కష్టాల్లో నల్గొండ రైతు... ఇది రాజకీయమవుతుందా?

ఉమ్మడి నల్లగొండలో కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. అతిపెద్ద ప్రాజెక్టు నాగార్జునసాగర్ ఎండుతున్నాది. భూగర్భ జలాలు అడుగంటి పోయె. సగానికి పైగా పడిపోయిన సాగు విస్తీర్ణం...

Update: 2024-03-04 05:50 GMT
ఇలా ట్యాంకులతో సేద్యం సాధ్యమా?


(ఫెడరల్ తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి)


 ఉమ్మడి నల్గొండ జిల్లా రైతు కష్ట కాలంలో పడ్డాడు. నాగార్జున సాగర్  లో నీళ్లు లేవని ప్రభుత్వం క్రాప్ హాలిడేని ఇప్పటికే ప్రకటించింది. పదేళ్ల కాలంలో క్రాప్ హాలిడే ప్రకటించడం ఇదే మొదటి సారి,  మరొక వైపు భూగర్భ జలాలు బాగా లోతుకు పడిపోయాయి. పంటవిస్తీర్ణం తగ్గిపోయింది. వేసిన పంట ఎండిపోతున్నది. వేసిన పంట కాపాడడం నల్లబెల్లి యాదగిరి కి  సవాల్‌గా మారింది

‘యాసంగి పంటలను రక్షించుకోవడం ఎలా?. బోరుబావి కింద నాలుగు ఎకరాల్లో వరిపంట వేశాను. నీళ్లు లేక ఇప్పుడు అది ఎండిపోయే స్థితికి చేరింది. కండ్ల ముందే పంట ఎండిపోతున్నా.. ఏం చేయాలో పాలుపోవడం లేదు. కొత్తగా బోరుబావులు తవ్వించినా నీరు పడే పరిస్థితి లేదు," యాదగిరి చెబుతున్నాడు.  యాదగిరి గట్టు సింగారం రైతు. బోర్  బావి  కింద పంట వేశాడు. బోరెండి పోయింది.ఇగ పంట పరిస్థితి ఏమిటి? యాదగిరి ఆవేదన జిల్లా మొత్తం వినబడుతుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత ఆనకట్టగా చెప్పుకునే నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉన్న నల్లగొండలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే జిల్లాలో సగానికి పైగా సాగు విస్తీర్ణం పడిపోయింది. దీనికి ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు మానవ తప్పిదాలు కారణమని అధికారులు చెబుతున్నారు.

ఇది రాజకీయ రూపం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆదివారం నాడు  పార్టీ కార్యకర్తలతో మాట్టాడుతూ కాంగ్రెస్ వచ్చిందో లేదో రైతులకు కష్టాలు మొదలయ్యాయని బిఆర్ ఎస్ అధినేత  కె చంద్రశేఖర్ రావు  ప్రకటించారు. రైతులు తిరుగుబాటు చేసే అవకాశం ఉందని కూడా అన్నారు.


క్రాప్ హాలిడే ఖాతరు చేయని రైతులు

అయితే, రైతులు క్రాప్ హాలిడే ఖాతరు చేయకపోవడం కూడా వాళ్ల కష్టాలకు కారణమని అధికారులు చెబుతున్నారు. ఎండాకాలం రాకముందే నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 517 అడుగులకు నీటి నిల్వ పడిపోవడం వల్లే క్రాప్ హాలిడే ప్రకటించారు. ఉన్ననీళ్లని తాగునీటికి వాడుకునే ఉద్దేశంతో వ్యవసాయానికి నీరు విడుదల చేయడం జరగదని స్పష్టంగా చెప్పారు. అయితే, దీనిని ఖాతరు చేయలేదు.  నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.

"యసంగి క్రాప్ సీజన్ ప్రారంభం కాకముందే ప్రభుత్వం నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్ కు క్రాప్ హాలిడే ప్రకటింది . అయినా రైతులు వరి పంటనే సాగుచేశారు. దీనివల్ల రైతులు నష్టం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది . జిల్లా వ్యవసాయ శాఖ సూచించిన ప్రత్యాన్మాయ సాగు ప్రణాళికను రైతులు పట్టించుకోలేదు" అని జిల్లా వ్యవసాయ అధికారి పి . శ్ర వన్ కుమార్ తెలిపారు.

