సహకారశాఖ దర్యాప్తుల్లో వెలుగుచూసిన ఫిలింనగర్ భూబాగోతాలు

హైదరాబాద్ లోని ఫిలింనగర్‌లో ప్రభుత్వ భూములను సినీపరిశ్రమ అభివృద్ధి పేరిట అనర్హులు దక్కించుకున్నారు. ఈ భూముల బాగోతాలు దర్యాప్తుల్లో బయటపడ్డాయి.;

Update: 2025-04-12 11:59 GMT
ఫిలింనగర్

హైదరాబాద్ నగరంలో చిత్రపరిశ్రమాభివృద్ధి కోసం ఫిలింనగర్‌లో కేటాయించాల్సిన భూములు పక్కదారి పట్టాయి. సినీరంగంలో పనిచేస్తున్న వారికి నివాస గృహాల నిర్మాణంతోపాటు స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు,డబ్బింగ్ థియేటర్లు, లాబోరేటరీలు, ఎడిటింగ్ యూనిట్స్, అవుట్‌డోర్ ఎక్విప్‌మెంట్ యూనిట్స్, ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్, ఇతర సినిమా అనుబంధ యూనిట్ల ఏర్పాటు కోసం భూములను కేటాయించాలని ఫిలింనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ బైలా చెబుతోంది. కాని దీనికి విరుద్ధంగా అనర్హులకు భూములను కేటాయించడం, బదిలీ చేశారని దర్యాప్తులో వెల్లడైంది.హైదరాబాద్ సహకార శాఖ అదనపు రిజిష్ట్రార్ డాక్టర్ ఎన్ కిరణ్మయీ ఫిలింనగర్ భూముల బాగోతాలపై దర్యాప్తు చేసి నివేదికను సహకార శాఖ కమిషనరుకు సమర్పించారు. ఈ నివేదికలో పలు ఉల్లంఘనలు, అక్రమాలు వెలుగుచూశాయి.


మురళీమోహన్ కుటుంబ సభ్యుల పేరిట...
జయభేరి ఆర్ట్ ప్రోడక్షన్ అధినేత, ప్రముఖ సినీనటుడు మాగంటి మురళీ మోహన్ తన భార్య విజయలక్ష్మీని నామినీగా ఉండగా,కుమారుడు మాగంటి రామ్మోహన్ జయభేరి ఆర్ట్ ప్రోడక్షన్ మేనేజింగ్ పార్ట్ నరుగా చూపించి ప్లాట్ నంబరు 16 కొనుగోలు చేశారు. మాగంటి రామ్మోహన్, అడుసుమిల్లి రూపాలు కలిసి ప్లాట్ నంబరు 16, 17లలో భవనం నిర్మించారు. మురళీమోహన్ కోడలైన ఏ రూపా సినీనటుడు జేవీ రమణమూర్తి నుంచి 17వ నంబరు ప్లాట్ ను కొనుగోలు చేశారు. అడుసుమిల్లి రూపా సినీ టెక్నీషియన్ అని చూపించి ప్లాట్ కొన్నారు. కానీ ప్లాట్ రిజిస్ట్రేషనులో రూపా విద్యార్థినిగా చూపించారు. సినీ టెక్నీషియన్ పేరిట కోడలు రూపా ఫిలింనగర్ భూమిని కొనుగోలు చేసిన వ్యవహారం జిల్లా సహకార శాఖ అధికారిణి డాక్టర్ ఎన్ కిరణ్మయీ విచారణలో తేలింది. మురళీమోహన్ కు 1982లో తీసిన డ్రాలో 37వ నంబరు ప్లాట్ అలాట్ కాగా ఆయన దాని స్థానంలో 14వ నంబరు ప్లాట్ ను మార్పిడి చేసుకున్నారు.

