ప్రతిపక్షాల ప్లాన్ వర్కవుట్ కాలేదా ?

రెండురోజుల్లో సుమారు 170 మంది తమ ఇళ్ళను ఖాళీచేసి ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్ రూముల్లోకి మారిపోయారు.

Update: 2024-10-02 05:26 GMT
Musi houses evacuations

మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు విషయంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్లన్ వర్కవుటైనట్లు లేదు. మూసీ రివర్ ప్రాజెక్టు టేకప్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అందుకనే మూసీనదికి 55 కిలోమీటర్ల పరిధిలో రెండువైపులా ఉన్న సుమారు 15 వేల నిర్మాణాలను తొలగించాలి. నదికి రెండువైపులా 50 మీటర్ల పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు సర్వేలు చేసి నిర్మాణాలకు మార్కింగ్ కూడా మొదలుపెట్టారు. నిర్మాణాల్లో పట్టాల్లో ఇళ్ళు కట్టుకున్న వాళ్ళున్నారు అలాగే కబ్జాలు చేసి నిర్మించుకున్న వాళ్ళూ ఉన్నారు. ఇళ్ళతో పాటు కమర్షియల్ యాక్టివిటీస్ కూడా నడుస్తున్నాయి. వీటన్నింటిపై సర్వేలు చేసిన అధికారులు ఆర్ బీ x(రివర్ బెడ్) అని ఎర్రటి పెయింటులో మార్కు చేస్తున్నారు. దీంతో మొదట్లో ఇళ్ళ యజమానుల నుండి బాగా వ్యతిరేకత కనబడింది.

అయితే భారీ వర్షాలు కురిసినపుడు, వరదల సమయంలో మూసీనది పొంగటం, ఇళ్ళు ముణిగిపోవటం లాంటి ఘటనలను అధికారులు యజమనాలకు గుర్తుచేస్తున్నారు. ఇక్కడ ఖాళీచేసే వాళ్ళకి ప్రభుత్వం వేరే ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూముల ఇళ్ళను కేటాయిస్తున్న విషయాన్ని వివరించి చెప్పారు. నిజానికి ఒకపుడు మంచినీటి నదిగా ఉండే మూసి ఇపుడు మురికికూపంగా మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయినా దశాబ్దాలుగా అలవాటు పడిపోయారు కాబట్టి అక్కడినుండి కదలటానికి యజమానులు ఇష్టపడలేదు. దాంతో ప్రభుత్వం ఒకటికి రెండుమూడుసార్లు నచ్చచెప్పిన తర్వాత కొందరు ఖాళీ చేయటానికి అంగీకరించారు. గడచిన రెండురోజుల్లో సుమారు 170 మంది తమ ఇళ్ళను ఖాళీచేసి ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్ రూముల్లోకి మారిపోయారు. మూసీనది దగ్గర తాముంటున్న ఇళ్ళకన్నా డబుల్ బెడ్ రూములు బాగుండటంతో బాధితుల్లో సంతోషం కనబడుతోంది. ఇదే విషయాన్ని మిగిలిన ఇళ్ళవాళ్ళు కూడా పోల్చి చూసుకుంటున్నారు.

ఇక్కడే ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల ప్లాన్ ఘోరంగా ఫెయిలైంది. నాలుగురోజుల పాటు మూసీనది ప్రాంతంలో ఉంటున్న యజమానులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు బాగా రెచ్చగొట్టారు. ఎట్టిపరిస్ధితుల్లోను ఇళ్ళను ఖాళీ చేయవద్దని, ప్రభుత్వాన్ని తాము అడ్డుకుంటామని, పేదలకు తాము అండగా నిలుస్తామని చాలామాటలు చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నంచేశారు. దాంతో చాలామంది ప్రభుత్వానికి ఎదురుతిరిగారు. అయితే అధికారులు యజమానులను బుజ్జగించి వాస్తవ పరిస్ధితులను వివరించి నచ్చచెప్పటంతో కొందరు ఖాళీ చేయటానికి అంగీకరించారు. ఇలా అంగీకరించిన యజమానులకు ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్ రూములు కేటాయించి, ఇళ్ళు ఖాళీ చేయటానికి అవసరమైన కూలీలను, రవాణాకోసం వాహనాలను కూడా సమకూర్చింది. డబుల్ బెడ్ రూముల్లో చేరిన వాళ్ళు మళ్ళీ తమ ప్రాంతానికి వచ్చి ఖాళీ చేసిన ఇళ్ళకు, డబుల్ బెడ్ రూములకు తేడా వివరించి చెబుతుండటంతో మిగిలిన వాళ్ళల్లో ఆలోచన మొదలైంది.

