హైదరాబాద్‌ స్వీట్ షాపులపై ఫుడ్‌సేఫ్టీ అధికారుల కొరడా, పది దుకాణాల సీజ్

హైదరాబాద్ నగరంలోని స్వీట్ షాపులపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు.పది స్వీట్ షాపులను అధికారులు సీజ్ చేశారు.;

Update: 2025-06-15 11:12 GMT
నిబంధనలు పాటించని స్వీట్ షాపు సీజ్

హైదరాబాద్ నగరంలోని స్వీట్ షాపుల్లో అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నాయి.ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా నాసిరకం ఆయిల్స్, ఆహార పదార్థాలతో మిఠాయిలు తయారు చేస్తున్నారు. కల్తీ పదార్థాలను వినియోగించి స్వీట్లు తయారు చేసి స్వీట్ షాపుల యజమానులు ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమయ్యారు. అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ, కాలం చెల్లిన పదార్థాలతో, కల్తీ ఆయిల్ తో తయారు చేసిన స్వీట్లు తింటే అనారోగ్యం గ్యారంటీ. కాలం చెల్లిన స్వీట్లు తింటే ఆసుపత్రిలో చేరాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నారు. 


స్వీట్ షాపులపై వరుస దాడులు

గతంలో ఫుడ్ సేఫ్టీ కమిషనరుగా పనిచేసిన ఐఎఎస్ అధికారి ఆర్వీ కర్ణన్ జీహెచ్ఎంసీ కమిషనరుగా రావడంతో నగర అభివృద్ధితోపాటు ప్రజారోగ్యంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈ నెల 11వతేదీన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఆకస్మిక తనిఖీలు చేయించారు. ఒకే రోజు 69 మిఠాయి దుకాణాలపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు.

ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు నీళ్లు
నగరంలోని పలు స్వీట్ షాపులు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006, ఫుడ్ సేఫ్టీ రూల్స్, రెగ్యులేషన్స్ 2011 కు విరుద్ధంగా ఉన్నాయని ఆకస్మిక తనిఖీల్లో తేలింది. దీంతో పలు స్వీట్ షాపులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. స్వీట్ షాపుల యజమానులు స్వీట్లు తయారు చేసే కిచెన్ లలో పరిశుభ్రంగా ఉంచాలని,మిఠాయిలు, ఆహార పదార్ధాలపై తయారీ తేదీ, వాటి ని ఎన్నిరోజుల్లోగా వినియోగించాలనే లేబుల్స్ పెట్టాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసుల్లో కోరారు.



 పది ఫుడ్ ఎష్టాబ్లిష్ మెంట్ల మూసివేత

స్వీట్ షాపులు, ఇతర ఆహార పదార్థాలు తయారు చేసే దుకాణాలు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 సెక్షన్ 31 (10 ప్రకారం ఫుడ్ లైసెన్సు తీసుకోవాలి. ప్రతీ స్వీట్ షాపును రిజిస్ట్రేషన్ చేయించాలి. ఫుడ్ లైసెన్సు పొంద కుండా, ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని పది స్వీట్ షాపులను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. లైసెన్సు లేని షాపులు తెరవ వద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎల్ బీ నగర్ సర్కిల్ లోని శ్రీ లక్ష్మీ మిఠాయి భండార్, శ్రీ రాఘవేంద్ర స్వీట్ హౌస్ అండ్ బేకరి, శ్రీ సాయిరాం హాట్ చిప్స్ అండ్ స్వీట్స్, కొత్తపేటలోని న్యూబాలాజీ మిఠాయి భండార్ అండ్ హాట్ చిప్స్ , చార్మినార్ అలీజా కోట్లలోని సూపర్ స్వీట్స్ , రామంతాపూర్ లోని బాలాజీ రామస్వరూప్ మిఠాయి భండార్, శేరిలింగంపల్లి సర్కిల్ లోని ప్రేమ్ స్వీట్స్ అండ్ సావరీస్, ఆర్సీపురం మల్లికార్జుననగర్ లోని శ్రీ బాలాజీ చగన్ లాల్ మిఠాయి భండార్, ఆర్సీపురం సర్కిల్ బీరంగూడలోని శ్రీ రాఘవేంద్ర హాట్ చిప్స్, అల్వాల్ పరిధిలోని మచ్చబొల్లారం ఏకలవ్యనగర్ లోని జోధ్ పూర్ మిఠాయి వాలా దుకాణాలను మూసివేయించారు.