మాజీ కార్యదర్శి కె సూర్యనారాయణ
ఫిలింనగర్ సొసైటీ మాజీ కార్యదర్శి కె సూర్యనారాయణ 1979వ సంవత్సరంలో ఫిలింనగర్ లో ప్లాట్ నంబరు 2ను తీసుకొని దాన్ని నిబంధనలకు విరుద్ధంగా సత్యవతికి విక్రయించారు.గతంలో సొసైటీ కార్యదర్శిగా ఉన్న సూర్యనారాయణ తన భార్య కేఎస్ కుమారి కి ప్లాట్ నంబరు 2ను కేటాయించారు. కేఎస్ కుమారి తన దరఖాస్తులో వ్యాపారినని పేర్కొన్నారు. మరో దరఖాస్తులో శ్రీ సినటీ క్రాఫ్ట్ పార్ట్ నరునని పేర్కొన్నారు. తన భార్య దరఖాస్తుపై అప్పటి సెక్రటరీ అయిన భర్త కె సూర్యనారాయణ సంతకం చేయలేదని విచారణలో గుర్తించారు.

దర్యాప్తులో తేలిన నిజాలు
ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీలో సినీపరిశ్రమతో సంబంధం లేని వారిని బోగస్ సభ్యులు చేర్చుకొని వారికి భూములను కేటాయించారని ఎన్ కిరణ్మయీ దర్యాప్తులో తేలింది.మద్రాస్ నుంచి సినీపరిశ్రమను హైదరాబాద్ కు తరలించేందుకు ఫిలింనగర్ ప్లాట్లను కేటాయించగా వారు సినిమా రంగానికి సంబంధం లేని రియల్ ఎస్టేట్ యజమానులకు భూములను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించారని తేలింది. భూముల కేటాయింపు, బదిలీ, విక్రయాల్లో భారీగా నిబంధనలను ఉల్లంఘించారు. ఫిలింనగర్ భూముల్లో ఆక్రమణలు జరిగినా సొసైటీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఎన్నెన్నో ఉల్లంఘనలు...
- ఫిలింనగర్‌ ప్రారంభంలో ప్రధాన రహదారిపై ఉన్న ప్లాట్ నంబరు 1 ను సినీ గేయ రచయిత సీతారామ శాస్త్రికి హౌసింగ్ సొసైటీ కేటాయించింది. ఈ ప్లాట్ ను ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన భవ్య కన్‌స్ట్రక్షన్స్ అధినేత ఎస్వీ ఆనంద్ ప్రసాద్ సొంతం చేసుకున్నారు. ఈ ప్లాటును రెండుగా విభజించి సినిమా పరిశ్రమకు సంబంధం లేని వాణిజ్య కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. ఒక భవనంలో రియల్ ఎస్టేట్ కార్పొరేట్ కార్యాలయాన్ని, మరో భవనంలో భవ్య సిమెంటు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
- ఫిలింనగర్ లో ప్లాట్ నంబరు 2ను ప్రముఖ సినీనటి మాధవికి కేటాయించగా, ఆమె నుంచి కాస్మో గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసి సినిమా పరిశ్రమకు సంబంధం లేని గ్రానైట్ వ్యాపారం సాగిస్తోంది.
- ప్లాట్ నంబరు 10ని బద్రీనాథ్ కు కేటాయించగా అతని నుంచి సినిమా పరిశ్రమకు సంబంధం లేని జి సుధారాణి సొంతం చేసుకొని ఇందులో వాణిజ్య భవనాన్ని నిర్మించి నాలుగు షాపులు, లోపల గెస్ట్ హౌస్, డాన్స్ స్కూలు నిర్వహిస్తోంది. ప్లాట్ నంబరు 11లో కె రంగాదేవి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి ఇందులో ఎస్బీఐ ఏటీఎం, మెడిప్లస్ మెడికల్ షాప్,ఫ్రెష్ హెరిటేజ్ కు లీజుకు ఇచ్చారు.ప్లాట్ నంబరు 12 డి వెంకటనర్సింహారావుకు కేటాయించగా, దీన్ని దక్కన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు అద్దెకు ఇచ్చారు.

