హైడ్రా ఎఫెక్ట్: బెయిల్ కోసం అధికారుల యత్నాలు
అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. కేసులు నమోదు అవడంతో సదరు అధికారులు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వారికి బెయిల్ ఇవ్వద్దంటూ కోర్టును ఆర్థిక విభాగం పోలీసులు కోరారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో చెరువుల్లో కట్టడాలకి అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సిఫారసు మేరకు ఆరుగురు అధికారులపై కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ EOW (ఎకనామిక్ అఫెన్స్ వింగ్) లో కమిషనర్ అవినాష్ మహంతి కేసులను నమోదు చేశారు. నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సుదాన్షు, బాచుపల్లి ఎమ్మార్వో పూల్ సింగ్, మేడ్చల్ - మల్కాజిగిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ పై కేసులు నమోదయ్యాయి.
క్రిమినల్ కేసులు ఎందుకంటే..?
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎర్ర కుంట సరస్సు బఫర్ జోన్‌లో ఈ నెల ప్రారంభంలో, హైడ్రా అక్రమంగా నిర్మించిన మూడు భవనాలను, ఒక్కొక్కటి గ్రౌండ్ ప్లస్ ఐదు అంతస్తులను కూల్చివేసింది. చందానగర్, ప్రగతినగర్‌లోని ఎర్ర కుంట సరస్సు చుట్టూ ఉన్న ఈ అక్రమ కట్టడాలను అధికారులు నేలమట్టం చేశారు.
సరస్సు బఫర్ జోన్‌లో అక్రమంగా భవనాలను నిర్మించడంతోపాటు పర్యావరణ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించారనే నేపథ్యంలో హైడ్రా ఆ నిర్మాణాలను కూల్చివేసింది. ఇప్పుడు వీటికి అనుమతులు ఇచ్చిన అధికారులపైనా క్రిమినల్ కేసులు నమోదు చేసింది. 0.29 ఎకరాల ఆక్రమణలో ఉన్న భూమిలో అనధికార నిర్మాణాలను నిర్మించేందుకు ఈ అధికారులు అనుమతించారని, సరస్సు పర్యావరణ సమగ్రతను దెబ్బతీశారని హైడ్రా జరిపిన సర్వేలో వెల్లడైంది. దీంతో అనుమతులు ఇచ్చిన ఆరుగురు అధికారులపై హైడ్రా కమిషనర్ సిఫారసు మేరకు సైబరాబాద్ కమిషనర్ కేసులు నమోదు చేశారు.