మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో పారుతున్న పెనుగంగా నదిపై పెనుగంగా ఉమ్మడి ప్రాజెక్టును నిర్మించాలనే కల యాభై ఏళ్లు గడచినా కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్రలోని బుల్దానా, హింగోలి, నాందేడ్, యావత్ మాల్, చంద్రాపూర్, వాషిం జిల్లా సరిహద్దుల్లో ప్రవహిస్తున్న పెనుగంగా నది వర్షాకాలంలో వరదనీటితో పొంగి ప్రవహిస్తుంటుంది. పెనుగంగా నదిపై రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు నిర్మించడం ద్వారా ఇటు తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాల్లోని బీడు భూములను సస్యశ్యామలం చేయాలని ప్రతిపాదించారు. యాభై ఏళ్ల సుదీర్ఘ కల రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరక పెనుగంగా ప్రాజెక్టు కాగితాలకే పరిమితం అయింది.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత...
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక కేసీఆర్ ప్రభుత్వం మహారాష్ట్రతో చర్చించి మహారాష్ట్రలోని చనఖా, ఆదిలాబాద్ లో కోర్ట గ్రామాల మధ్య పెనుగంగా నదిపై బ్యారేజీని నిర్మించాలని నిర్ణయించారు. పెనుగంగా ప్రాజెక్టులో భాగంగా పెనుగంగా నదిపై చనఖా కోర్ట బ్యారేజీని నిర్మించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రూ.1596 కోట్లతో పరిపాలన ఆమోదం తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, జైనథ్, బేల, తాంసి మండలాల్లోని 51,000 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించేలా చేపట్టిన చనఖా కోర్ట బ్యారేజీ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
బ్యారేజీ నిర్మాణంలో జాప్యం
పెనుగంగా నదిపై బ్యారేజీ నిర్మాణానికి రూ.368 కోట్లను, సాగునీటి కాల్వల నిర్మాణానికి రూ.1220 కోట్లను కేటాయించారు. ఈ ప్రాజెక్టు పనులను 2015వ సంవత్సరంలో చేపట్టారు. 2018వ సంవత్సరం నాటికి పూర్తి చేసి రైతుల పొలాలకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సీఎంతో పాటు అప్పటి మంత్రులు హరీష్ రావు, అటవీశాఖ మంత్రి జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి,అప్పటి సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ పర్యవేక్షించినా పనులు మాత్రం పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టరు అప్పటి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సమీప బంధువు కావడంతో పనులు నత్తనడకన సాగాయి. చనఖా కోర్ట బ్యారేజీ నిర్మాణ వ్యయం రూ.368 కోట్లు కాగా, నిర్మాణ జాప్యంతో అది రూ.770 కోట్లకు పెరిగింది. హత్తిఘాట్ వద్ద నిర్మించిన పంపు హౌస్ లో 5.5 మెగావాట్ల మూడు మోటార్లు, 12 మెగావాట్ల మూడు మోటార్లను ఏర్పాటు చేసినా నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేకుండా పోయింది. పంపుహౌస్ వద్ద 30 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉంది. బ్యారేజీ, ప్రధాన కాల్వ పనులు 84 శాతం పూర్తి అయినా భూసేకరణ జరగక పనులు పెండింగులోనే ఉన్నాయి.
కాల్వల నిర్మాణానికి భూసేకరణే సమస్య
చనఖా కోర్ట బ్యారేజీ కింద సాగునీటిని అందించేందుకు కాల్వల నిర్మాణానికి భూసేకరణే ప్రధాన సమస్యగా మారింది. పిల్ల కాల్వల నిర్మానానికి 850 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించినా అది పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టు కింద డిస్ట్రిబ్యూటరీ 16 ఏ నుంచి 19 వరకు కాల్వల నిర్మాణానికి రూ.124.15 కోట్లు కేటాయించారు. భూసేకరణ పూర్తి కాకపోవడంతో కేవలం 16.05 కోట్ల మేర పనులే జరిగాయి. మరో 594 ఎకరాలను సేకరించాల్సి ఉంది.డిస్ట్రిబ్యూటర్ 14 నుంచి 16 వరకు రూ.24.28 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించినా భూసేకరణ సమస్యతో కాల్వ తవ్వకం పనులు పూర్తి కాలేదు.
బ్యారేజీ పూర్తి కాకుండానే లోయర్ పెనుగంగా ప్రధాన కాల్వ నిర్మాణం
కాల్వల నిర్మాణంలో కాంట్రాక్టరుకు కాసుల గలగలలు వస్తుండటంతో బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే లోయర్ పెనుగంగా ప్రధాన కాల్వ ను తవ్వారు.ఈ ప్రధాన కాల్వ తవ్వకానికి రూ.259.81 కోట్లను వెచ్చించారు. బ్యారేజీ పూర్తి కాక కాల్వ తవ్వినా నిరుపయోగంగా ఉంది.
రేవంత్ సర్కారుపైనే రైతుల ఆశలు
భూసేకరణకు కావాల్సిన నిధులతోపాటు పెరిగిన బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని మంజూరు చేస్తేనే చనఖా కోర్ట ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుందని నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారి ఒకరు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. భూసేకరణలో భాగంగా భూములిచ్చిన వారికి నష్టపరిహారంతోపాటు ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, పక్కా ఇల్లు నిర్మించాలని రైతులు విలాస్ రావు, బాపన్న, భోజిరెడ్డిలు డిమాండ్ చేశారు. కానీ ఆచరణ రూపం దాల్చక పోవడంతో భూసేకరణ జరగలేదు. కొత్త ప్రభుత్వం అయినా దృష్టి సారించి నిధులు మంజూరు చేసి అసంపూర్తిగా ఉన్న చనఖా కోర్ట బ్యారేజీని పూర్తి చేయాలని ఆదిలాబాద్ ప్రాంత రైతులు కోరుతున్నారు.
అసెంబ్లీలో ప్రస్థావించినా నిధులివ్వలేదు : ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్
మారుమూల వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా బీడు భూముల సాగుకు ఉద్ధేశించిన చనఖా కోర్ట బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరుతూ తాను ఇప్పటికే నాలుగు సార్లు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. సంబంధిత శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టును స్టేజి వన్ లో చేర్చి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని కానీ నిధులివ్వలేదని శంకర్ చెప్పారు. కాల్వల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణలో జాప్యం జరుగుతోందని, సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణం వేగవంతంగా పూర్తి కావడం లేదన్నారు. ఇప్పటికైనా నిధులు విడుదల చేసి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని పాయల శంకర్ డిమాండ్ చేశారు.