BJP Medak MP | మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు ప్రాణగండం ?
సాయంత్రంలోగా చంపేస్తామని శుక్రవారం ఉదయం ఫోన్లో గుర్తుతెలీని వ్యక్తి బెదిరించాడు;
చాలామందికి ‘నాన్నపులి’ కథ తెలిసే ఉంటుంది. కొడుకు తండ్రిని ఆటపట్టించటానికి నాన్నా పులి అని అంటుంటాడు. తండ్రి ఆందోళనతో కొడుకు దగ్గరకు వచ్చిచూడగా కొడుకు నవ్వుతు సరదాగా అన్నానని తండ్రిని ఆటపట్టిస్తాడు. కొద్దిసేపటికి కొడుకు నాన్నా పులి అని అరచినా తండ్రి స్పందించడు. ఈసారి నిజంగానే పులి వచ్చి కొడుకును నోటకరుచుకుని తీసుకెళ్ళిపోతుంది. ఈకథ మెదక్ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందనరావు(BJP MP Raghunandan Rao) వ్యవహారానికి సరిపోతుంది. అయితే ఇపుడు విషయం ఏమిటంటే ఎంపీని చంపేస్తామంటు(Life Threat) ఒక ఫోన్ కాల్(Phone Call) వచ్చింది. సాయంత్రంలోగా చంపేస్తామని శుక్రవారం ఉదయం ఫోన్లో గుర్తుతెలీని వ్యక్తి బెదిరించాడు. 90434 48431 అనే బీఎస్ఎన్ఎల్BSNL) నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. తాను మావోయిస్టు(Maoist)నని సాయంత్రంలోగా చంపేస్తానని వ్యక్తి బెదిరించాడు.
ఎంపీని చంపేస్తామనే ఫోన్ కాల్ కొత్తకాదు. గడచిన మూడునెలల్లో చంపేస్తామని ఎంపీకి 6 సార్లు ఫోన్లొచ్చాయి. ఆరుసార్లూ ఎంపీ పోలీసులకు ఫిర్యాదులుచేశారు. ప్రతిసారి తనను బెదిరించిన వ్యక్తి ఫోన్ నెంబర్ ను ఎంపీ పోలీసులకు ఇస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఏఒక్క ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు బెదిరించిన వ్యక్తిని పట్టుకున్నదిలేదు. బెదిరింపు ఫోన్లు మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ తదితర ఉత్తరాధి రాష్ట్రాల నుండి వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు నెంబర్ల ఆధారంగా ఫోన్ చేస్తున్నవారి అడ్రస్సులు మాత్రం పట్టుకోలేకపోతున్నారు. చివరకు బెదిరింపు ఫోన్లుచేస్తున్న వారి పేరు కూడా తెలుసుకోలేకపోతుండటమే ఆశ్చర్యంగా ఉంది.
ఒక ఎంపీకి మూడునెలల్లో ఆరుసార్లు చంపేస్తామని బెదిరింపు కాల్స్ రావటం మామూలు విషయంకాదు. ఇది ఎవరో ఆకతాయిల పనీకాదు. ఎవరో వ్యూహాత్మకంగానే ఫోన్లో బెదిరింపులకు దిగుతున్నట్లు అర్ధమవుతున్నది. పదేపదే చంపేస్తామని ఫోన్లు వస్తుంటే ఎంపీ అయినా పోలీసులు అయినా ఎప్పుడూవచ్చే ఫోన్లలాంటిదే అని పట్టించుకోకుండా వదిలేస్తారు. ప్రతిసారి ఫోన్ చేసి బెదిరిస్తున్న ఫోన్ లాంటిదేలే అని నిర్లక్ష్యంగా ఉంటే చివరకు ఆగంతకులు అన్నంత పనీచేసే ప్రమాదముంది.
ఈవిషయంలోనే ఎంపీతో పాటు ఆయన మద్దతుదారులు గోలచేస్తున్నారు. ఇన్నిసార్లు ఫిర్యాదులుచేసినా, బెదిరింపు కాల్స్ నెంబర్లు ఇస్తున్నా అడ్రస్సులు పట్టుకోలేకపోవటం ఏమిటని మండిపడుతున్నారు. ఇంత అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా బెదిరించిన వ్యక్తుల అడ్రస్సులను కనుక్కోలేకపోవటమే ఆశ్చర్యంగా ఉందని ఎంపీ రఘునందనరావు ఆవేధన వ్యక్తంచేస్తున్నారు. తనకు బుల్లెట్ ప్రూఫ్ కారుతో పాటు తగిన రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ఎంపీ డిమాండ్ చేశారు. బెదిరింపు కాల్స్ చేస్తున్నవాళ్ళని పోలీసులు ఎప్పటికి పట్టుకుంటారో ? ఎంపీకి బుల్లెట్ ప్రూఫ్ కారుతో పాటు తగిన రక్షణను ప్రభుత్వం ఎప్పుడు కల్పిస్తుందో చూడాలి.