ఇది హరీష్ రావు శపథం !!
మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు శపథం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా జారిపోవడం బీఆర్ఎస్ లో కలవరం రేపుతోంది.
మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు శపథం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా జారిపోవడం బీఆర్ఎస్ లో కలవరం రేపుతోంది. మరోవైపు బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందంటూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలు ఆ పార్టీ శ్రేణుల్ని మరింత ఆందోళనకి గురి చేస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జరిపిన చర్చలు కూడా ఫలించినట్టే కనిపిస్తున్నాయి. ఆయనతో భేటీల్లో పాల్గొన్న తర్వాత కూడా ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు.
ఇంకోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ నేతలు స్పీకర్ కి వినతులు సమర్పిస్తూనే ఉన్నారు. మరోవైపు హైకోర్టులోనూ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేసేలా స్పీకర్ కి ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పైనా విచారణ కొనసాగుతూ ఉంది. ఇంకెంతమంది పార్టీని వీడతారో అనే భయం బీఆర్ఎస్ లో మొదలైనట్టు ఉంది. ఈ క్రమంలో చట్టపరమైన చర్యలకి మరింతగా నడుం బిగించారు. సుప్రీం కోర్టుకి వెళ్లాలని కూడా డిసైడ్ అయ్యారు.
బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు ఈ విషయాన్ని ప్రస్తావించారు. పనిలోపనిగా ఓ శపథం కూడా చేసేశారు. సుప్రీంకోర్టు లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోరాడతామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేవరకు మేం నిద్రపోము అని చాలెంజ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది అని ధీమాగా చెప్పారు. అయితే ఇదంతా క్యాడర్ ని కాపాడుకునే ప్రయత్నమనే చెప్పాలి.
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అక్కడి క్యాడర్ నైరాశ్యంలో ఉంది. ఈరోజు పటాన్ చెరు బీఆర్ఎస్ కార్యకర్తలతో హరీష్ రావు సమావేశమయ్యారు. వారికి ధైర్యం చెప్పారు. కార్యకర్తలకి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
"పార్టీకి కష్టాలు వస్తాయి. మీరు ధైర్యంగా ఉండండి. మీ బాధ్యత నేను తీసుకుంటా. మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. ఎమ్మెల్యే పోతే పార్టీ పోదు. పటాన్ చెరులో మంచి కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ ఎగిరేది గులాబి జెండానే. మీరందరూ కష్టపడితేనే మహిపాల్ రెడ్డి గెలిచారు. పటాన్‌చెరుకు ఏం కావాలంటే అది ఇచ్చాం. రోడ్లు, తాగునీళ్లు, స్టేడియం వంటి ఎన్నో అందించాం. నిధుల వరద పారించాం. గూడెం పోయినా గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేవరకు నిద్రపోం. మహిపాల్ రెడ్డికి మూడుసార్లు టికెట్లిచ్చి గెలిపిస్తే పార్టీ మారడానికి మనసెలా వచ్చింది? ఇది న్యాయామా? నీకిది తగునా? 2014 లో వైసీపీ నీకు టికెట్ ఇవ్వకపోతే తల్లిలా దగ్గరికి తీసుకుని నీకు టికెట్ ఇచ్చింది పార్టీ. కార్యకర్తలకు ధైర్యం చెప్పుదాం అని వచ్చిన నాకే మీరు వేలాది మందిగా తరలివచ్చి ధైర్యం చెప్పారు. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసుకుందాం. మళ్లీ గులాబీ జెండా ఎగిరేవరకు కష్టపడి పనిచేద్దాం. ఆరు నూరైనా సరే రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే. మీరు ధైర్యంగా ఉండండి, స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, ఏ ఎన్నికలు వచ్చినా కష్టపడి పనిచేసి గెలుద్దాం" అని హరీష్ రావు కార్యకర్తలకి పిలుపునిచ్చారు.