బీసీ 42శాతం రిజర్వేషన్లపై కేంద్రనిర్ణయం ఇదేనా ?

తెలంగాణ బీజేపీ(Telangana BJP) అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మాటలే కేంద్రం పంపిన సంకేతాలుగా పరిగణించాల్సుంటుంది;

Update: 2025-07-22 08:36 GMT
Telangana BJP President N Ramachandra Rao

స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్రప్రభుత్వం సంకేతాలు పంపినట్లుగా అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదేవిషయమై తాజాగా తెలంగాణ బీజేపీ(Telangana BJP) అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మాటలే కేంద్రం పంపిన సంకేతాలుగా పరిగణించాల్సుంటుంది. రామచంద్రరరావు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతు బీసీలకు 42శాతం రిజర్వేషన్లను(BC Reservations) రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చటం అసాధ్యమన్నారు. మతపరమైన, రాజకీయపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టంగా చెప్పారు. అసెంబ్లీలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లు పెట్టినపుడు ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం షెడ్యూల్ 9లో చేర్చాలన్న డిమాండు బిల్లులో పెట్టలేదన్నారు. బీజేపీ ఎంఎల్ఏలను రేవంత్ ప్రభుత్వం నమ్మించి మోసంచేసిందని ధ్వజమెత్తారు.

రిజర్వేషన్ల అమలు సాధ్యంకాదని తెలిసి షెడ్యూల్ 9 అంటు రేవంత్ కొత్తనాటకం ఆడుతున్నట్లు ఆరోపించారు. రిజర్వేషన్ల అమలుసాధ్యంకాదని తెలిసిన తర్వాత నిందను కేంద్రప్రభుత్వంపై నెట్టేయటానికి రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు మండిపోయారు. సో, రామచంద్రరావు తాజా వ్యాఖ్యలతర్వాత అర్ధమవుతున్నది ఏమిటంటే రేవంత్ ప్రభుత్వం పంపిన బిల్లును ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టదని. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెటకపోతే చర్చజరగదు, ఓటింగ్ జరగదు కాబట్టి బిల్లును రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చటం జరిగేపనికాదు. షెడ్యూల్ 9లో చేర్చకుండానే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేయటం సాధ్యంకాదు. ఎందుకంటే రిజర్వేషన్ల అమలు కోర్టులో నిలబడదు.

ఈవిషయం రేవంత్ ప్రభుత్వానికి బాగా తెలుసు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల ఆర్డినెన్స్ కూడా ఇంకా గవర్నర్ పరిశీలనలోనే ఉంది. కేంద్రప్రభుత్వం, న్యాయనిపుణులు, రాజ్యాంగనిపుణులతో మాట్లాడకుండా ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం పెట్టరు. న్యాయనిపుణులు, రాజ్యాంగ నిపుణులు సమస్యను, దాని పర్యవసానాన్ని వివరిస్తారు కాబట్టి ఆర్డినెన్స్ అమలు కూడా అనుమానమే. దీనికి ప్రత్యామ్నాయం ఏమిటంటే పార్టీపరంగా బీసీలకు కాంగ్రెస్ 42శాతం సీట్లు ఇవ్వటమే. రాచమార్గంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యంకాదని తెలిసే రేవంత్ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసింది. ఈఆర్డినెన్స్ అమలుపైన కూడా అనుమానాలు ఉండటం వల్లే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేయకుండా చూడాలని బీసీ సంఘాల నేతలను రేవంత్ కోరిన విషయం గుర్తుండే ఉంటుంది. అంటే ఎవరైనా ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలుచేస్తు కోర్టులో కేసువేస్తే ఆర్డినెన్స్ అమలు కూడా నిలిచిపోతుందని రేవంత్ కు బాగా తెలుసని అర్ధమవుతోంది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు అసాధ్యం.

రేవంత్ దే పై చేయా ?

ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకంచేయకపోయినా, రేవంత్ ప్రభుత్వం పంపినబిల్లును ఎన్డీయే ప్రభుత్వం ఆమోదించకపోయినా రేవంత్ దే పైచేయిగా అనుకోవాలి. ఎలాగంటే, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో చేసిన ప్రయత్నాన్ని ఎన్డీయే ప్రభుత్వం, గవర్నర్ అడ్డుకున్నట్లు స్ధానికసంస్ధల ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటారు. తెలంగాణ బీజేపీనేతలు, కేంద్రమంత్రులే బీసీలకు వ్యతిరేకంగా కేంద్రంలో చక్రంతిప్పి రిజర్వేషన్లు అమలుకాకుండా అడ్డుకున్నారని ప్రచారంతో రేవంత్ హోరెత్తించేస్తాడు. ఎవరెన్ని విధాలుగా అడ్డుకున్నా పార్టీపరంగా బీసీలకు కాంగ్రెస్ 42శాతం రిజర్వేషన్లు అమలుచేస్తోందని ప్రచారం చేసుకుంటారు. పనిలోపనిగా బీజేపీతో లోపాయికారీగా బీఆర్ఎస్ చేతులు కలిపిందని రెండుపార్టీలను కలిపి రేవంత్ ఆరోపణలు గుప్పిస్తాడు. అప్పుడు బీఆర్ఎస్(BRS), బీజేపీలు రెండూ డిఫెన్స్ లో పడటం ఖాయం. కాకపోతే రేవంత్ ఆరోపణలు, విమర్శలకు కౌంటర్లు ఇచ్చినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు.

Tags:    

Similar News