Excise Crime Report | తెలంగాణలో పెరిగిన ఎక్సైజ్ నేరాలు

2024వ సంవత్సరంలో ఎక్సైజ్ నేరాలు పెరిగాయి. తెలంగాణలో నాన్ డ్యూటీ పెయిడ్, అక్రమ మద్యం, గంజాయి విక్రయాలు జోరుగా సాగాయని తాజా నివేదికలో వెల్లడైంది.

Update: 2024-12-28 14:32 GMT

2023వ సంవత్సరం కంటే 2024లో ఎక్సైజ్ నేరాలు 2.07 శాతం పెరిగాయి. ఈ ఏడాది ఎక్సైజ్ కేసుల్లో 12,727 మందిని అరెస్ట్ చేశారు. 1,04,730 లీటర్ల అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ శాఖ స్వాధీనం చేసుకుంది. అక్రమ మద్యం, గంజాయిని తరలిస్తున్న 2,173 వాహనాలను ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేశారు. 10,613 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని స్వాధీనం చేసుకొని 800 కేసులు నమోదు చేశారు. గంజాయి, అల్ఫాజోలం, డ్రగ్స్ కేసుల సంఖ్య కూడా పెరిగింది. 2023 కంటే 2024 లో 1045 కేసులు నమోదు చేసి 1840 మందిని అరెస్ట్ చేశారు.


నాలుగు జిల్లాల్లో పారిన అక్రమ మద్యం
2024వ సంవత్సరంలో వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో అక్రమ మద్యం ఏరులై పారిందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ రికార్డులే చెబుతున్నాయి. నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని 25 ఎక్సైజ్ స్టేషన్లలో అక్రమ మద్యం తయారీ, విక్రయాలు జోరుగా సాగాయని తేలింది. చెన్నూర్, లక్సెట్టిపేట్, బెల్లంపల్లి, నిర్మల్, కాగజ్ నగర్, ధర్మపురి, సుల్తానాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, కొత్తకోట, అచ్చంపేట, తెల్కపల్లి, కల్వకుర్తి, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట్, మహబూబాబాద్, తొర్రూర్, భూపాలపల్లి, గూడూర్, ములుగు, కాటారం, దేవరకొండ, హుజూర్ నగర్, భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో అక్రమ మద్యం పారిందని ఎక్సైజ్ శాఖ రికార్డులు తేటతెల్లం చేశాయి. 25 అక్రమ మద్యం తయారీ హాట్ స్పాట్లను ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. అక్రమ మద్యం తయారీకి కావాల్సిన నల్ల బెల్లం ఇతర పదార్థాల విక్రయదారులపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది. అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై 21,916 కేసులు నమోదు చేసి 13,336 మందిని అరెస్టు చేశారు.

డ్రగ్స్ విక్రయాల జోరు
హైదరాబాద్ నగరంతోపాటు ఖమ్మం, మెదక్ జిల్లాల్లో డ్రగ్స్ విక్రయాలు సాగాయని ఎక్సైజ్ శాఖ గుర్తించింది. డ్రగ్స్ విక్రేతలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టి సారించారు. తెలంగాణలోనే పబ్ లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం ద్వారా డ్రగ్స్ గుట్టును ఎక్సైజ్ శాఖ రట్టు చేసింది. హాసిష్ ఆయిల్, కొకైన్, గంజాయి చాక్లెట్లు, బ్రౌన్ షుగర్, డైజోఫాం, అల్ఫాజోలంలను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు.

గంజాయి విక్రయాలను నిరోధించేందుకు ఆపరేషన్ ధూల్ పేట్
గంజాయి విక్రయాలను నిరోధించేందుకు 2024లో తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆపరేషన్ ధూల్ పేట్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ధూల్ పేట్, నానక్ రాంగూడ, కూకట్ పల్లి ప్రాంతాలు కేంద్రాలుగా విద్యార్థులు, కార్మికులు లక్ష్యంగా చేసుకొని గంజాయి విక్రయిస్తున్నట్లు గురించిన ఎక్సైజ్ శాఖ అధికారులు ముమ్మర దాడులు చేశారు. గంజాయి, హాషిష్ ఆయిల్,నల్లమందు, గంజాయి చాక్లెట్ల విక్రయాలకు ఎక్సైజ్ శాఖ తెరవేసింది.


Tags:    

Similar News