దాంతో అధికారుల కృషి, కౌన్సిలింగ్ పనిచేసి మెల్లిగా మిగిలిన వాళ్ళు కూడా తమ ఇళ్ళను ఖాళీ చేయటానికి అంగీకరిస్తున్నారు. ఈ విధంగా ఇప్పటివరకు 170 మంది తమ ఇళ్ళను అధికారులకు అప్పగించేసి కొత్తగా కేటాయించిన డబుల్ బెడ్ రూముల్లోకి మారిపోయారు. వీళ్ళని చూసి మిగిలిన వాళ్ళలో కూడా ఆలోచన వచ్చి మూసీ ఇళ్ళను ఖాళీచేసే విషయాన్ని ఆలోచిస్తున్నారు. ఇదే సమయంలో అధికారయంత్రాంగం కూడా తమ ప్రయత్నాలను మరింతగా పెంచింది. దాంతో ఇళ్ళను ఖాళీచేసే విషయం ఇప్పటివరకు వ్యతిరేకించిన యజమానుల ఆలోచనల్లో మార్పొస్తోంది. పైగా ఇక్కడకన్నా డబుల్ బెడ్ రూముల్లో సౌకర్యాలు ఉండటం, పిల్లల చదువులకు అవసరమైన అడ్మిషన్లను ప్రభుత్వం దృష్టిపెట్టడటంతో తల్లి, దండ్రుల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతోంది. ఈ పరిణామాలతో బాధితులను రెచ్చగొట్టి ప్రభుత్వంపైకి ఉసిగొల్పుదామని అనుకున్న బీఆర్ఎస్ ప్లాన్ మెల్లిగా నీరుగారిపోతోంది.

కేటీఆర్ డబుల్ గేమ్

ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును నిజానికి చేపట్టింది బీఆర్ఎస్ హయాంలో కేటీఆరే. మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినపుడు కేటీఆర్ మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు పేరుతో ఆక్రమణలను, ఇళ్ళను తొలగించాలని డిసైడ్ చేశారు. అప్పట్లో అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతు మూసీకి రెండువైపులా 10 వేల నిర్మాణాలున్నట్లు గుర్తించామన్నారు. ద్రోన్లతో సర్వేలు చేయించినట్లు చెప్పారు. అన్నీ నిర్మాణాలను తొలగించి మూసీనదిని మంచినీటి నదిగా మార్చేందుకు అవసరమైన అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. నిర్మాణాలను తొలగించటం అంటే ఏమిటర్ధం ? నిర్మాణాలన్నింటినీ కూల్చేయటమే కదా ? నివాసితులను బలవంతంగా ఖాళీ చేయించటం లేదా నచ్చచెప్పి ఖాళీచేయించి ఇంకోచోట పునరావాసం కల్పించటం ఒకటే మార్గం. అధికారంలో ఏ పార్టీ ఉన్నా డెవలప్మెంట్ చేయాలని అనుకుంటే అందుకు వేరే మార్గంలేదని అందరికీ తెలుసు. కాకపోతే తాము అధికారంలో ఉంటే ఒకలాగ ప్రతిపక్షంలో ఉంటే మరో లాగ వ్యవహరిస్తామని కేటీఆర్ చర్యల ద్వారా అర్ధమవుతోంది. ఇపుడు మూసీనది ప్రాంతంలో ఉన్న వాళ్ళు తమిళ్ళను ఖాళీ చేయటానికి సిద్ధమవుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ ప్లాన్ వర్కవుట్ కాలేదని అర్ధమవుతోంది.

Tags:    

Similar News