కెసిఆర్ ఇక చరిత్రపుటల్లోకేనా?
కెసిఆర్ మైండ్ సెట్ మీద మాజీ ఎంపి ఆనందభాస్కర్ విశ్లేషణ
By : రాపోలు ఆనందభాస్కర్
Update: 2024-05-14 12:22 GMT
తెలంగాణ కు కేసీఆర్ ఒక నిన్న
తెలంగాణ రాష్ట్ర సమితి కనుమరుగు జాతీయ స్థాయిలో, దేశ వ్యాప్తంగా తప్పుడు సంకేతం. జాతీయ సంకీర్ణ ప్రయోగాలకు ఒక గొడ్డలి పెట్టు.ఏదైనా ఒక ప్రాంతంలో ఒక ప్రాంతీయ పార్టీ బలపడి, తననుతాను అనేక ఆటుపోట్లతో, భారీ విజయాలతో పెంచుకొని, విస్తారమైన ఆర్థిక, భవన సంపదలతో ఎదిగిన తర్వాత, ఇంత ఘోరంగా విఫలం కావడం తాజాగా తెరాస నే.
ప్రత్యేక రాష్ట్ర సాధనలో చరిత్రాత్మక పాత్ర కలిగి, కొత్త రాష్ట్రాన్ని అనేక రంగాలలో అగ్ర భాగాన నిలిపిన పరిపాలకుడిగా భూమిక సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్థాపించి, పేరు మార్చి, అధోగతి పాలు చేసిన పార్టీ వల్ల, దేశంలోనే ప్రాంతీయ రాజకీయ పార్టీల ఉత్థాన, పతనాల చరిత్రలో గుగుర్పాటు కలిగింది. విద్యార్థి ఉద్యమంతో అడుగిడి, ప్రాంతీయ పార్టీగా ప్రపంచ ఆలోచనాపరుల దృష్టిని ఆకర్షించి, మరుగయిన ప్రఫుల్ల కుమార్ మహంతా, ఆయన అస్సాం గణ పరిషత్ తర్వాత అంతటి ఉనికి సమస్యను కేసీఆర్, ఆయన మాజీ తెరాస, తాజా భారత రాష్ట్ర సమితి పార్టీ ఎదుర్కొంటున్నది.
ఆయన యువజన కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి పాత్రికేయునిగా, 2022 అక్టోబర్ లో తన పిలుపు మేరకు, గడపలోకి అడుగెట్టి, నిన్నమొన్నటిదాకా అక్కడే నిలుచున్న యోధుడిగా, రాజకీయవేత్తగా కేసీఆర్ ను నిశితంగా గమనించిన వ్యక్తి గా నా పరిశీలన. పార్టీ పుట్టడం, పెరగడం, ఉనికిని సంతరించుకోవడం, ఇంతగా చరిత్ర సృష్టించడంలో ఆయనతోపాటు వేలాది మంది త్యాగాలు, లక్షలాది మంది కాయకష్టం ఉంటుంది. వారందరిపట్ల సానుభూతితో, దేశ రాజకీయ చిత్రంలో ఆ పార్టీ చోటు ఛిద్రమవుతున్నందుకు ఒకింత విచారం.
ఉన్నవాళ్లు కూడా కెసిఆర్ ను వదిలేశారు
మొన్న లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిస్తూ, ప్రధాన మంత్రి పదవికి పోటీదారునని కేసీఆర్ చేసిన ప్రస్తావన. కేవలం ఊహ కోసం తెలంగాణ లో 15 లోక్ సభ స్థానాల్లో కేసీఆర్ పార్టీ గెలుస్తుందని అనుకుంటే, 300 స్థానాలు కలిగిన పార్టీనో, కూటమో నిలిపే వ్యక్తి ఆ పదవిని పొందగలుగుతాడు.
ఇప్పుడు మూడు చోట్ల గెలుస్తారా అంటే, నమ్మకం చెప్పలేని పరిస్థితి. మూడు గెలిస్తే ఒక్క శాతం, ఆయన చెప్పే అద్భుతం జరిగి 15 గెలిస్తే 5 శాతం సంఖ్యాబలం తో ఏం చేయగలడు. అందుకే, అది విన్న కొందరు చైతన్యవంతులు ఆయన తీరు మారలేదని, వేరే వైపు ఓటు మళ్ళించారు. జాతీయ రాజకీయాల్లో ఆయనను మూడో వ్యక్తి నమ్మే పరిస్థతి లేదని ఆయనకు కూడా తెలుసు. ఎందుకీ ప్రగల్భాలు, పగటి కలలు.
పక్క రాష్ట్రం ముచ్చట మాటిమాటికి తనకు ఎందుకు?
