హైదరాబాద్ మునిసిపాలిటి ఈ మేడమ్ మాట వింటుందా?
జిహెచ్ ఎంసి కొత్త కమీషనర్ అమ్రపాలి సిటిలో సర్ ప్రైజ్ విసిట్స్ చేస్తున్నారు. గత కమిషనర్లు రాత్రుల్లో కూడా తిరిగారు. హైదరాబాద్ వాళ్ల మాట విన్లేదు. ఇపుడేమవుతుందో
ఇపుడిదే చర్చ నగరంలో మొదలైంది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమీషనర్(జీహెచ్ఎంసీ)గా బాధ్యతలు తీసుకున్న తర్వాత అమ్రపాలి కాటా బుధవారం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సర్ ప్రైజ్ విసిట్స్ చేశారు. నగరంలోని చెత్త కుప్పల పరిస్ధితి, మంచినీటి సౌకర్యం, రోడ్ల పరిస్ధితిని గమనించారు. తాను తిరిగిన ప్రాంతాల్లో కొందరు జనాలతో మాట్లాడి పరిస్ధితిపై ఫీడ్ బ్యాక్ కూడా తీసుకున్నారు. అయితే ఇపుడు జనాల ప్రశ్న ఏమిటంటే అమ్రపాలైనా నగరం పరిస్ధితి మారుతుస్తుందా లేకపోతే ప్రచారానికి మాత్రమే పరిమితమవుతుందా ? అని.
విషయం ఏమిటంటే జీహెచ్ఎంసీ కమీషనర్లుగా బాధ్యతలు తీసుకున్న చాలామంది ఐఏఎస్ అధికారులు మొదట్లో చాలా హడావుడి చేస్తారు. వాళ్ళ హడావుడి చూసిన మామూలు జనాలు( అధికారులు కాదు) తమకు మంచిరోజులు వచ్చాయేమో అని అనుకుంటారు. హైదరాబాద్ పేరుకు మాత్రమే విశ్వనగరం అని అందరికీ తెలుసు. రోడ్లు, మంచినీటి సౌకర్యం, పారిశుధ్యం లాంటి వాటిల్లో చాలా అధ్వాన్నంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. గట్టిగా అర్ధగంటపాటు వర్షంపడితే రోడ్డేదో, కాలువేదో, మ్యాన్ హోల్ ఎక్కడుందో కూడా జనాలు తెలుసుకోలేరు. ఈ అయోమయస్ధితిలో మ్యాన్ హోల్స్ లో పడి ఎంతమంది చనిపోయారో లెక్కలేదు. ఎవరైనా చనిపోయి వార్తల్లోకి ఎక్కినపుడు మాత్రం మంత్రులు, ఉన్నతాధికారులు చాలా హడావుడి చేయటం, తర్వాత మరచిపోవటం మామూలైపోయింది.
అధికారంలో ఏ పార్టీ ఉన్నా, మంత్రులుగా ఎవరున్నా, కమీషనర్లుగా ఎంతమంది పనిచేసినా హైదరాబాద్ నగరంలోని జనాల బాధలు మాత్రం తీరలేదు. బాధ్యతలు తీసుకున్న కమీషనర్లు నాలుగురోజులు హడావుడి చేసి తర్వాత చప్పపడిపోతారు. గతంలో కమీషనర్లుగా పనిచేసిన సీవీఎస్ కే శర్మ, ఎస్ పీ సింగ్, సమీర్ శర్మ, చిత్రారామచంద్రన్, కృష్ణబాబు లాంటి వాళ్ళు కూడా ఇపుడు అమ్రపాలి చేసినట్లే సర్ ప్రైజ్ విజిట్లు చేశారు. సీవీఎస్ కే శర్మ అయితే అర్ధరాత్రుళ్ళు, తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీల పేరుతో చాలా హుడావుడి చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. మరికొందరు వర్షాల్లో రోడ్ల మీదకొచ్చి సిబ్బందితో పనిచేయించారు. అయితే తర్వాత ఏమైందో తెలీదు కాని కమీషనర్లుగా పనిచేసిన వాళ్ళు చాలామంది అడ్రస్ లేకుండా పోయారు. ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది హైదరాబాద్ నగరవాసుల పరిస్ధితి.
