ఆర్ కృష్ణయ్య రిజర్వేషన్లపై డబల్ గేమ్ ఆడుతున్నారా ?

నరేంద్రమోదీతో మాట్లాడి రేవంత్, ఇతర పార్టీలకు అపాయిట్మెంట్ ఇప్పించేందుకు కృష్ణయ్య ఏమైనా ప్రయత్నించారా ?

Update: 2025-10-17 11:45 GMT
BJP MP R Krishnaiah

బీసీ సంక్షేమం ముసుగులో బీసీ రిజర్వేషన్ల పేరుతో ఆర్ కృష్ణయ్య డబుల్ గేమ్ ఆడుతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఇదే అనుమానం పెరిగిపోతోంది. విషయం ఏమిటంటే స్ధానికసంస్ధల ఎన్నికల్లో (Local body elections)బీసీలకు 42శాతం రిజర్వేషన్ల(BC Reservations) అమలులో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చొరవచూపాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈడిమాండ్ కారణంగనే కృష్ణయ్య చిత్తశుద్దిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఎలాగంటే రిజర్వేషన్ల అమలుకు ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయగలిగిందంతా చేసింది. అసెంబ్లీలో మూడుసార్లు బీసీ రిజర్వేషన్లకోసం బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించింది. మొదటి రెండుసార్లు బిల్లులు ఆమోదించినపుడు రాష్ట్రపతి దగ్గరకు తర్వాత కేంద్ర హోంశాఖకు పంపింది. రెండుచోట్లా బిల్లులు ఇప్పటికీ పెండింగులోనే ఉన్నాయి. మూడోసారి బిల్లు పాస్ చేయించి ఆర్డినెన్స్ జారీచేసింది. జారీచేసిన ఆర్డినెన్సును ఆమోదంకోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపింది. ఈ ఆర్డినెన్స్ కు కూడా నెలలుగా గవర్నర్ దగ్గరే పెండింగులో ఉండిపోయింది.

అందుకనే ఈమధ్య పంచాయితీరాజ్ శాఖ 2018 చట్టానికి క్యాబినెట్ మీటింగులో సవరణలు చేసి 42శాతం రిజర్వేషన్ల అమలుకు ఏకంగా జీవో ఎంఎస్ 9ని రిలీజ్ చేసింది. అఫ్ కోర్స్ ఆ జీవో 9 అమలుపై హైకోర్టు స్టే విధించింది. దాంతో మొత్తం ఎన్నికల ప్రక్రియకే బ్రేక్ పడిపోయింది. హైకోర్టు జీవో 9 అమలుపై స్టే ఇచ్చిందన్న ఆగ్రహంతోనే ఈనెల 18వ తేదీ అంటే శనివారం తెలంగాణ బంద్ జరగబోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రేవంత్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల కోసం చేయగలిగిందంతా చేసింది. ఇంతకు మించి చేయగలిగేది ఏమీలేదు. కాబట్టి రిజర్వేషన్ల అమలులో కృష్ణయ్య డిమాండ్ చేయాల్సింది కేంద్రప్రభుత్వాన్నే కాని రేవంత్ ప్రభుత్వాన్ని కాదు.

ఇక కేంద్ర ప్రభుత్వం గురించి ఆలోచిస్తే తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులు కేంద్రం దగ్గరే పెండింగులో ఉన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఈవిషయం కృష్ణయ్యకు తెలీకుండా ఉంటుందని అనుకునేందుకు లేదు. రిజర్వేషన్లు అమలవ్వాలంటే నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రప్రభుత్వమే కాని రాష్ట్ర ప్రభుత్వంకాదు. ఎందుకంటే రిజర్వేషన్ల అంశం కేంద్రప్రభుత్వంలోని అంశమే కాని రాష్ట్రప్రభుత్వం చేతిలోనిది కాదని అందరికీ తెలుసు. రెండు బిల్లులు కేంద్రం దగ్గర పెండింగులో ఉంటే ఒక ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగులో ఉంది.

కేంద్రం అన్నా, గవర్నర్ అన్నా ఒకటే. కాబట్టి కృష్ణయ్య డిమాండ్ చేయాల్సింది కేంద్రాన్నే కాని రాష్ట్రప్రభుత్వాన్ని కాదు. అలాగే ఇపుడు చొరవచూపాల్సింది, చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సింది కూడా కృష్ణయ్యే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాగంటే కృష్ణయ్య బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడే కాకుండా బీజేపీ రాజ్యసభ ఎంపీ కూడా అని గుర్తుపెట్టుకోవాలి. బీసీ రిజర్వేషన్లపై మాట్లాడేందుకు, అఖిలపక్ష సమావేశానికి అపాయిట్మెంట్ కావాలని తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖకు ప్రధానమంత్రి నుండి ఇప్పటివరకు సమాధానం లేదు.

ఇక్కడే కృష్ణయ్య చిత్తశుద్ది మీద అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎలాగంటే నరేంద్రమోదీతో మాట్లాడి రేవంత్, ఇతర పార్టీలకు అపాయిట్మెంట్ ఇప్పించేందుకు కృష్ణయ్య ఏమైనా ప్రయత్నించారా ? హైదరాబాద్ పర్యటనలో నరేంద్రమోదీ, కృష్ణయ్య ఒకరిని మరొకరు గట్టిగా హత్తుకుని తాము బాగా సన్నిహితులమనే సంకేతాలను తెలంగాణ సమాజానికి పంపిన విషయం తెలిసిందే. అందుకనే అఖిలపక్షానికి మోదీ అపాయిట్మెంట్ ఇప్పించటంలో కృష్ణయ్య చొరవచూపించాల్సుంది. కాని ఆ దిశగా ఈ ఎంపీ చొరవచూపినట్లు లేదు. మోదీ అపాయిట్మెంట్ ఇప్పించేత సీన్ తనకు లేకపోతే ఆ విషయం కేంద్రమంత్రులు జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో అన్నా చర్చించారా ? అదీలేదు.

రిజర్వేషన్ల అమలువిషయంలో కేంద్రమంత్రులు, ఆరుగురు ఎంపీలతో భేటీకి కృష్ణయ్య చొరవచూపించినట్లు కూడా లేదు. స్ధానికసంస్ధల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు అమలుచేయకపోతే ప్రజాఉద్యమంగా మారుస్తామనే హెచ్చరికలు ఎవరి మెప్పుకోసమో అర్ధంకావటంలేదు. బీజేపీ ఎంపీగా ఉంటు, మోదీకి సన్నిహిత ఎంపీగా ప్రచారంలో ఉన్న కృష్ణయ్య కేంద్రప్రభుత్వంపై ఒత్తిడికి ప్రయత్నించకుండా కేవలం హెచ్చరికలతో, ప్రకటనలతో పబ్బం గడుపుకుంటున్నారు కాబట్టే డబల్ గేమ్ ఆడుతున్నారా అనే అనుమానం పెరిగిపోతోంది.

Tags:    

Similar News