Chandrababu and Revanth|చంద్రబాబును రేవంత్ మించిపోయారా ?

ఒక విషయంలోమాత్రం చంద్రబాబునాయుడును తాను మించిపోయినట్లు రేవంత్ నిరూపించుకున్నారు.;

Update: 2025-01-06 11:19 GMT
Revanth released vision 2050 document

గురువును మించిన శిష్యుడు అనంటే రేవంత్ ఒప్పుకుంటారో లేదో తెలీదు. అయితే ఒక విషయంలోమాత్రం చంద్రబాబునాయుడును తాను మించిపోయినట్లు రేవంత్ నిరూపించుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే హైదరాబాదులో ప్రపంచతెలుగు సమాఖ్య సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. సమావేశాల ముగింపులో పాల్గొన్న రేవంత్(Revanth) తెలంగాణ విజన్-2050(Telangana vision 2050) డాక్యుమెంటును విడుదలచేశారు. తెలంగాణ రైజింగ్ అనే నినాదంతో రాబోయే 25 ఏళ్ళ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రేవంత్ విజన్-2050 ప్రణాళిక డాక్యుమెంటును రిలీజ్ చేశారు. ఇక్కడే చంద్రబాబు(Chandrababu)ను రేవంత్ మించిపోయారు.


విషయం ఏమిటంటే ఏపీ రైజింగ్(AP Rising) పేరుతో చంద్రబాబు విజన్-2047 డాక్యుమెంటును విడుదలచేసిన విషయం తెలిసిందే. అంటే 2047కి అభివృద్ధిలో ఏపీ ఎలాగుండాలి ? ఎలాగుంటుందనే తన విజన్ను చంద్రబాబు ఒక డాక్యుమెంటుగా రెడీచేసి రిలీజ్ చేశారు. చంద్రబాబు విజన్-2047(Chandrababu vision 2047) అంటే రేవంత్ మరో అడుగు ముందుకేసి విజన్ -2050 డాక్యుమెంటును రిలీజ్ చేశారు. విజన్ డాక్యుమెంటు తయారీలో మాత్రం చంద్రబాబును రేవంత్ దాటిపోయారని అర్ధమవుతోంది.

వీళ్ళ విజన్ డాక్యుమెంట్లు ఎంతవరకు ఆచరణ సాధ్యం ? గతంలో రిలీజ్ చేసిన విజన్ డాక్యుమెంట్లన్నీ ఏమైపోయాయో అన్న విషయాలను అడగకూడదు. ఎందుకంటే మొదటిసారి ముఖ్యమంత్రి అయినపుడు చంద్రబాబు విజన్-2020 అనే డాక్యుమెంటును రిలీజ్ చేశారు. దాదాపు తొమ్మిదేళ్ళు సీఎంగా పనిచేసిన చంద్రబాబు విజన్ 2020ని ఏ మేరకు అమలుచేశారంటే సమాధానముండదు. 2014లో విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అవగానే రాబోయే 30 ఏళ్ళు టీడీపీనే అధికారంలో ఉండాలనే ఉద్దేశ్యంతోనే అనేక ప్రణాళికలు తయారుచేశారు. ఆ ప్రణాళికలన్నీ ఏమయ్యాయనడిగితే కోపమొస్తుంది. 2019లో ఓడిపోయిన తర్వాత విజన్ అనే పదాన్నే చంద్రబాబు మరచిపోయారు. ఎప్పుడైతే 2024 ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకివచ్చారో వెంటనే విజన్2047 అనేపల్లవి అందుకున్నారు.

అదేపద్దతిలో ప్రయాణిస్తున్న రేవంత్ కూడా తాజాగా విజన్ 2050 అనే పాటందుకున్నారు. తన విజన్ ద్వారా హైదరాబాద్ నగరంలో ఫోర్త్ సిటీని న్యూయార్క్, టోక్యోతో పోటీపడేట్లుగా 30వేల ఎకరాల్లో నాలుగో నగరాన్ని(ఫ్యూచర్ సిటీ) సాంకేతికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేయబోతున్నట్లు చెప్పారు. పనిలోపనిగా ఏపీని కలుపుకుని వెళ్ళేట్లుగా ఒక పిలుపిచ్చారు. అదేమిటంటే తెలుగు ప్రజలు విడివిడిగా పోటీపడటం కన్నా కలిసి అభివృద్ధి వైపు నడిస్తే రెండు రాష్ట్రాలూ ప్రపంచానికి ఆదర్శంగా ఉంటాయన్నారు. దేశంలో హిందీ తర్వాత అత్యధిక ప్రజలు మాట్లాడే భాష తెలుగే అన్నారు. కోట్లాదిమంది తెలుగుప్రజలు వివిధ రాష్ట్రాలు, దేశాల్లో ఉన్నప్పటికీ జాతీయ రాజకీయాలపై గట్టి ప్రభావం చూపలేకపోతున్నట్లు ఫీలైపోయారు.

Tags:    

Similar News