 ప్రభుత్వం అవగాహణ కల్పించలేదు

క్రాఫ్ హాలిడే ప్రకటించిన తరువాత అనుసరించాల్సిన వ్యవసాయ విధానాలపై రైతులలో అవగాహన కల్పించాడని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఫ్యూచర్ ఫార్మర్స్ ఫోరమ్ వ్యవస్థాపకులు రూపని రమేష్ ఆరోపించారు. ‘‘ క్రాప్ హాలిడే, ప్రత్యామ్నాయ పంటల మీద రైతులకు అవగాహణ కల్పించలేదు. దీనిని ఖాతరు చేయని రైతులు ఎక్కువ నీరు అవసరం అయిన వరిపంటను బోరుబావుల కింద సాగు చేసారు. బోర్ బావులలో సరైన నీరు లేక నేడు ఆ పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఎండిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం కల్పిస్తామని ప్రకటించి రైతులలో మనోధైర్యం నింపాల్సిన అవరం ఉంది," రమేష్ అభిప్రాయ పడ్డారు.  


భారీగా పడిపోయిన భూగర్భ జలాలు..


నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో భూగర్భ జలాలు సాధారణం కంటే భారీగా పడిపోయాయి. భూగర్భ శాఖ నివేదిక ప్రకారం.. నల్లగొండ జిల్లాలో 21 శాతం, సూర్యాపేట జిల్లాలో 18 శాతంగా నమోదయ్యింది. అతికొద్ది నెలల్లోనే భూగర్భ జలాలు తగ్గిపోవడంతో రైతులు బోరుబావుల కింద సాగు చేసిన పంటలు కూడా ఎండిపోయే దశకు చేరాయి. అయితే జిల్లాలో భూగర్భ జలాలు పడిపోవడానికి ప్రధాన కారణం నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు తగ్గడమే కారణమని చెప్పాలి.




 



ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కాలువల ద్వారా ఉమ్మడి నల్లగొండలోని చెరువులను యాసంగిలో నింపలేదు. గతంలో రెండు పంట కాల్వల ద్వారా చెరువులను నింపడం వల్ల భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేవి. ఈసారి యధావిధిగానే యాసంగిలో చెరువులు నింపుతారని ప్రజలు భావించారు. కానీ అలా జరగలేదు. మరోవైపు చేపల కాంట్రాక్టలర్లు చేపల వేట కోసం నవంబర్ నెలలో చాలా గ్రామాల్లోని చెరువుల తూములు ఎత్తి నీటిని బయటకు పంపారు.


కొన్ని గ్రామాల్లో ప్రజలు నీటిని చెరువుల నుంచి బయటకు పంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి అడ్డుకున్నారు. కానీ కాంట్రాక్టర్లు మాత్రం రాత్రి సమయాల్లో చెరువుల తూములు ఎత్తి నీటిని బయటకు పంపారు. దీంతో చెరువుల్లో నీరు లేకపోవడం.. పంట కాల్వల ద్వారా చెరువులను నింపకపోవడం వల్ల భూగర్భ జలాలు ఘణనీయంగా తగ్గాయి.

బోర్‌వెల్స్‌కు భారీగా పెరిగిన డిమాండ్..


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 25 లక్షల బోరుబావులు ఉండగా, అందులో అత్యధికం ఎండిపోయినవే. అయినా రైతులు తమ పంటలను రక్షించుకునేందుకు కొత్తగా మళ్లీ బోరుబావులను తవ్విస్తున్నారు. పెరిగిన డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని బోర్‌వెల్స్ యాజమాన్యం డ్రిల్లింగ్ ధరలను అమాంతం పెంచేశారు. దీన్ని నియంత్రించడంపై ప్రభుత్వ అధికారులు దృష్టి సారిస్తేనే బావుంటుందని భారత కిసాన్ సభ నాయకులు మందడి నర్సింహారెడ్డి అన్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కోసం కర్ణాటక ప్రభుత్వాన్ని కోరాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.


. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10,16,637 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణం కాగా, యాసంగిలో 6,03,730 ఎకరాల్లో మాత్రమే రైతులు పంటల సాగు చేపట్టారు. దీంతో జిల్లాలో ముఖ్యంగా వరి దిగుబడి గణనీయంగా తగ్గిపోనుంది. దీనివల్ల రానున్న కాలంలో బియ్యం ధరలపై తప్పకుండా ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు.



Tags:    

Similar News