కమర్షియల్ కాంప్లెక్సుల నిర్మాణం
ప్లాట్ నంబరు 32ను ఎస్ శ్రీధర్ కు కేటాయించగా, ఆయన తన నామినీ ఎస్ రత్నకుమారికి బదలాయించారు. దీనిలో భవనం నిర్మించి జెహెచ్ఎస్ అర్బన్ బ్యాంకు, ఇతర కార్యాలయాలకు అద్దెకు ఇచ్చారు. ప్లాట్ నంబరు 33ని ఎ సూర్యనారాయణకు కేటాయించగా, ఆయన నిబంధనలను ఉల్లంఘించి విజయబ్యాంక్ బ్రాంచి, ఏటీఎం, రిలయన్స్ ఫ్రెష్, బాలాజీ కలర్ ల్యాబ్ కు అద్దెకు ఇచ్చారు.ప్లాట్ నంబరు 35 ఏ, 35 బిలలో జనప్రియ రియల్ ఎస్టేట్ యజమానులు కె. రవీందర్ రెడ్డి, కె క్రాంతికుమార్ రెడ్డిల చేతుల్లో ఉంది.ఫిలింనగర్ లోని ప్లాట్ నంబరు 29,32,33,35,36,38,39,40,41లలో సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా అపార్టుమెంట్లు నిర్మించారు.ప్లాట్ నంబరు 11లో సాఫ్ట్ వేర్ కార్యాలయం, ప్లాట్ నంబరు 12లో హల్దీరామ్ గోదాము ఏర్పాటు చేశారు. ప్లాట్ నంబరు 21లో టైచీ ఇండస్ట్రీస్, 21 సిలో షాపులు, ప్లాట్ నంబరు 53లో కాస్మో క్లినిక్, ట్రావెల్ ఏజెన్సీలు నిర్వహిస్తున్నారు.

రోడ్డునూ ఆక్రమించేశారు...
ఫిలింనగర్ లో 54,55 ప్లాట్ లను జి పద్మావతి దేవి, అతని కుమారుడు అశోక్ లు దక్కించుకున్నారు. ఈ రెండు ప్లాట్ల మధ్య రోడ్డు ఉన్నా, వీరు రోడ్డునే ఆక్రమించేసి రెండు ప్లాట్లను కలిపి భవనం నిర్మించారు.ప్లాట్ నంబరు 69ని బేబీ సూర్యప్రభకు కేటాయించగా, పి లక్ష్మీ దాన్ని సొంతం చేసుకొని పక్కన ఉన్న పార్కు స్థలాన్ని కూడా ఆక్రమించుకొని కృష్ణవేణి టాలెంట్ స్కూలును ఏర్పాటు చేశారు. ప్లాట్ నంబరు 76లో హెట్రో ల్యాబ్స్ పాగా వేసింది. ప్లాట్ నంబరు 14లో పి రాజేంద్రకుమార్ పీటి దక్కించుకొని అందులో బిజినెస్ కాంప్లెక్స్ నిర్మించి బిర్యానీ హోటల్, కు అద్దెకు ఇచ్చారు. ప్లాట్ నంబరు 23లో భవనాన్ని విస్సా టెలివిజన్ నెట్ వర్క్ కు అద్దెకు ఇచ్చారు. 63 వ నంబరు ప్లాట్ ను వీఎస్ఆర్ స్వామికి కేటాయించగా, ఆయన దాన్ని రెండు ప్లాట్లుగా విభజించి, సినీపరిశ్రమతో సంబంధం లేని ప్రస్థుత తెలంగాణ అసెంబ్లీ కౌన్సిల్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,సుభీర్ భౌమిక్ లకు విక్రయించారు.



 సీబీఐ విచారణ జరిపించాలి : ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి

ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీలో జరిగిన భూ బాగోతాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి కోరారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖలు రాసింది. చిత్రపరిశ్రమ అభివృద్ధి పేరిట ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమతో సంబంధం లేని బడా వ్యక్తులు కారుచౌకగా తీసుకున్నారని సహకార శాఖ అధికారులు జరిపిన విచారణలో తేలిందని పద్మనాభరెడ్డి చెప్పారు. విజిలెన్స్ రిపోర్టులు, సహకార శాఖ అధికారులు జరిపిన దర్యాప్తుల్లో అక్రమాలు వెలుగుచూసినా, దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పద్మనాభరెడ్డి వివరించారు.





Tags:    

Similar News