GULF | సౌదీ బాధితుడి భార్య వినతికి స్పందించిన సీఎంఓ
తన భర్తను సౌదీ అరేబియా నుంచి స్వదేశానికి రప్పించాలని జగిత్యాల మహిళ గంగలక్ష్మీ చేసిన వినతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారత రాయబార కార్యాలయం స్పందించింది.;
By : The Federal
Update: 2025-01-16 14:55 GMT
వీసా గడువు ముగిసి సౌదీ అరేబియాలో చిక్కుకున్న జగిత్యాల పట్టణానికి చెందిన కుక్కల చిన్న భీమయ్యను ఇండియాకు వాపస్ రప్పించాలని అతని భార్య గంగలక్ష్మి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి మెయిల్ ద్వారా చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) స్పందించింది.
- సాధారణ పరిపాలన శాఖ - ప్రవాసీ భారతీయుల విభాగం (జీఏడి - ఎన్నారై) ముఖ్య కార్యదర్శి ఎం.రఘునందన్ రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, సౌదీ అరేబియా రియాద్ లోని భారత రాయబార కార్యాలయానికి 'వైర్ మెసేజ్'పంపారు.
భీమయ్య కుమారుడు సునీల్ కు 'బోన్ మారో' (ఎముక మూలుగు) మార్పిడి చికిత్సకు దాతగా భీమయ్యను సౌదీ నుంచి అత్యవసరంగా రప్పించాల్సి ఉంది. కాంగ్రెస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి 'ఎక్స్' లో చేసిన విజ్ఞప్తికి రియాద్ లోని ఇండియన్ ఎంబసీ కూడా స్పందించింది. భీమయ్యాను ఫోన్ లో సంప్రదించి అతన్ని స్వదేశానికి పంపించేందుకు చర్యలు తీసుకుంటామని సౌదీలోని ఇండియన్ రాయబార కార్యాలయం తెలిపింది. సౌదీ లోని సామాజిక సేవకులు గాజుల నరేష్, మీర్జా బేగ్, మహ్మద్ ఫారూఖ్ అహ్మద్ లు స్థానిక అధికారులతో, ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేస్తున్నారు.