 అధికారుల ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్ నగరంలోని స్వీట్ షాపులపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. గతంలో హోటళ్లు, హాస్టళ్లపై ఆకస్మిక తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు తాజాగా స్వీట్ షాపుల్లో తనిఖీలకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. అపరిశుభ్ర వాతావరణంలో మిఠాయిలు తయారు చేస్తున్న స్వీట్ షాపుల లైసెన్సులను రద్దు చేసి వాటిని సీజ్ చేస్తున్నారు. స్వీట్ షాపుల యజమానులు కొందరైతే ఈ దాడుల్లో తమ బండారం బయటపడుతుందని దుకాణాలను తాత్కాలికంగా మూసి ఉంచారు. హోటళ్లే కాదు స్వీట్ షాపుల్లో కాలం చెల్లిన స్వీట్లు, నాసిరకం నూనెతో తయారు చేసిన పదార్ధాలు తనిఖీల్లో కనిపించాయి.ఐడీఏ మల్కాపూర్ పరిధిలోని అమన్ మిఠాయివాలా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అపరిశుభ్ర పరిస్థితులున్నాయని దాన్ని అధికారులు సీజ్ చేశారు. స్వీట్లు తయారు చేస్తున్న కిచెన్ అపరిశుభ్రంగా దుర్గంధం వెలువడుతుందని తనిఖీల్లో తేలింది. మిఠాయిలు తయారు చేసే కార్మికులు హెయిర్ నెట్లు, చేతులకు గ్లోవుజులు, అప్రాన్లు ధరించలేదు. కార్మికుల మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్లు లేవు. 300 కిలోల మిఠాయిలు కాలం చెల్లినవి అధికారులు గుర్తించారు. ఫంగల్ ఇన్ఫెక్షన్ , అధిక ఫుడ్ కలర్స్ ను మిఠాయిల తయారీలో వాడారని ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.

స్వీట్ షాపులపై ప్రత్యేక డ్రైవ్
స్వీట్ షాపులపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోందని, ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ లేని అవుట్‌లెట్‌లపై చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ చెప్పారు. చెల్లుబాటు అయ్యే లైసెన్స్ పొందే వరకు ఆహార వ్యాపార కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్వాహకులను ఆదేశించారు. ఆహార భద్రత సమస్యలను పరిష్కరించడం కోసం స్వీట్ షాపులపై ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు నగరంలో వరుస దాడులు నిర్వహించారు.ఎల్‌బి నగర్, కొత్తపేట, చార్మినార్, రామనాథ్‌పూర్, శేరిలింగంపల్లి, బీరామ్‌గూడ, మచ్చ బొల్లారంలలో ఉన్న 10 మిఠాయి దుకాణాలను మూసివేయించారు. నగరంలో ఇటీవల 79 ఆహార దుకాణాలపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు.

పాటించని ఫుడ్ సేఫ్టీ నిబంధనలు
హైదరాబాద్ నగరంలోని స్వీట్ షాపుల్లో తెగులు నియంత్రణ రికార్డులు, నీటి విశ్లేషణ నివేదికలు లేవని ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది. ఆహార నిర్వహణదారులు పోస్టాక్( FoSTaC) శిక్షణ పొందిన కార్మికుల వైద్య ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవని గుర్తించారు.స్వీట్ షాపు ప్రాంగణ గోడలపై పాన్, పొగాకు మరకలు కనిపించాయి.స్వీట్ షాపుల స్టోర్ రూమ్ లు అపరిశుభ్ర స్థితిలో ఉన్నాయి. స్వీట్ షాపుల్లో భారీ మొత్తంలో గడువు ముగిసిన మిఠాయిలను గుర్తించారు.ఆహార రంగును అధికంగా ఉపయోగించడం వల్ల దుకాణాల్లోని స్వీట్లు మానవ వినియోగానికి తగినవి కావని ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీల్లో వెల్లడైంది. కొన్ని దుకాణాల్లో సపోటాలు, నారింజ వంటి కొన్ని పండ్లు కుళ్లి పోయి ఉన్నాయి.


Tags:    

Similar News