ఇంటింటికి ‘కాంగ్రెస్ బాకీ కార్డు’లు
ప్రజలందరికీ కాంగ్రెస్ సర్కార్ ఉన్న బాకీలను ఈ కార్డ్ వివరిస్తుందన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.
తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ బాకీ ఉందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అధికారంలోకి రావడానికి ముందు ఆరు గ్యారెంటీల, 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. గద్దెనెక్కగానే అన్నిటినీ మర్చిపోయిందని ఎద్దేవా చేశారు. అధికారం వచ్చినప్పటి నుంచి ప్రజలను ఎలా మోసం చేయాలన్న అంశంపైనే కాంగ్రెస్ కసరత్తులు చేస్తోందని ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక దగ్గర పడుతున్న వేళ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ‘కాంగ్రెస్ బాకీ కార్డు’లను ఆవిష్కరించి, ప్రతి ఇంటికి వాటిని అందజేసే కార్యక్రమం చేపట్టింది. దీనిని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.. ఆదివారం సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల మండలం, ఉండ్రుగొండ గ్రామంలో నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను అందించారు. ఈ సందర్భంగానే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం విమర్వలు గుప్పించారాయన. 22 నెలల కాంగ్రెస్ పాలనలో గ్యారంటీల జాడే లేదన్నారు. అందుకే ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంచుతున్నామని స్పష్టం చేశారు.
‘‘ఎన్నికల ముందు 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. రైతు రుణమాఫీ డిసెంబర్ 9 లోపే చేస్తామని చెప్పిండ్రు. హామీలే కాదు ఇంటింటికి గ్యారెంటీ కార్డు కూడా స్వయంగా వాళ్లే పంచిండ్రు. గ్యారెంటీ కార్డులను దగ్గర పెట్టుకొని రాకుంటే మాకు గుర్తు చేయమని ఆనాడే చెప్పిండ్రు. గ్యారెంటీ కార్డులు ఇచ్చి 22 నెలలు పూర్తయినా.. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీ కార్డుల ప్రకారమే ఎవరెవరికి ఎంత బాకీ ఉన్నారో తెలిసేలా కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు రూపంలో అందిస్తున్నాం. రూ. 50వేల కోట్లు రుణమాఫీ చేస్తామని రూ. 20 వేల కోట్లు చేశామని చెప్పారు’’ అని గుర్తు చేశారు.
‘‘అందులో కూడా రూ. 17000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిండ్రు. రైతుబంధు కాదు రైతు భరోసా అని చెప్పిన ప్రకారం ఒక్కో ఎకరానికి రూ. 19 వేల బాకీ ఉంది. మహిళలకు 2500 రూపాయలు మొదటి నెల నుంచే ప్రారంభిస్తామని చెప్పి.. ఇప్పటివరకు ఒక్కో మహిళకు 55 వేల రూపాయలు బాకీ ఉంది. మొత్తం ఆసరా పెన్షన్ లు ప్రతి ఒక్కరికి 44 వేల రూపాయలు బాకీ ఉంది. ఒక ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పిన వాళ్లకు కలిపితే రూ. 88 వేలు బాకీ ఉన్నట్టే. వికలాంగులకు కూడా ఒక్కొక్కరికి 44 వేల రూపాయలు బాకీ ఉంది. ఆటో కార్మికులకు ఏడాదికి 12 వేలు అని చెప్పిన ప్రకారం 22,000 బాకీ ఉంది. 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికి 5000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు’’ అని విమర్శించారు.
‘‘గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు కూడా ఏడాదికి రూ.12,000 అని చెప్పారు వాళ్లకు కూడా రూ.24000 బాకీ ఉంది. ఇచ్చిన ఒక్క గ్రూపు1 లో కూడా మొత్తం ఫైరవీలు చేసి కోట్ల రూపాయలు తీసుకొని ఉద్యోగాలను ఆంధ్రోళ్లకు కట్టబెట్టిండ్రు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి వాళ్ళను కూడా మోసం చేసిండ్రు. విద్యార్థులకు 5 లక్షల భద్రత కార్డులు ఇస్తామని చెప్పి వాళ్ళను మోసం చేసిండ్రు. ఈ హామీలన్నీ కూడా రేవంత్ మాత్రమే కాదు.. సోనియమ్మ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కార్గే లు చెప్పినవే. ప్రభుత్వ ఉద్యోగులనే కాదు ఔట్ సోర్సింగ్ ఉద్యోగలను కూడా దారుణంగా మోసం చేసిండు. ఎవరైనా ప్రభుత్వాన్ని నిలదీస్తే అరెస్టులు చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారు’’ అని అన్నారు.
‘‘కాంగ్రెస్ చోటామోటా నాయకులు ఫోన్ చేసినా పోలీసులు కేసులు పెట్టే పనిలో ఉన్నారు. సినిమాకు పోయి తొక్కేసలాటల్లో చనిపోతే ఎంతో పెద్ద హడావిడి చేసిన ప్రభుత్వం, యూరియాలో ఉన్న నిలబడి మహిళా రైతు చనిపోతే పరామర్శించిన పాపాన పోలేదు. రైతుల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా? ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారో చూద్దాం. ఎన్నికలని ఇండ్ల ముందుకు వస్తే ఈ కార్డులు చూపించి నిలదీయండి. సూర్యాపేట ఉండ్రుగొండలో ఇంటింటికి తిరిగి కార్డులు పంచినం. కార్డులు పంచుతున్న సమయంలో కాంగ్రెస్ గురించి ప్రజలు హేళనగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అని తెలిపారు.