నూతన దంపతులను మృత్యువు కూడా విడదీయలేకపోయింది

జమ్మలమడుగు బీజేపీ ఎంఎల్ఏ ఆదినారాయణరెడ్డి(MLA Adinarayana Reddy) సమక్షంలోనే వీళ్ళ వివాహం జరిగింది;

Update: 2025-07-01 15:54 GMT
newly wed couple

శ్రీరమ్యది కృష్ణాజిల్లాలోని నూజివీడు. నిఖిల్ కుమార్ రెడ్డిది కడప జిల్లాలోని ముద్దనూరుమండలం పెంచికలపాడు గ్రామం. ఈ ఇద్దరు ప్రేమించుకున్నారు. వీళ్ళ ప్రేమను రెండువైపుల పెద్దలు ఆమోదించలేదు. దాంతో ఇళ్ళల్లోనుండి వెళ్ళిపోయి ప్రేమవివాహం చేసుకున్నారు. జమ్మలమడుగు బీజేపీ ఎంఎల్ఏ ఆదినారాయణరెడ్డి(MLA Adinarayana Reddy) సమక్షంలోనే వీళ్ళ వివాహం జరిగింది. ఇదంతా జరిగి రెండు నెలలు మాత్రమే అయ్యింది. ఇపుడు వీళ్ళ ప్రస్తావన ఎందుకనే అనుమానం వచ్చిందా ? పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్న ఈ జంటను మృత్యవు కాటేసింది. సోమవారం ఉదయం హైదరాబాద్ పటాన్(Patancheru) చెరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ(Sigachi fire accident) అగ్నిప్రమాదంలో మరణించారు.

శ్రీరమ్య, నిఖిల్ చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ ఇళ్ళలో ప్రేమ గురించి చెబితే ఒప్పుకోలేదు. సరే, ఉద్యోగం చేస్తున్నాంకాబట్టి ఇంట్లో వాళ్ళు అంగీకరించకపోయినా వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆ ధైర్యంతోనే ఇద్దరు తమ ఇళ్ళల్లో చెబితే ఊహించినట్లుగనే పెద్దలు అంగీకరించలేదు. అందుకనే జమ్మలమడుగు ఎంఎల్ఏ ఆదినారాయణరెడ్డిని ఆశ్రయించారు. వీళ్ళగురించి తెలుసుకున్న ఎంఎల్ఏ మద్దతుగా నిలిచారు. దాంతో ఎంఎల్ఏ సమక్షంలోనే వివాహం జరిగింది. వీళ్ళ వివాహంగురించి తెలిసిన తర్వాత అందులోను ఎంఎల్ఏ సమక్షంలోనే వివాహం అయ్యిందని తెలుసుకున్న పెద్దలు ఏమీ మాట్లాడలేకపోయారు.

వివాహం తర్వాత సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరిపోయారు. ఇద్దరు క్వాలిటి చెక్ వింగ్ లోనే పనిచేస్తున్నారు. ప్రతిరోజు లాగే ఇద్దరు ఇంట్లో రెడీ అయి ఫ్యాక్టరీకి చేరుకున్నారు. ఆఫీసుకు వచ్చి అర్ధగంట కూడా కాకుండానే పెద్ద పేలుడు సంభవించింది. పేలుడుధాటికి చనిపోయిన 48 మందిలో శ్రీరమ్య, నిఖిల్ కూడా ఉన్నారు. పటాన్ చెరు ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించిన 36 మృతదేహాల్లో ఈ ఇద్దరు కూడా ఉన్నారు. ప్రమాదం విషయం తెలియగానే ఇద్దరి కుటుంబసభ్యులు వెంటనే తమ ఊర్లనుండి బయలుదేరి ముందు ఫ్యాక్టరీకి తర్వాత ఆసుపత్రి మార్చురీకి చేరుకున్నారు.

మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవటంతో ఈ ఇద్దరి శరీరాలనుండి తీసుకున్న శాంపుల్స్ తో కుటుంబసభ్యుల శాంపుల్స్ తీసుకుని ఆసుపత్రివర్గాలు డీఎన్ఏ టెస్టు చేయించారు. దాంతో శ్రీరమ్య మృతదేహం ఆమె తల్లి, దండ్రుల డీఎన్ఏతో సరిపోలింది. అలాగే నిఖిల్ మృతదేహం శాంపుల్ అతని కుటుంబసభ్యుల డీఎన్ఏతో మ్యాచ్ అయ్యింది. దాంతో పోలీసులు, ఆసుపత్రివర్గాలు ఇద్దరి మృతదేహాలను రెండు కుటుంబాలకు అందించారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే శ్రీరమ్య మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులు, నిఖిల్ మృతదేహాన్ని అతని కుటుంబసభ్యులు తమ ఊర్లకు విడివిడిగా తీసుకెళ్ళిపోయారు. అంటే వీళ్ళ చనిపోయిన తర్వాత కూడా పెద్దల మనసులు కరగలేదు. అందుకనే వివాహంతో ఒకటైన జంట మృత్యువులో కూడా ఒకటిగానే మరలిరాని లోకాలకు వెళ్ళిపోయినా కుటుంబసభ్యులు మాత్రం భౌతికదేహాలను ఎవరికి వాళ్ళుగా తీసుకెళ్ళిపోవటమే విషాధం. వీళ్ళ మరణవార్త వినగానే ఎంఎల్ఏ ఆసుపత్రికి చేరుకుని కుటుంబసభ్యులను పరామర్శించారు. కెమికల్ ఫ్యాక్టరి ప్రమాదంలో మరణించిన వారిలో ఇలాంటి దంపతులు ఇంకా కొందరు ఉన్నారని సమాచారం. అయితే వాళ్ళ ఆచూకీ ఇంకా దొరకలేదు.

Tags:    

Similar News