చిన్న పిల్లలను అపహరించే ముఠా అరెస్ట్
నలుగురు పిల్లలను రక్షించిన చందానగర్ పోలీసులు;
హైదరాబాద్ నగరంలో చిన్నపిల్లలను అపహరించే ముఠాకు చెందిన నలుగురిని చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు.. వారి నుంచి అపహరణకు గురైన ఇద్దరు బాలికలు, ఇద్దరు బాలురను రక్షించినట్లు తెలిపారు.
‘‘ఆగస్టు 25న లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో ఏడాదిన్నర బాబును ఈ ముఠా అపహరించింది. కాచిగూడలో ఐదేళ్ల బాలిక, లింగంపల్లిలో మరో బాలికను అపహరించారు. గతేడాది కూడా ఐదేళ్ల బాబును అపహరించారు. కొన్ని ఇళ్ల ముందు ఈ ముఠా రెక్కీనిర్వహించి పెద్దవాళ్లు లేని ఇళ్లను ఎంచుకొని పిల్లలను ఎత్తుకెళ్లేవారు. పిల్లలను అమ్మడం కోసం అపహరిస్తున్నారా? దత్తత కోసం ఎత్తుకెళ్తున్నారా? అని దర్యాప్తులో తేలాల్సి ఉంది అని డిసిపి తెలిపారు. పిల్లలు అదృశ్యమైన వాళ్లు ఎవరైనా ఉంటే స్థానిక పోలీసులను సంప్రదించొచ్చుఅని వినీత్ తెలిపారు.
గత సంవత్సరం పిల్లలను విక్రయించే ముఠాను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఎనిమిది సభ్యులతో కూడిన ముఠా ఢిల్లీ, పూణెల నుంచి చిన్న పిల్లలను అపహరించి తెలంగాణలో విక్రయించేది. ముఠా గుట్టును అప్పట్లో పోలీసులు చేధించారు. వారి వద్ద నుంచి చిన్న పిల్లలను రక్షించారు.