రేవంత్ పైకి ‘ఈట’ల్లాంటి ప్రశ్నలు

మూసీ ప్రక్షాళన, రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి రేవంత్ రెడ్డికి మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కొన్ని ప్రశ్నలను సంధించారు.

Update: 2024-10-06 12:29 GMT
Eetala and Revanth

మూసీ ప్రక్షాళన, రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి రేవంత్ రెడ్డికి మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కొన్ని ప్రశ్నలను సంధించారు. మూసీనది ప్రక్షాళనకు తాను వ్యతిరేకం కాదని అంటూనే ఈటల్లాంటి ప్రశ్నలను ఎంపీ సంధించటం గమనార్హం. ఇంతకీ ఈటల సంధించిన ప్రశ్నలు ఏమిటంటే బ్యూటిఫికేషన్ పేరుతో పేదలనుండి తీసుకున్న భూమిలో మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తావా ? మూసీ ప్రక్షాళనకు మీ యాక్షన్ ప్లన్ ఏమిటి ? డీపీఆర్ ఉందా ? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమిటి ? కోట్ల రూపాయలు విలువచేసే భూమిని తీసుకుని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామంటే ఎలాగ ? సబర్మతి నది ప్రక్షాళనకు రు. 2 వేల కోట్లు, నమోగంగ ప్రాజెక్టుకు 12 ఏళ్ళల్లో రు. 22 వేల కోట్లు ఖర్చుపెడితే మూసీ ప్రాక్షాళనకు లక్షా 50 వేల కోట్లు ఎందుకు ఖర్చవుతున్నాయి ? ప్రాజెక్టు ఎవరికి ఇచ్చారు ? అని నిలదీశారు. తన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలని రేవంత్ ను డిమాండ్ చేశారు.

చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ నిర్ధారించకుండా కూల్చివేతలు ఎలా చేస్తారంటు నిలదీశారు. పట్టాభూముల్లో ఇళ్ళు కట్టుకున్నవారికి ప్రత్యామ్నాయం ఏమి చూపిస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. రేవంత్ చేస్తున్న పనులతో హైదరాబాద్ భవిష్యత్తు, అభివృద్ధి ప్రశ్నార్ధకంలో పడిపోతున్నట్లు ఆందోళన వ్యక్తంచేశారు.

స్టేజీల మీద ప్రకటనలు కాకుండా, తమను కాలకేయులతో పోల్చటం కాకుండా నిర్ణయాదికారం తీసుకునే ముఖ్యమంత్రిగా అఖిలపక్ష సమావేశం పెడితే తాము వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తమ కొట్లాటంతా రూపాయి రూపాయి కూడబెట్టుకున్న పేదల ఇళ్ళ కోసమే అని స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం పెట్టబోయే లక్షన్నర కోట్ల రూపాయలు పేదల కోసమేనా అని సూటిగా ప్రశ్నించారు. బడ్జెట్ మతలబు ఏమిటో తేల్చాల్సిందే అని హెచ్చరించారు. తన ప్రశ్నలకు సమాధానాలు వచ్చేంతవరకు, విషయంపై స్పష్టత వచ్చేంతవరకు తన ప్రతిఘటన జరుగుతునే ఉంటుందని ఈటల హెచ్చరించారు.

Tags:    

Similar News