Comedian Ali | నటుడు అలీకి నోటీసులు.. అక్రమ నిర్మాణాలే కారణం..

హాస్యనటుడు అలీకి ఎక్‌మామిడి పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయన తన పొలంలో నిర్మించినవి అక్రమ నిర్మాణాలని తేలడంతోనే ఈ నోటీసులు ఇచ్చారు.

Update: 2024-11-24 10:43 GMT

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని టాప్ కమెడియన్స్‌తో అలీ(Comedian Ali) పేరు తప్పకుండా ఉంటుంది. తన కామెడీ టైమింగ్, నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో అలీ ఔరా అనిపించాడు. కానీ కొంతకాలంగా అలీ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. వార్తల్లో కూడా పెద్దగా లేడు. అటువంటి తాజాగా ఆదివారం ఆయన టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు. అందుకు వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎక్‌మామిడి గ్రామ పంచాయతి పరిధిలో ఆయన నిర్మిస్తున్న ఫామ్ హౌస్ నిర్మాణమే. ఆ నిర్మాణానికి అవసరమైన అనుమతులు లేవని, తక్షణమే నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ పంచాయతి కార్యదర్శి శోభారాణి నోటీసులు జారీ చేశారు. ఎక్‌మామిడి పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 345లో అలీ ఫామ్ హౌస్ నిర్మాణం జరుగుతోంది. ఈ నూతన నిర్మాణాలకు సంబంధించి అలీ కావాల్సి అనుమతులు తీసుకోలేదని, వెంటనే నిర్మాణానికి సంబంధించి దస్త్రాలు చూపి సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి శోభారాణి సూచించారు.

గతంలో కూడా అలీకి ఎక్‌మామిడి పంచాయతీరాజ్ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. అప్పుడు కూడా అనుమతులు లేవని, వాటిని తీసుకోవాలని సూచించారు. అయినా అలీ స్పందించకపోవడంతో తాజాగా రెండోసారి నోటీసులు అందించారు. అంతేకాకుండా ఈసారి కూడా పట్టనట్లు ఉంటే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ అక్రమ నిర్మాణానికి సంబంధించి నవంబర్ 5న తొలిసారి ఇచ్చామని, అయినా అలీ నుంచి స్పందన రాకపోవడంతో ఈ నెల 22న రెండోసారి నోటీసులు ఇచ్చామని పంచాయతీ సెక్రటరీ వెల్లడించారు.

అసలేంటీ ఫామ్ హౌస్ కథ..

కొన్నేళ్ల క్రితం ఎక్‌మామిడి పంచాయతి పరిధిలో నటుడు అలి కొంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. స్థానిక కూలీల సహాయంతో ఆ స్థలంలో పంటలు, పండ్ల తోటలు వేశారు. అక్కడకు వెళ్ళినప్పుడు ఉండటం కోసమని అక్కడే ఒక ఫామ్ కట్టడాలని నిర్ణయించుకున్నాడు. అదే విధంగా నిర్మాణాలు చేపట్టాడు. ఇప్పటికే ఫామ్ హౌస్ నిర్మాణం పూర్తికాగా.. అవి అక్రమంగా కట్టినవని ఆరోపణలు వచ్చాయి. గ్రామ పంచాయతీ అధికారులకు సమాచారం ఇవ్వకుండా, అనుమతులు తీసుకోకుండా అలీ.. ఇల్లు నిర్మించారని స్థానికులు తెలిపారు. దీంతో గ్రామ పంచాయతీ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టింది. ఆ నిర్మాణాలకు అనుమతులు లేవని తేలడంతో అధికారులు అలీకి నోటీసులు ఇచ్చారు.

Tags:    

Similar News