‘రిపోర్ట్‌పై చర్చంతా బురద రాజకీయమే’
పీసీ ఘోష్ కమిషన్ తన విచారణను చట్టబద్ధంగా చేయలేదని ఆరోపించిన మాజీ మంత్రి హరీష్ రావు.;
కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరుగుతోంది. అధికార పక్షం కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. చర్చలు మొదలవుతూనే ఇరు వర్గాల మధ్య వాతావరణ హీట్ ఎక్కింది. ఈ సందర్భంగానే కాంగ్రెస్ ప్రభుత్వం, పీపీ ఘోష్ కమిషన్‌పై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమిషన్ చట్టబద్ధంగా విచారణ చేపట్టలేదని హరీష్ రావు అన్నారు. ఇదంతా కూడా బురద రాజకీయమేనంటూ విమర్శలు గుప్పించారు. ‘‘ఇవాళ విషయం అవగతమైంది. ఈ ప్రభుత్వం ఇంత ఆదరబాదరగా ఆదివారం రోజున అసెంబ్లీలో నివేదికను పెట్టి చర్చ పెట్టడానికి కారణం. ఇది న్యాయస్థానాల ముందు నిలవదు కాబట్టే ఇంత ఆదరబాదరగా అసెంబ్లీ చర్చ చేసేస్తున్నారు. అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టొద్దంటూ నేను హైకోర్టుకు వెళ్లానని అంటున్నారు. నేను వెళ్లలేదు. కావాలంటే నా పిటిషన్ తెప్పించుకుని చదువుకోండి’’ అంటూ హరీష రావు ఛాలెంజ్ చేశారు.
‘‘కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారం.. 8బీ, 8సీ ఇవ్వకుండా.. నిబంధనలు అనుసరించలేదని మేం కోర్టుకు వెళ్లాం. అది రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చిన హక్కు. ఇందిరాగాంధీ, ఎల్‌కే అద్వానీ కోర్టుకు వెళ్లారు. ఇందిర గాంధీ వెళ్తే ఒప్పు.. మేం వెళ్తే తప్ప? ఎల్‌కే అద్వానీ వెళ్తే ఒప్పు.. మేం వెళ్తే తప్పా? నేను అన్నింటికి గురించి వివరస్తా. మీరు వర్రీ కాకండి. ఈ విషయం కోర్టులో ఉంది. మూడు వారాల్లో కౌంటర్ వేస్తమని ప్రభుత్వం చెప్పింది’ అన్నారు.
నివేదిక చిత్తు కాగితమే అవుతుంది..
‘‘కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ గురించి చర్చించే ముందు సహజ న్యాయానికి, ప్రజాస్వామ్యానికి సంబంధించిన మౌలిక అంశాలపై ముందుగా మాట్లాడుకోవాలి. పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధంగా, విధివిధానాలను పాటిస్తూ విచారణ చేసిందా? అన్న అంశాన్ని చర్చించాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్నవి సాంకేతిక అంశాలు కాదు. రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కుల గురించి మాట్లాడుతున్నా. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారం నిష్పాక్షికంగా విచారణ జరిగిందా? లేదా అనే దాని గురించి మాట్లాడుతున్నా. అలా జరగని పక్షంలో ఆ విచారణకు విలువ ఉండదు.. ఆ విచారణ రిపోర్ట్ చిత్తుకాగితంతో సమానమని గతంలో సుప్రీంకోర్టులు, హైకోర్టులు అనేక సందర్భాల్లో చెప్పాయి. చట్టంలోని 8బీ, 8సీ కింద నాకు గానీ, మాజీ సీఎం కేసీఆర్‌కు గానీ నోటీసులు ఇవ్వలేదు. అలాంటప్పుడు ఈ నివేదిక చెల్లదు’’ అని హరీష్ రావు అన్నారు.
సుప్రీంకోర్టుకు వెళ్తామని భయం..
‘‘ఈ నివేదికను ఛాలెంజ్ చేస్తూ మేము ఎక్కడ సుప్రీం కోర్టుకు వెళ్తామో.. న్యాయస్థానం దీనిని ఎక్కడ కొట్టేస్తుందో అని కాంగ్రెస్ భయపడుతుంది. ఈ నివేదికలో సత్తా లేదు. నిబంధనలకు విరుద్ధంగానే ఈ రిపోర్ట్ ఇచ్చారు. ఈ విషయం సీఎంకు బాగా అర్థమయింది. అందుకే ఆగమేఘాలపై ఆదివారమే చర్చ పెట్టారు. కోర్టులో మళ్ళీ చర్చ వస్తుంది కదా.. ఆ లోపే స్టే వస్తే రిపోర్ట్ క్వాష్ అయిపోతుందనే ఆదివారమే చర్చ చేపట్టారు. విషయాలన్నీ స్పష్టంగా ఉన్నాయి. రాజకీయంగా మీరంతా చేస్తున్న కథ. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రిలిమినరీ రిపోర్ట్. పార్లమెంట్ ఎన్నికలకు ముందు మధ్యంతర నివేదిక. మా సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే ఫైనల్ రిపోర్ట్. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రేపే మాపో వస్తుంది కనుక పీసీ ఘోష్ రిపోర్ట్. ఇవన్నీ రాజకీయ డ్రామాలే. వీళ్లు సర్కస్ నడుపుతున్నరా? సర్కర్ నడుపుతున్నారా? నాకైతే తెలియదు’’ అని హరీష్ రావు చెప్పారు.