బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్.. కొరడా ఝులిపిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు

చికెన్‌ను నిల్వ చేయడానికి రసాయనాల వినియోగం. ఇవి బర్డ్‌ఫ్లూ కన్నా ప్రమాదకరమని గుర్తించిన అధికారులు.;

Update: 2025-02-14 07:08 GMT

తెలంగాణలో బర్డ్‌ఫ్లూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కొన్ని వారాలుగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ సోకి కోళ్లు అధిక సంఖ్యలో మరణిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం హైఅలెర్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ కేసులు అధికంగా ఉన్న కారణంగా ఏపీ కోళ్లను తెలంగాణలోకి రానివ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఎక్కడిక్కడ చెక్‌పోస్ట్‌లు నిర్వహించి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని ఆదేశించింది. దీంతో వెటర్నరీ డాక్టర్లు, పోలీసులు ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో చెక్‌పోస్ట్‌లు నిర్వహించి తనిఖీలు చేస్తున్నారు. అయినప్పటికీ తెలంగాణలో కూడా బర్డ్‌ఫ్లూ వ్యాపించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం మరిన్ని ప్రికాషనరీ చర్యలు చేపట్టింది. ఫుడ్ సేఫ్టీ అధికారులను అలెర్ట్ చేసింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడిక్కడ తనిఖీలు చేపడుతున్నారు. న్యాణ్యతగా లేని చికెన్ అమ్మకాలు చేస్తున్నవ్యాపారులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. పలుసార్లు హెచ్చరించినా వ్యాపారులు తమ ధోరణి మారకపోవడంతో అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో విస్తృత తనిఖీలు చేపట్టారు.

భారీగా కుళ్లిన చికెన్

ఈ సోదాల్లో భాగంగా రసూల్‌పురలోని అన్నానగర్‌లోని చికెన్ షాపుల్లో కుళ్లిన చికెన్ ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ఇది భారీ మొత్తంలో ఉండటంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తనిఖీల్లో దాదాపు 500 క్వింటాలకు పైగా కుళ్లిన చికెన్‌ను అధికారులు గుర్తించారు. ఈ కుళ్లిన చికెన్‌ను పలు సెంటర్లను తరలించడానికి సిద్ధం చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ కుళ్లిన చికెన్‌ను ఫైన్ షాపులు, బార్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు తక్కువ ధరలకు అమ్ముతున్నట్లు అధికారులు దృష్టికి వచ్చింది. దీంతో చికెన్ మొత్తాన్ని సీజ్ చేయడంతో పాటు సదరు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించారు అధికారులు.

ప్రమాదకర కెమికల్స్ వినియోగం

అంతేకాకుండా చికెన్‌ను మూడు నెలల పాటు నిల్వ చేయడానికి ప్రమాదకర కెమికల్స్ వినియోగిస్తున్నట్లు అధికారులు కల్పించారు. కెమికల్స్ వినియోగించి కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ ఉంచుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కెమికల్స్‌లో ప్రధానంగా ఫార్మలిన్ కలుపుతున్నట్లు నిర్దారించారు అధికారులు. వీరు వినియోగిస్తున్న కెమికల్స్.. బర్డ్‌ఫ్లూ కంటే ప్రమాదకరమైనవని అధికారులు పేర్కొన్నారు. ఈ షాపుల్లో గతంలో కూడా భారీ మొత్తంలో కుళ్లిన చికెన్‌ను గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇప్పుడు మరోసారి వీరి దగ్గర నుంచి కుళ్లిన చికెన్ లభించడంతో సదరు షాపుల లైసెన్స్‌ను రద్దు చేశారు అధికారులు. సదరు వ్యాపారులపై కేసులు కూడా నమోదు చేశారు. కుళ్లిన చికెన్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags:    

Similar News