ఆంధ్ర ఫలితాలు చూసుకోవడానికి కేసీఆర్ అవసరమని అక్కడ ఎవరూ అనుకోనప్పుడు, తగుదునమ్మా అని అక్కడి మంత్రసానితనమెందుకు? ఫలితంగా ఆ రాష్ట్రం అధికారం కోసం తహతహలాడుతున్న కులాల వారు, వారి సానుభూతిపరులు తెలంగాణ లో ఆయనను శత్రువుగా నిర్ధారించారు. వేరే పార్టీల శాసన సభ్యుల జట్టుచేసుకోవడం, వచ్చిన ఉప ఎన్నికలను ఉపద్రవాలుగా మార్చి, తప్పుడు సంప్రదాయాలకు, విపరీత ఆర్థిక విచ్చలవిడితనానికి, ఓటర్లలో భ్రాంతికి దారితీశారు. బలుపు ప్రయోగాలు పెరిగి, భావోద్వేగం అడుగంటింది.
ఉద్యమ, ప్రాంతీయ భావోద్వేగానికి కేసీఆర్ రవ్వంత విలువ మిగల్చకపోవడం, తెలంగాణ సబ్బండ వర్గాల సకల జనులకు మానసిక వేదన మిగిల్చింది. కాళేశ్వరం సమగ్ర గోదావరి బహుళార్ధ సాధక ప్రాజెక్టు అనే దాని విశ్వరూపాన్ని, మేడిగడ్డ బ్యారేజీ మూడు స్తంభాలు కుంగే వరకు, జనం మదిలో నింపలేదు. ఓడిపోయినా చిలుకపలుకులు జనానికి చేరేలోపు, పుణ్యకాలం గడిచింది.
తాగునీటి భగీరథ యత్నంలో ఇమిడి ఉన్న విలువ ఆ నీటిని తాగుతున్నవారికి అర్ధం చేయించే ప్రయత్నమే జరగలేదు. నిరంతర విద్యుత్ సరఫరా లోతుపాతులను వినియోగదారులకు అర్ధమయ్యేలా ఎన్నడూ చేయలేదు. రైతుబంధు సముచిత పరిమితి ఏర్పరచక, విచ్చలవిడితనం మేలుకన్నా కూడే చేసింది.
విమర్శ పట్ల అసహనం, విభేదిస్తున్నవారి పట్ల నిఘా, ఓర్పుతో సామాన్య ప్రజానీకం మధ్యకు అప్పుడప్పుడు వెళ్ళే ప్రయత్నం క్రమంగా ముళ్ళకంచెలుగా మారాయి. తిరగబడినవారిని పెట్టిన ముప్పుతిప్పలు జనానికి అసహనం కలిగించింది.
కేసీఆర్ శత్రు భయంకరుడు
పథకాల అమలు పర్యవసాలు ఆలోచించని ఆడంబరం పెనుశాపమయింది. సొంత పార్టీలోని తాము పరాయిలమనే భావించే పరిస్థతి. అంతా తానే. అంతా తనదే అనే భ్రమ, ప్రగతి భవన్ నుంచి ఎంతో వికారంగా ముఖం దాచుకుని వెళ్ళే నికృష్ట స్థితి.
తెలంగాణ లో అధికార మార్పిడి తర్వాత కేసీఆర్ అన్నీ బాగానే చేశారని, ఆయన చేసినంతగా కొత్తగా వచ్చినవాళ్ళు చేయలేకపోతున్నారని ఆవేదన నిజమే. కానీ, అవన్నీ తీర్చడానికి మళ్ళీ కేసీఆర్ కావాలనే స్థితి కి జనం రాలేరు.
ఎందుకంటే, పెట్టిపొయ్యకపోయినా, పెయ్యలకు పునికి చూసే ఉదారత కావాలి. జంతువు ఈనిన తర్వాత పుట్టిన దూడ సరిగా దగ్గరికి రాకపోతే, అరే! ఇది ఈన నేర్చింది కానీ, నాక నేర్వలేదు, అంటారు.
కేసీఆర్ పరిస్థితి అదే. అందుకే ఆయన అధికారం కోల్పోయినా, తుంటి విరిగి మంచం పాలయినా, అంతకుముందు ఆయన వద్ద అన్నీ అనుభవించిన వారు వరదలా దూరమయినా, ప్రజల్లో కదలిక లేదు. దాంతో ఆయన రాజకీయ నిర్మాణం నిరర్ధకమైంది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీల స్థావరం జాతీయ పార్టీల పరం కావడం దేశ రాజకీయాలలోనే సంచలన పరిణామం.