Harish Rao | ప్రతి క్వింటాకు రైతు నష్టపోతున్నాడు.. ప్రభుత్వంపై హరీష్ రావు విసుర్లు

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రైతులు నష్టాల పాలవుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో కష్టం తెలియని రైతన్నలను కాంగ్రెస్ నిలువునా ముంచిందని మండిపడ్డ హరీష్ రావు.

Update: 2024-11-22 07:03 GMT
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు

కాంగ్రెస్(Congress) ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రైతులు(Farmers) నష్టాల పాలవుతున్నారు. వారిని ఆదుకోవడం కోసం ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రతి పంటకు మద్దతు ధర అందిస్తామని, రైతులకు రూ.500 బోనస్ కూడా ఇస్తామంటూ కబుర్లు చెప్పి కాంగ్రెస్ ఇప్పుడు మౌన ముద్ర వేసిందంటూ మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) విమర్శలు వెల్లువెత్తించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బోనస్ మాట దేవుడెరుగు అసలు కనీస మద్దతు ధర కూడా రైతులకు లభించడం లేదని, ప్రతి క్వింటాకు రైతు నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పాలన సమయంలో ఏనాడూ కూడా రైతు కంట కన్నీరు రాలేదని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రతి రోజును రైతు కన్నీటితోనే ప్రారంభిస్తున్నాడని అన్నారు హరీష్.

‘‘పత్తిలో ప్రతి క్వింటాకు రైతు రూ.1500 నష్టపోతున్నాడు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం, ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు బనాయించడం, కుట్రలు, కుంభకోణాలు చేయడం తప్ప ప్రజల కోసం, రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది గుండు సున్నా. వరి, పత్తి పంటలు దళారుల పాలవుతుంటే కాంగ్రెస్ చోద్యం చూస్తోంది. వాటిని కాపాడటానికి, రైతులను రక్షించడానికి ఏం చర్యలు తీసుకుందో ప్రభుత్వమైనా చెప్పగలదా? రైతు బంధు అందక, మద్దతు ధర లభించిన రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే తెలంగాణలో మళ్ళీ రైతు ఆత్మహత్యలు మొదలయ్యేలా కనిపిస్తున్నాయి’’ అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘కేసీఆర్(KCR) పాలనలో రైతులు ఏనాడూ కష్టపడలేదు. పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో పత్తికి గరిష్ఠంగా రూ.11వేలు, కనిష్ఠంగా రూ.9వేల ధర పలికింది. ఇప్పుడు అందులో సగం కూడా పలకట్లేదు. పత్తి ధర ఎందుకు తగ్గింది? పత్తి రైతులకు ధర రావాలి. రూ.500 బోనస్ రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర దళారులు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలకు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ మాటలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు ప్రజా సమస్యలను గాలికొదిలి ఆధిపత్యం కోసం చేస్తున్న పోరులో బిజీ అయిపోయారు’’ అని ఎద్దేవా చేశారు హరీష్ రావు.

Tags:    

Similar News