Drugs Free Telangana| డ్రగ్స్ కేసుల్లో దోషులపై నార్కోటిక్స్ బ్యూరో ఉక్కుపాదం
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.డి-అడిక్షన్ సెంటర్ల ఏర్పాటుతోపాటు దోషులపై ఉక్కుపాదం మోపుతున్నారు.
By : Saleem Shaik
Update: 2024-11-30 02:55 GMT
మాదక ద్రవ్యాల (DRUGS) వినియోగం వల్ల జరిగే దుష్ఫలితాలను వివరించి చెప్పి, డ్రగ్స్ నిరోధానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్ పై చైతన్యవంతులను చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తోంది.
- ఒక వైపు పోలీసు అధికారులు డ్రగ్స్ నియంత్రణకు చర్యలు చేపడుతూనే నార్కోటిక్స్ డీ అడిక్షన్ సెంటర్లలో(de-addiction centers) డ్రగ్స్ బాధితులకు కౌన్సెలింగ్ లు నిర్వహిస్తోంది.
- డ్రగ్స్ రవాణ, విక్రయం, కేసుల్లో దోషులపై యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కఠిన చర్యలు తీసుకుంటోంది. డ్రగ్స్ కేసుల్లో దోషుల ఆస్తులను పోలీసులు సీజ్ చేస్తున్నారు.
- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చొరవతో డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ పోలీసులు, వైద్యులు కార్యక్రమాలు చేపట్టారు.
డ్రగ్స్ కేసుల్లో దోషుల ఆస్తుల సీజ్
డ్రగ్స్ విక్రయం ద్వారా సంపాదించిన ఆస్తులను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (Telangana Anti Narcotics Bureau)సీజ్ చేసింది. ప్రధాన డ్రగ్స్ కేసుల్లో దోషులు అక్రమంగా సంపాదించిన ఆస్తులను అధికారులు సీజ్ జేశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం కింద తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మూడు ప్రధాన కేసుల్లో రూ. 6 కోట్ల విలువైన ఆస్తులను స్తంభింపజేసింది. మొదటి కేసులో అల్ప్రాజోలం తయారీకి సంబంధించి ఈ ఏడాది ప్రారంభంలో అరెస్టయిన గోసుకొండ అంజిరెడ్డి అనే వ్యాపారి నుంచి కోటి రూపాయల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆల్ప్రాజోలం అమ్మినందుకు గత సంవత్సరం అరెస్టయిన అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మడూరి రామ కృష్ణ గౌడ్ నుంచి 4.5 కోట్ల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని ఆస్తుల్లో మెదక్ జిల్లాలో భూములు, వాహనాలు ఉన్నాయి. ఫెంటానిల్ అక్రమ రవాణా చేస్తున్న అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ అహ్సన్ ముస్తఫా ఖాన్ కు చెందిన రూ.2 కోట్ల ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు దర్యాప్తు బృందాలు 2024వ సంవత్సరంలో రూ.55 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ సందీప్ శాండిల్యా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
పకడ్బందీగా డ్రగ్స్ కేసులు
తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డ్రగ్స్ నివారణకు ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసులలో శిక్షా రేటును పెంచడం లక్ష్యంగా అధికారులకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కీలక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం,యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్యా, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో డ్రగ్స్ కేసులు పెరుగుతున్నప్పటికీ దోషులకు శిక్షల శాతం 11 గానే ఉంది. ఈ సవాలును అధిగమించడానికి 20వేల మంది పోలీసు సిబ్బందికి కేసుల నమోదులో శిక్షణ ఇచ్చింది.
డ్రగ్స్ బాధితులకు కౌన్సెలింగ్
డ్రగ్స్ తీసుకునే వారికి కౌన్సెలింగ్ చేస్తున్నట్లు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ వైద్యుడు డాక్టర్ కొండపర్తి ఫణికాంత్ చెప్పారు. డ్రగ్స్ కు అలవాటు పడిన వారికి నిద్ర పట్టకపోవడం, అనారోగ్యంతో బాధపడుతుంటారని ఫణికాంత్ తెలిపారు.డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం అధికారులు, విద్యార్థులు ప్రతిన బూనారు.( DrugsFree Telangana)
డ్రగ్స్ నిర్మూలనపై అల్లు అర్జున్ వీడియో
డ్రగ్స్ నిర్మూలనపై అల్లు అర్జున్ చేసిన వీడియో తనకు ఆనందం కలిగించిందని తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎక్స్ సోషల్ మీడియాలో పోస్టులో పేర్కొన్నారు. హెల్తీ స్టేట్, హెల్తీ సొసైటీ కోసం అందరూ ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. సీఎం పెట్టిన పోస్టుపై అల్లు అర్జున్ స్పందించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు మీరు తీసుంటున్న చొరవను అభినందిస్తున్నానంటూ అల్లు అర్జున్ (Allu Arjun)ట్వీట్ చేశారు.‘‘ డ్రగ్స్ బాధితులను ఆదుకోవడానికి, సురక్షితమైన, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రభావవంతమైన చొరవలో చేరడం పట్ల వినయపూర్వకంగా భావిస్తున్నాను’’అని సినీనటుడు అల్లు అర్జున్ పేర్కొన్నారు.