తెలంగాణలో సంగీత కళాకారుడి రాతిచిత్రాల తావు
మెదక్ జిల్లా వెంకటాయపల్లిలో కనిపించిన అరుదైన పురాతన కుడ్యచిత్రాలు
మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలంలోని వెంకటాయపల్లిగ్రామం శివార్లో చంద్రయ్యగారి భూమిలో కొత్త రాతిచిత్రాలతావును కొత్త తెలంగాణచరిత్రబృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్, కొరివి గోపాల్ గుర్తించారు.
ఈ తావును బృందం సభ్యులతో కలిసి సందర్శించిన కొత్త తెలంగాణచరిత్రబృందం కన్వీనర్, కో-కన్వీనర్లు శ్రీరామోజు హరగోపాల్, బీవీ భద్రగిరీశ్ మిత్రుడు కె.జయంత్ ఈ రాతిచిత్రాలను విశ్లేషించారు.
రెండురాతిగుండ్ల మీద పేర్చిన రాతిబండలెక్క కనిపించే ఈ శిలాశ్రయం నేలమీదనే ఉంది. ఈ తావులో కనిపించిన రాతిచిత్రాలు ఎరుపురంగులో వున్నాయి. వీటిలో ఎడమవైపు రాతిగుండుపై వేసిన చిత్రాలలో ఒక దేవుని రథం, దానికి కట్టిన రెండెద్దులు, ఒకవైపు ముగ్గుపట్టీ అలంకరణ, మరొకవైపు తీగెలవాద్యాన్ని(String instrument) భుజంపై పెట్టుకుని వాయిస్తున్న కళాకారుడు (String Player) కనిపిస్తున్నారు. కుడివైపు రాతిగుండు మీద ఒక రాక్షసునివంటిబొమ్మ, మరొకటి వీరునిబొమ్మ పోరుచేస్తున్నాయి. వీటికి పైన పెద్దతోక కోతిబొమ్మ(హనుమంతుడు?) కనిపించింది. అన్నింటిపైన సర్పంవంటి పొడవైన గీతగీసి వుంది.
రాతిచిత్రాలలో తంత్రీవాద్యంతో కళాకారుడు కనిపించడం ఇదే ప్రథమం అని బీవీభద్రగిరీశ్ అన్నారు.