గ్రేటర్ హైదరాబాద్ అంటే చాలామంది కమీషనర్లు అత్యంత సంపన్నులు, ప్రముఖులుండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, హైటెక్ సిటి, కొండాపూర్ లాంటి కొన్ని ప్రాంతాలే అనుకుంటారో ఏమో తెలీటంలేదు. లక్షలాదిమంది నివసించే చాలా ప్రాంతాల్లోని మంచినీటి సరఫరా, పారిశుధ్యం పరిస్ధితి, రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉంటాయో అందరికీ తెలుసు. ఈ ప్రాంతాల్లో కమీషనర్లు ఎవరూ తిరిగినట్లు, పనిచేయించినట్లు కనబడలేదు. ఎక్కడబడితే అక్కడ చెత్తకుప్పలు రోజుల తరబడి పేరుకుపోయినా పట్టించుకునే నాధుడుండడు. చెత్తకుప్పలు పేరుకుపోయిన రోడ్లలో ప్రయాణించే వేలాది జనాలకు తెలుసు అక్కడి సమస్య ఏమిటో. కొత్త కమీషనర్లు పనిచేయాలనే ఉత్సాహంతో నాలుగు రోజులు తిరగటంతో విపరీతమైన ప్రచారం వచ్చేస్తుంది. మీడియా, సోషల్ మీడియాలో బాగా పాపులరైపోతారు. అంతే ఆ తర్వాత మళ్ళీ విజిట్లుండవు, సమస్యల పరిష్కారమూ జరగదు.
వెళిపోయిన కమీషనర్ల గురించి ఇపుడు అనవసరం కొత్తగా బాధ్యతలు తీసుకున్న అమ్రపాలి అయినా నగరంలోని సౌకర్యాలు పెంచటంపై తన ముద్ర వేయాలని జనాలు కోరుకుంటున్నారు. అమ్రపాలి దృష్టిపెట్టాల్సిన ముఖ్యమైన అంశాలు పారిశుధ్యం, మంచినీటి సరఫరా, రోడ్ల అభివృద్ధి, కాల్వల్లో పూడికలు తీయించటం. తాను తెల్లవారి, అర్ధరాత్రుళ్ళు తిరగటం కాదు జోనల్ కమీషనర్లు, అసిస్టెంట్ కమీషనర్లు తదితర పై విభాగల అధికారులు రోడ్లపైన తిరిగేట్లుగా చేయాలి. అప్పుడే సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు అవకాశముంటుంది. నగరంలోని చాలామంది జనాలు కూడా జీహెచ్ఎంసీకి సహకరించటంలో ఆసక్తి చూపరు. అందుకనే జనాలందరినీ అమ్రపాలి తనదారిలోకి తీసుకొచ్చుకోవాలి.
అందుకు ఆమె చేయాల్సింది ఏమిటంటే ఎక్కడికక్కడ వివిధ కాలనీల్లోని జనాలను, మున్సిపల్ అధికారులతో కలిపి కమిటీలు వేయాలి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, యువతను భాగస్వాములను చేయాలి. ఎక్కడ సమస్యుందని ఫిర్యాదు వచ్చినా వెంటనే అటెండ్ అయి పరిష్కరించే వ్యవస్ధను ఏర్పాటుచేయాలి. ఇదివరకు వరంగల్ కలెక్టర్ గా పనిచేసినపుడు అమ్రపాలికి మంచి పేరొచ్చింది. ఎందుకంటే సమస్యలపై వేగంగా స్పందించటం, పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవటం వల్లే. ముఖ్యంగా అమ్రపాలి లాంటి ఉన్నతాధికారులు జనాలతో రెగ్యులర్ గా మమేకం అయితేనే కిందస్ధాయి అధికారులు కూడా రోడ్లపైకి వచ్చి జనాలతో కలుస్తారు. లేకపోతే ఇదివరకు పనిచేసిన కమీషనర్ల లాగే అమ్రపాలి కూడా ‘ఉత్త హడావుడి మనిషే’ అని జనాలు అనుకోవటానికి ఎక్కువ కాలం పట్టదు.