‘బీజేపీకి బీసీలంటే ప్రేమ ఉంటే.. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లండి’
అఖిలపక్షంతో కలిసి ఢిల్లీకి రావడానికి సీఎం రేవంత్ సంసిద్ధమన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందంటూ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో మద్దతు ఇస్తున్న బీజేపీ.. కేంద్రానికి వెళ్లగానే ప్లేటు ఫిరాయించేస్తుందని చురకలంటించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదముద్ర వేసినా కేంద్రం మాత్రం పెండింగ్‌లో పెట్టిందని గుర్తు చేశారు. బీసీలంటే బీజేపీకి నిజంగా ప్రేమ ఉంటే బీసీ బిల్లుకు అడ్డుపడకూడదన్నారు. ఈ అంశంపై చర్చించడానికి సమయం ఇవ్వాలంటూ సీఎం రేవంత్ లేఖ రాసినా.. మోదీ టైమ్ ఇవ్వడం లేదని అన్నారు. ఈ విషయంలో తెలంగాణలోని బీజేపీ నాయకులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండిసంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు.. కేంద్రంలోని బీజేపీతో మాట్లాడి తెలంగాణ అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుని వెళ్లాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై భట్టి.. ఖమ్మం జిల్లాలో మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ సమయం కేటాయిస్తే అఖిలపక్షంతో కలిసి రావడానికి సీఎం రేవంత్ సంసిద్ధమని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో గతంలోనే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర భారీ ధర్నా నిర్వహించామని గుర్తు చేశారు. అప్పుడు అందులో తెలంగాణ బీజేపీ నాయకులు ఎవరూ పాల్గొనలేదని చెప్పారు. అంతేకాకుండా అప్పుడు కూడా తాము ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్‌మెంట్లు కోరామని, కానీ వారు ఇవ్వలేదని చెప్పారు. బీసీ బిల్లును పార్లమెంట్‌లో బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది? అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు చేపట్టనున్న తెలంగాణ బంద్.. బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా జరుగుతోందని, ఈ బంద్‌కు కాంగ్రెస్ నేతలంతా మద్దతు ఇవ్వాలని కోరారు.
‘‘ఓబీసీ బిల్లుపై బీజేపీ ఎందుకు మొండి వైఖరి అవలంభిస్తోంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు వివరించాలి. ప్రధానితో అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఓబీసీ బిల్లుకు ఆమోద ముద్ర వేయించొచ్చు కదా. బిల్లులకు మీరు అడ్డుపడుతూ కాంగ్రెస్‌పై బురదజల్లే ప్రయత్నాలు ఏంటి? బీజేపీకి బుద్ధి చెప్పడానికి ఓబీసీ ప్రజలే కాదు.. అన్ని వర్గాల వారు రెడీ ఉన్నారు. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు’’ అని పేర్కొన్నారు.