తెలంగాణలో అతి భారీ వర్షాలు
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన వాతావరణ శాఖ;
తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అత్యంత భారీ వర్ష హెచ్చరిక జారి చేసింది. ఉత్తర తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రస్తుతం 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది.
నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.
వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్‌లు జారీ అయ్యాయి. .తెలంగాణలో వారం రోజుల నుంచి వరుసగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో నగర వాసులు అవస్థలు పడుతున్నారు. సాయంత్రం కాగానే భారీ వర్షం కురవడంతో.. ఉద్యోగులు ఇంటికి చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.నగరంలోని ప్రతి చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఈ ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు నానా అగచాట్లు పడుతున్నారు. భాగ్యనగరంలో కిలోమీటర్ ప్రయాణానికి వాహనదారుడికి జస్ట్ రెండు మూడుగంటలు సమయం పడుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఉదయం నుంచే పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్ మహానగరంతోపాటు శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ప్రజలకు వాతావరణ శాఖ స్పష్టంగా సూచించింది. రానున్న నాలుగు రోజులపాటు వరుసగా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అలాగే ఉత్తర, ఈశాన్య తెలంగాణ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. గోదావరి నదిలో నీటిమట్టం మరింత పెరిగే అవకాశముందని నీటిపారుదలా శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. నదిలో ప్రవాహ ఉధృతి పెరుగుతోందని వివరించారు. దీంతో నదీ పరివాహక ప్రాంతాలతోపాటు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు జీహెచ్‌ఎంసీ, పోలీస్, హైడ్రా, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగాయి.