‘సమాన పనికి సమాన పని.. నినాదానికే పరిమితం’
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ధర్నాలో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీసిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.;
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా తెలంగాణ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీగా ఏర్పడి ధర్నా చేపట్టారు. ఎన్నికల ముందు వరకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారం వచ్చాక వారిని అంధకారంలో పెట్టేసిందని అన్నారు. తమ సమస్యలను విస్మరించిందని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పలు డిమాండ్లతో వారు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్నారు. ఇందులో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని వారికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేయాలని, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతి నెలా ఠంచన్‌గా జీతాలు చెల్లించాలని ఈటల రాజేందర్ కోరారు.
వేతనాలతో ఏజెన్సీలకే లాభం..
తెలంగాణలో రూ.15,600 బేసిక్ పే ఉన్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి ప్రభుత్వం రూ.22,136 వేతనం కింద చెల్లిస్తోంది. కానీ ఆ ఉద్యోగి చేతికి వచ్చేది మాత్రం రూ.13,611. ఇలా రాష్ట్రంలోని 2 లక్షలకు పైగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉండగా, వారి రెక్కల కష్టం ఏజెన్సీల పాలవుతున్నది. ఏజెన్సీ కమిషన్(4శాతం), జీఎస్టీ(18)శాతం విధించడంతో ఒక్కో ఉద్యోగి సగటున రూ.4 వేలకుపైగా నష్టపోతున్నారు. రూ.19,500 బేసిక్ పే ఉన్న ఉద్యోగి నెలకు రూ.4,987, రూ.22,750 బేసిక్‌పే ఉన్న ఉద్యోగి రూ. 5,816 చొప్పున నెల నెలా నష్టపోతున్నారు. ప్రతినెలా ఏజెన్సీలకే దాదాపు రూ.50 నుంచి 60కోట్ల మేరకు కమీషన్ల పేరిట ఏజెన్సీలు లాభపడుతున్నాయని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వాపోతున్నారు. వీటిని సరిచేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. ‘‘20 ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నాం. ఆరునెలలుగా జీతాలు లేవు. చాలామందిని నోటీసులేకుండా తొలగించి రోడ్డుమీద పడవేశారు. ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఉద్యోగులందరినీ మళ్లీ వీధిలోకి తీసుకోవాలి.. ఉద్యోగ భద్రత కల్పించాలి. డ్యూటీలో చనిపోయినా పట్టించుకోవడం లేదు. మేము బిచ్చం అడుగుతలేము.. చేసినం పనికి జీతం ఇవ్వమని అడుగుతున్నాం’’ అని స్పష్టం చేశారు.
ఏ డిపార్ట్‌మెంట్‌కు అయినా వారు ముఖ్యం: ఈటల
‘‘సమాన పనికి సమాన వేతనం నినాదం తప్ప ఆచరణ లేదు. అవుట్సోర్సింగ్ కంపెనీ ఉద్యోగాలు ఎప్పుడు తీసివేస్తుందోనని భయపడుతున్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ లాగా మాకు కూడా ఉద్యోగ భద్రత, సమాన వేతనం రాకపోతుందా అని ఎదురుచూస్తున్నారు. 30 ఏళ్లుగా పనిచేసేవారు ఉన్నారు. గత ముఖ్యమంత్రి ఏం కాంట్రాక్టు, ఏం ఔట్సోర్సింగ్.. గిట్లనే ఉంటదా అని మాట్లాడారు. కానీ ఏం చేయలేదు. మంత్రిగా ఉన్నప్పుడు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచగలిగాము కానీ.. ఉద్యోగ భద్రత కల్పించలేకపోయాము. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేయకపోతే ఆ డిపార్ట్మెంట్ పనిచేయని పరిస్థితికి వచ్చింది’’ అని అన్నారు.
‘‘వేతనంతో కూడిన సెలవులు లేవు. హెల్త్ కార్డులు లేవు. 20 ఏళ్లుగా పని చేసినా కూడా.. పర్మినెంట్ ఉద్యోగి వస్తే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. వీరంతా పీజీలు, పి.హెచ్.డి లు చేసిన వారు ఉన్నారు. నెల నెల జీతం రాకపోతే ఎలా బ్రతకాలి.. పాలబిల్లు, పిల్లల ఫీజులు, బస్సు కిరాయిలు, ఇంటి కిరాయిలు, కరెంటు బిల్లు ఎవరు ఉద్దెర ఇవ్వరు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు, జీతాలు, డీఏల గురించి ఎలా ఆలోచిస్తున్నారో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల మీద, వారు అనుభవిస్తున్న జీవితాల మీద, వారి జీతాల మీద మంత్రివర్గ ఉప సంఘం వేయాలని డిమాండ్ చేస్తున్నాను. వేదన భరించలేక ఈరోజు వీరంతా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు. మెస్ట్రీకి పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు.. కానీ పి.హెచ్.డి చదువుకున్న వారికి కేవలం 15 వేలు జీతం ఇస్తున్నారు’’ అని గుర్తు చేశారు.
‘‘ఔట్‌సోర్సింగ్ వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. నెల నెలా జీతాలు ఇవ్వాలి. ఈపీఎఫ్, PF ఉండాలి. తల్లిదండ్రులతో కలిపి హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఏజెన్సీకి 18 శాతం GST తీసివేయాలి. సర్వీస్ రంగంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఏజెన్సీలకు జిఎస్టి తొలగించాలని నేను కూడా కేంద్రమంత్రికి ప్రతిపాదిస్తాను. ఔట్ సోర్సింగ్ విధానం పోవాలి. వీటన్నిటిని తీర్చాలని డిమాండ్ చేస్తున్నాను. మీరు అడిగేవి అలవి కానీ హామీలు కాదు నిత్యం పడుతున్న వేధనను తీర్చమని కోరుతున్నారు. భారతదేశం యువశక్తి గల దేశం. నిర్వీర్యం కాకుండా చూడాలి. 97.5 శాతం ఉద్యోగాలు ప్రైవేట్‌వే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలు పట్టించుకుని పరిష్కారించాలి’’ అని డిమాండ్ చేశారు ఈటల.