‘కాంగ్రెస్ ఒక దొంగల కంపెనీ’.. హస్తానికి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై
కండువా కప్పుకున్న కోనప్ప ఏడాది తిరగకముందే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. ఇకపై ఏ పార్టీలో ఉండనని, స్వతంత్రంగానే ప్రజా సేవ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.;
కాంగ్రెస్‌పార్టీ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామా చేశారు. 6 మార్చి 2024న కాంగ్రెస్ కండువా కప్పుకున్న కోనప్ప ఏడాది తిరగకముందే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. కాగా తాను ఇకపై ఏ పార్టీలో ఉండనని, స్వతంత్రంగానే ప్రజా సేవ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. గతేడాది కారు దిగి హస్తాన్ని అందిపుచ్చున్నారాయన. కాగా తాను బీఆర్ఎస్ నుంచి తప్పుకోవడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కారణమని అన్నారు. పార్టీ నుంచి బయటకు వచ్చేసినా తాను ఎప్పుడూ కూడా బీఆర్ఎస్, కేసీఆర్‌ను విమర్శించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎన్నికలో బీఎస్‌పీ అభ్యర్థికి ఆయన మద్దతు పలికారు. కాగా కాంగ్రెస్ పద్దతులు నచ్చకనే పార్టీ వీడుతున్నట్లు ఆయన తేల్చి చెప్పారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు.
కాంగ్రెస్ ఒక దొంగల కంపెనీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు కోనప్ప. ఆయన వ్యాఖ్యలతో సిర్పూర్-కాగజ్‌నగర్ కాంగ్రెస్‌లో విభేధాలు మరింత రాజుకున్నాయి. రూ.75కోట్లతో ఫ్లైఓవర్‌ను మంజూరు చేయిస్తే.. దానిని కాంగ్రెస్ క్యాన్సిల్ చేసిందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో కొత్త బిచ్చగాళ్లు తిరుగుతున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఉద్దేశించి విమర్శలు చేశారు. గ్రామాల్లోకి వచ్చే నాయకులను గల్లాపట్టి నిలదీయాలని పిలుపునిచ్చారు. సీఎంను కలిసి ఫ్లైఓవర్ గురించి చాలాసార్లు చర్చించానని, ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని కోరినా ఆయన స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు కోనప్ప.