Waqf Lands Encroachments | తెలంగాణలో 55వేల ఎకరాల వక్ఫ్ భూముల కబ్జా
దేశంలో మోదీ ప్రభుత్వం 2024 వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తెలంగాణలో అన్యాక్రాంతమైన వక్ఫ్ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది.
By : The Federal
Update: 2024-11-25 11:53 GMT
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 55వేల ఎకరాల వక్ఫ్ భూములు ఆక్రమణల పాలయ్యాయి. రెవెన్యూ రికార్డులు, మ్యుటేషన్, గెజిట్ నోటిఫికేషన్ల జారీలో జాప్యం వల్ల కోట్లాది రూపాయల విలువ చేసే వక్ఫ్ భూములను(telangana wakf board) కొందరు అక్రమార్కులు కబ్జా(Encroachments) చేశారు.
- నిజాం నవాబు కాలం నుంచి వచ్చిన వక్ఫ్ భూముల్లో(Waqf lands) 75 శాతం కబ్జాల పాలయ్యాయి. వేల కోట్ల రూపాయల విలువచేసే 55వేల ఎకరాల వక్ఫ్ భూములు ఆక్రమణల పాలైన వీటిపై తెలంగాణ వక్ఫ్ బోర్డు కేసులు వేసింది.
- 3,500 కు పైగా వేసిన కబ్జాల కేసులు కోర్టుల్లో విచారణలోనే ఉన్నాయి. నిజామాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాల్లో వేలాది ఎకరాల భూములు కబ్జా దారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి.
కబ్జాదారుల కబంధ హస్తాల్లో వక్ఫ్ భూములు
తెలంగాణ వక్ఫ్ బోర్డు పరిధిలో మొత్తం 77వేల ఎకరాల భూములుండగా, ఇందులో 75 శాతం భూములు కొందరు బడా వ్యక్తులు, కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. కేవలం 22వేల ఎకరాల భూములు ఎలాంటి వివాదాలు లేకుండా వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయి. కొందరు ముతవల్లీలు వక్ఫ్ భూములను అన్యాక్రాంతం చేశారు. వక్ఫ్ బోర్డు అధికారుల అవినీతి వల్ల భూములు కబ్జాల పాలయ్యాయి.వక్ఫ్ కబ్జాల పాలైన భూములను కాపాడేందుకు తాము న్యాయపోరాటం చేస్తున్నామని తెలంగాణ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ బియాబానీ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణం కోసం
పహాడిషరీఫ్ సమీపంలోని 2వేల ఎకరాల వక్ఫ్ భూమిని ఉమ్మడి ఏపీ సర్కారు శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణం కోసం కేటాయించింది. పహాడిషరీఫ్ లో వక్ఫ్ బోర్డు పరిధిలో కేవలం వంద ఎకరాల భూమి మాత్రమే మిగిలింది. వక్ఫ్ బోర్డుకు చెందిన 1700 ఎకరాల భూమి అటవీ శాఖ ఆధీనంలో ఉంది. దీంతో అటవీశాఖతో వక్ఫ్ బోర్డు న్యాయపోరాటం చేస్తుంది.మెదక్ జిల్లాలో 530 ఎకరాలు, మల్కాజిగిరి మండలంలో 350 ఎకరాలు, రాజేంద్రనగర్ లో 350 ఎకరాలు, మణికొండలో 108 ఎకరాలు, మాదాపూర్ గుట్టల బేగంపేటలో 90 ఎకరాలు, చేవేళ్ల మండలంలో 1200 ఎకరాల వక్ఫ్ భూములున్నాయి.
వక్ఫ్ భూములపై సర్వే జరిగినా రెవెన్యూ శాఖ వారి రికార్డుల్లో ముటేషన్ చేయక పోవడం వల్ల వేలాది ఎకరాల భూములు కబ్జాదారుల చేతుల్లో చిక్కాయి. వక్ఫ్ భూములపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినా దాన్ని ప్రచురించడంలో తాత్సారం, రెవెన్యూశాఖ అధికారుల ఉదాశీనత వల్ల వక్ఫ్ భూములు కబ్జాల పాలయ్యాయని ఇస్లామిక్ కాలమిస్ట్ ముహ్మద్ ముజాహిద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. వక్ఫ్ భూములను ముటేషన్ చేయాలని కోరుతూ వక్ఫ్ బోర్డు కలెక్టర్లకు లేఖలు రాసినా దాన్ని పట్టించుకోలేదు.
మణికొండలో 1950 ఎకరాల వక్ఫ్ భూములను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయక పోవడం వల్ల ప్రభుత్వం మల్టీనేషనల్ కంపెనీలకు వేలం వేసి విక్రయించేందుకు ఏపీఐఐసీకి కేటాయించారు.ఉమ్మడి ఏపీ సర్కారు 1961వ సంవత్సరంలో వక్ఫ్ సర్వే కమిషనరును నియమించింది. అయినా వక్ఫ్ భూములు కబ్జాల పాలయ్యాయి.వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తెలంగాణ వక్ఫ్ బోర్డు ఆధీనంలోని మసీదులు, అష్రూఖానాలు, ఖబ్రస్థాన్లు, దర్గాల పరిధిలోని వక్ఫ్ భూముల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ఒక సారి వక్ఫ్ భూమి అని ప్రకటించాక ఎప్పటికీ వక్ఫ్ గానే ఉంటుందని, కానీ ఈ కొత్త బిల్లు వల్ల వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ ఎలా అనేది చర్చనీయాంశంగా మారింది.