన్నారంటే ‘ఎంఎల్ఏలు ఎవరూ ఐఏఎస్ అధికారుల్లాగ కావద్ద’ని రేవంత్ తమతో చెప్పాడట. ఎందుకంటే ఐఏఎస్ అధికారి అవటానికి బాగా కష్టపడతారట. ‘ఒకసారి ఐఏఎస్(IAS Officer) అధికారి అయిపోగానే రిలాక్స్ అయిపోయి ఏపనీ చేయర’ట. ‘ఏసీ గదుల్లో కూర్చుని సమీక్షలు నిర్వహించటం, ఫైళ్ళపై సంతకాలు చేయటం, అధికారులకు ఫోన్లలో ఆదేశాలు ఇవ్వటానికి మాత్రమే ఐఏఎస్ లు పరిమితమైపోతార’ని తమతో రేవంత్ చెప్పినట్లుగా రాగమయి అన్నారు. ‘ఎంఎల్ఏలు నియోజకవర్గాల్లో తిరగాలని, ప్రజల్లో ఉన్న ఎంఎల్ఏలకే జనాధరణ ఉంటుంద’ని రేవంత్ తమతో చెప్పాడట. ఈ నేపధ్యంలోనే ఐఏఎస్ అధికారుల్లాగ అవకుండా రెగ్యులర్ గా ఇళ్ళల్లో నుండి బయటకు వచ్చి జనాల్లోనే తిరగండని రేవంత్ ఉద్భోద చేసినట్లు ఎంఎల్ఏ చెప్పారు.


అయితే రేవంత్ చెప్పినట్లే తాము కూడా ఇప్పటికే ఏఐఎస్ అధికారుల్లాగ అయిపోయినట్లు ఎంఎల్ఏ చెప్పారు. ఎలాగంటే రేవంత్, మంత్రులను ప్రతిపక్షాలు ఎన్ని తిట్లుతిడుతున్నా ఎంఎల్ఏలుగా తాము ఎవరమూ కౌంటర్లు కూడా ఇవ్వటంలేదని రాగమయి అంగీకరించారు. అంటే ఎంఎల్ఏల్లో చాలామంది జనాల్లో తిరగటంలేదని సత్తుపల్లి ఎంఎల్ఏ చెప్పకనే చెప్పేశారన్న విషయం అర్ధమవుతోంది.

Tags:    

Similar News