Ground Water | తెలంగాణలో పెరిగిన భూగర్భ జలసిరులు
తెలంగాణలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవడంతో భూగర్భజల సిరులు మెరుగయ్యాయి. భూగర్భజలమట్టాలు పెరిగాయని గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్ నివేదికలో తెలిపింది.;
By : The Federal
Update: 2025-01-18 11:59 GMT
తెలంగాణ రాష్ట్రంలో భూగర్భజలాల నీటి మట్టం పెరిగాయి. భారీ వర్షాల వల్ల గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలతో పాటు చెరువులు, కుంటలు జలకళతో కళకళలాడాయి. దీనివల్ల భూగర్భజల నీటిమట్టాలు కూడా పెరిగాయి. 33 జిల్లాల్లోని అన్ని మండలాల నుంచి 1771 పరిశీలక బావుల ద్వారా భూగర్భ జలమట్టాలను సేకరించి విశ్లేషించగా భూగర్భజలాలు పెరిగినట్లు తేలింది.
- జలాశయాలు నిండటం వల్ల భూగర్భజల నీటిమట్టాలు పెరిగాయని తెలంగాణ భూగర్భ జలశాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వరరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. నల్గొండ జిల్లా దామరచర్లలో కేవలం 1.01 మీటర్ల లోతులోనే భూగర్భజలం ఉందని అధికారులు చెప్పారు. భూగర్భజలం పెరగడంతో రబీ సీజనులో సాగు విస్తీర్ణం కూడా పెరగనుందని వ్యవసాయ శాస్త్రవేత్త ఎన్డీఆర్కే శర్మ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
సాధారణం కంటే అధిక వర్షపాతం
తెలంగాణ రాష్ట్రంలో ఏడాది కాలంలో సాధారణం కంటే 23 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 852 మిల్లీమీటర్లు కాగా, 23 శాతం అధికంగా అంటే 1049 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.యాదాద్రి భువనగిరి నుంచి ములుగు జిల్లా దాకా సాధారణం కంటే ఎక్కువ వర్షం కురిసింది. అధిక వర్షపాతం నమోదుతో భూగర్భ నీటిమట్టం కూడా పెరిగింది.
పెరిగిన భూగర్భ జలమట్టం
రాష్ట్రంలో సరాసరి నీటి మట్టం 6.72 మీటర్లుగా నమోదైంది. 9 జిల్లాల్లో భూగర్భ జలమట్టం 5 మీటర్లు, 22 జిల్లాల్లో 5 నుంచి 10 మీటర్ల మేర పెరిగింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ భూగర్భజలమట్టం 1.72 మీటర్ల నుంచి 6.55 మీటర్ల దాకా పెరిగింది. రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో భూగర్భజలమట్టం 8.25 మీటర్ల మేర పెరగడం శుభపరిణామం. భూగర్భజలాలు పెరగడంతో బావులు, బోర్ల కింద సాగు చేస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో బోర్ల సంఖ్య పెరగడంతో భూగర్భజలాలు అడుగంటి పోయేవి. కానీ భారీవర్షాల వల్ల హైదరాబాద్ నగరంలోనూ 5.08 మీటర్ల మేర భూగర్భజల నీటిమట్టం పెరిగిందని తెలంగాణ భూగర్భజలశాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వరరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
471 మండలాల్లో భూగర్భజలసిరులు
తెలంగాణ రాస్ట్రంలోని 471 మండలాల్లో భూగర్భజల మట్టాలు 26.13 మీటర్ల మేర పెరిగిందని భూగర్భజల శాఖ పరిశీలనలో వెల్లడైంది. రాష్ట్రంలోని 141 మండలాల్లో 0.01 నుంచి 13.06 మీటర్ల మేర తగ్గిదని భూగర్భజల శాఖ తేల్చింది.ఆదిలాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, నల్గొండ, జిలలాల్లో భూగర్భజల మట్టం పెరిగింది.