Telangana |కవ్వాల్ అభయారణ్యానికి ఆడపులి వలస,కెమెరాట్రాప్ చిత్రం లభ్యం

మహారాష్ట్ర అభయారణ్యం నుంచి తెలంగాణకు ఆడపులి గర్భంతో వలసవచ్చింది. ఈ పులి కవ్వాల పులుల అభయారణ్యంలో సంచరిస్తుందని అటవీశాఖ కెమెరా ట్రాప్ చిత్రాల ద్వారా వెల్లడైంది.;

Update: 2025-02-13 11:10 GMT
కవ్వాల పులుల అభయారణ్యంలో సంచరిస్తున్న పులి (ఫొటో : అటవీశాఖ కెమెరా ట్రాప్ చిత్రం, కర్టసీ : జీఐఎస్)

తెలంగాణ సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో తాడోబా, తిప్పేశ్వర్, గంగావత్ పులుల అభయారణ్యాలున్నాయి. ఈ మూడు పులుల అభయారణ్యాల నుంచి పులులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల పులుల అభయారణ్యానికి వలస వస్తున్నాయి. తాజాగా పొరుగున ఉన్న అభయారణ్యం నుంచి ఓ ఆడపులి గర్భంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవిలోకి ప్రవేశించిందని సమాచారం. గర్భంతో ఉన్న ఆడపులి కవ్వాల అడవుల్లోని సురక్షిత ప్రాంతం కోసం అన్వేషిస్తూ పలు ప్రాంతాల్లో సంచరిస్తుందని అటవీ శాఖ అధికారులకు అందిన సీసీటీవీ పుటేజీలు, పులి కోసం అడవిలో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్ ల ద్వారా సమాచారం అందింది. దీంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై ఆడపులి సురక్షితంగా కవ్వాల అభయారణ్యంలో తిరిగేలా అటవీ గ్రామాల ప్రజలను అడవుల్లోకి వెళ్లవద్దని కోరారు.


పులి సంచారాన్ని పరిశీలిస్తున్నాం : మంచిర్యాల డీఎఫ్ఓ ఆశిష్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో ఆడపులి సంచరిస్తుందని కెమెరా ట్రాప్ ఫొటోలతో వెల్లడైందని, దీని కదలికలపై తాము నిఘా వేశామని మంచిర్యాల డీఎఫ్ఓ ఆశిష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పులి కవ్వాల అభయారణ్యంలో స్థిరపడుతుందని, అభయారణ్యం పులుల నివాసానికి అనువుగా ఉందని ఆయన చెప్పారు. పులి స్వభావసిధ్ధంగా తన ప్రాంతాన్ని ఎంచుకుంటుందని ఆశిష్ చెప్పారు. పులి కదలికలను తాము ఎప్పటికప్పుడు కెమెరా ట్రాప్ ల సాయంతో వాట్సాప్ చిత్రాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని డీఎఫ్ఓ చెప్పారు. పులి సంచారం గురించి వేటగాళ్లకు తెలియకుండా ఉండేందుకు వీలుగా తాము సమాచారాన్ని రహస్యంగా ఉంచుతామని డీఎఫ్ఓ వివరించారు.

అటవీ గ్రామాల్లో భయం...భయం
పొరుగున ఉన్న మహారాష్ట్ర పులుల అభయారణ్యం నుంచి వచ్చిన ఆడపులి బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామం, తాండూర్ మండలం మాదారం గ్రామ అడవుల్లో సంచరిస్తుండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. మాదారం గ్రామ సమీపంలోని అడవి కొండపై బి 1 అనే పులి పాదముద్రలు కనిపించాయి. గర్బం దాల్చిన పులి అడవిలో సురక్షిత ప్రాంత అన్వేషణలో తిరుగుతుందని జన్నారం ప్రాంత అటవీ శాఖ అధికారి శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పగలు మాదారం ప్రాంతంలో సంచరించిన పులి రాత్రివేళ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, తిర్యాణి మండలాలకు వైపు వచ్చిందని అటవీశాఖ అధికారులు చెప్పారు.

జీఐఎస్ ద్వారా కెమెరా ట్రాప్ చిత్రాలు
కవ్వాల పులుల అభయారణ్యంలో పులులు, ఇతర వన్యప్రాణుల సంచారాన్ని కెమెరా ట్రాప్ చిత్రాలతో అటవీశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. పులులు కెమెరా ట్రాప్ వద్దకు వచ్చినపుడు కెమెరా ఫొటోలు, వీడియోను రికార్డు చేసి అటవీశాఖ జియోగ్రాఫిక్ ఇన్ ఫర్ మేషన్ సిస్టమ్ కు పంపిస్తుంది. అటవీశాఖ కార్యాలయంలో ఉన్న జీఐఎస్ కంప్యూటర్ కేంద్రం నుంచి ఈ చిత్రాలను అటవీశాఖ అధికారులకు వాట్సాప్ ద్వారా పంపిస్తుంటారు. ప్రతీ కెమెరాకు ఉన్న కోడ్ సాయంతో పులుల సంచారంపై చిత్రాల డేటాను డౌన్ లోడ్ చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, రేంజిఆఫీసర్లు, డీఎఫ్ఓలకు పంపిస్తుంటారు. ఈ కెమెరా ట్రాప్ చిత్రాల సాయంతో వన్యప్రాణుల కదలికలే కాకుండా వాటి ఆరోగ్యం గురించి తెలుసుకునే వీలుంటుంది.



 భయం గుప్పిట్లో పది గ్రామాలు

మంచిర్యాల జిల్లాలోనూ మరో పులి జాడ వెలుగుచూసింది. కాసిపేట మండలం దుబ్బగూడెం, వారిపేట్, కన్నాల గ్రామాల్లో పులి సంచరిస్తుందని అటవీగ్రామాల ప్రజలు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. కాసిపేట, బెల్లంపల్లి మండలాల్లోని పది గ్రామాల్లో పులి సంచారంతో ఆయా గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో జీవనం వెళ్లదీస్తున్నారు.

చిరుత సంచారంతో రైతులు బెంబేలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీమ్ ఫూర్ మండలం నిపాని గ్రామ పొలాల్లో గురువారం చిరుత కనిపించడంతో రైతులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నిపాని గ్రామ శివార్లలో పొలంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో చిరుతపులి కదలికలు రికార్డు అయ్యాయి.రైతులు అటవీశాఖ అధికారులు చిరుత సంచారం గురించి సమాచారం అందించారు.చిరుత సంచారం నేపథ్యంలో పత్తి రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలాల్లో రైతులు గుంపులుగా శబ్ధం చేస్తూ వెళ్లాలని, చిరుతపులితో ఘర్షణ పడకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని అటవీశాఖ మంచిర్యాట డీఎఫ్ఓ ఆశిష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. బజార్‌హత్నూర్ మండలంలోని డెడ్రా గ్రామంలో గత ఏడాది డిసెంబర్ 14వతేదీన తన పశువుల కొట్టం వద్ద ఉన్న భీమాబాయిపైకి చిరుతపులి దూసుకెళ్లడంతో ఆమె గాయపడ్డారు.

చిరుత సంచారంపై ప్రజలను అప్రమత్తం చేసిన అటవీశాఖ
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవిలో చిరుతపులి సంచరిస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.అనంతగిరి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అడవిలోకి వెళ్లవద్దని వికారాబాద్ జిల్లా అటవీ అధికారి జ్ఞానేశ్వర్ సూచించారు.


Tags:    

Similar News