‘ఆఖరి క్వింటాల్ వరకు పత్తి కొనుగోలు చేస్తాం’
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామి
తెలంగాణలో వరి తర్వాత అత్యధికంగా సాగవుతున్న పంట పత్తి. 45 లక్షల ఎకరాల్లో 22 లక్షల మంది రైతులు పత్తిని సాగు చేస్తున్నారు. గతేడాది మాదిరిగా ఈ సంవత్సరం కూడా కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా చివరి క్వింటాల్ వరకు పత్తి కొనుగోలు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రైతులు దళారుల చేతిలో పడి మోసపోకూడదని ఆయన సూచించారు. క్వింటాల్ పత్తి 8,110 రూపాయలకు కాటన్ కార్పోరేషన్ కొనుగోలు చేస్తుందన్నారు. పత్తి సాగులో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని అన్నారు. 112 కొనుగోలు కేంద్రాలు పని చేస్తున్నాయని, మరో 12 కొనుగోలు కేంద్రాలు పెంచినట్టు కిషన్ రెడ్డి చెప్పారు. తొమ్మిది ప్రాంతీయ భాషల్లో పత్తి సాగుకు కిసాన్ యాప్ అందుబాటులోకి తెచ్చినట్టు కేంద్రమంత్రి తెలిపారు. ఈ యాప్ లో రైతులు పేర్లు నమోదు చేసుకుంటే పత్తిని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవచ్చని ఆయన పేర్కొన్నారు. పత్తి శుద్ది, రవాణా కోసం ప్రత్యేకంగా జిన్నింగ్ మిల్లులను ఎంపిక చేయడం జరిగిందని కేంద్రమంత్రి తెలిపారు.
హైడెన్సిటీ ప్లాంటేషన్ తో రెట్టింపు దిగుబడి
హై డెన్సిటీ ప్లాంటేషన్ చేస్తున్న మహరాష్ట్ర అకోలా రైతులను కేంద్రమంత్రి అభినందించారు. హై డెన్సిటీ ప్లాంటేషన్ వల్ల పత్తి దిగుబడి రెట్టింపు అవుతుందని , అవగాహన కోసం మహారాష్ట్ర తీసుకెళతామని కిషన్ రెడ్డి చెప్పారు.
వచ్చే ఏడాది నుంచి హై డెన్సిటీ ప్లాంటేషన్ చేస్తామన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి పిడియాక్ట్ ప్రయోగం చేస్తామని కిషన్ రెడ్డి హెచ్చరించారు. నకిలీ విత్తనాలను అమ్మే వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రంలో ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పత్తి కనీస మద్దత్తు ధర వందశాతం పెరిగిందని కిషన్ రెడ్డి చెప్పారు.