మావోయిస్టులపై ఆదివాసీల్లో తిరుగుబాటు మొదలైందా ?

పోస్టర్లపై పోలీసులు కౌటాలంలోని పెద్దలు, యువకులతో మాట్లాడుతు సమాచారాన్ని సేకరిస్తున్నారు.;

Update: 2025-04-13 10:02 GMT
Posters against Maoists

దశాబ్దాలుగా మావోయిస్టులకు అండగా ఉంటున్నది ఆదివాసీలే. అడవుల్లో ఉంటున్న గిరిజునులే మావోయిస్టులకు మద్దతుగా నిలబడుతున్నారు. గిరిజనులు అందరు కాకపోయినా కొందరైనా మావోయిస్టుల(Maoists) తరపున ఇన్ఫార్మర్లుగా పనిచేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అడవుల్లో మావోయిస్టులకు షెల్టర్ ఇవ్వటం, బస, వసతిచూడటం, పట్టణాల నుండి అవసరమైన మందులు తెచ్చివటం, సమాచారాన్ని చేరవేయటం లాంటి పనులను ఆదివాసీల్లో కొందరు చేసేవారు. ఈ విషయాలు తెలుసుకున్న పోలీసులు గిరిజనుల(Tribals)పై దాడులుచేసి మావోయిస్టుల సమాచారం చెప్పాలని నానా ఇబ్బందులు పెట్టేవారు. మావోయిస్టులకు గిరిజనులు షెల్టర్ ఇవ్వద్దని పోలీసు అధికారులు చాలాసార్లు బహిరంగానే విజ్ఞప్తిచేసిన విషయం తెలిసిందే. ఇలాంటి విషయాలన్నింటినీ కొన్నిసినిమాల్లో కళ్ళకుకట్టినట్లు చూపించారు. అలాంటి ఆదివాసీలే ఇపుడు మావోయిస్టులకు దూరమైపోతున్నారా ?

ఇంతకీ విషయం ఏమిటంటే సిర్పూర్ జిల్లాలోని కౌటాల గ్రామంలోని కొన్ని ఇళ్ళ గోడలపై హఠాత్తుగా కొన్ని పోస్టర్లు వెలిశాయి. అందులో మావోయిస్టుల నైజాన్ని, వారి వైఖరిని ప్రశ్నిస్తు కొన్ని ప్రశ్నలున్నాయి. ఆదివాసీ యువజన సంఘం పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలున్నాయి. ‘నిత్యం ఆదివాసీ ప్రజలపై ఆధారపడి బతికే మీరు అడవుల్లో విచ్చలవిడిగా మందుపాతరలు పెట్టడం సరికాదు..ఇదేనా మీ సిద్ధాంతం’ అంటు ఆదివాసీ యువజన సంఘం పేరుతో సూటిగా ప్రశ్నించారు. ఇళ్ళగోడలపై నాలుగురకాల ప్రశ్నలతో ఆదివాసీ యువజన సంఘం మావోయిస్టులపై విరుచుకుపడింది.

‘మందుపాతరలతో అమాయకులు చనిపోయారని, కొంతమంది ఆదివాసీలు శాశ్వత అంగవైకల్యానికి గురయ్యార’ని చెప్పింది సంఘం. ’మేము అడవుల్లోకి వెళ్ళకుండా ఇంకెక్కడికి వెళ్ళాలి‘..’మీరు తలదాచుకోవటానికి మా ప్రాంతాలే దొరికాయా‘ ? ‘భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను నియంత్రించే అధికారం మీకెక్కడిది’ ? ఆదివాసీలు బతికేదెలాగ ?..‘మాప్రాంతాలపై మీ పెత్తనం ఏమిటి ? తరాలుగా ఆదివాసీలకు మావోయిస్టుల వల్ల జరుగుతున్న నష్టాలను ముక్తకంఠంతో ప్రశ్నిద్దాం’ అని పోస్టర్లలో ఉన్నాయి. పోస్టర్లపై పోలీసులు కౌటాలంలోని పెద్దలు, యువకులతో మాట్లాడుతు సమాచారాన్ని సేకరిస్తున్నారు.

కౌటాలంలో నాలుగురకాల పోస్టర్లువెలిశాయి. ఈనాలుగు పోస్టర్లలోను మావోయిస్టులను నిలదీస్తు నాలుగు ప్రశ్నలున్నాయి. అసలు ఈపోస్టర్లు వెలియటానికి కారణం ఏమిటి ? కారణం ఏమిటంటే ఒక పోస్టర్లో ‘కర్రెగుట్టలపైకి ఆదివాసీలు రావద్దు..వస్తే బాంబులు పేల్చేస్తాం’ అని మావోయిస్టుల హెచ్చరికుంది. ఈహెచ్చరికను ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘ఆదివాసీల జీవనాధారమైన అడవుల్లోకి వెళ్ళనీయకుండా బాంబులు పెట్టి అడ్డుకుంటారా ? మావోయిస్టులారా ఇంకెన్నాళ్ళు మీ అరాచకాలు’ అంటు నిలదీసింది సంఘం. కర్రెగుట్టల్లో మందుపాతరలు మావోయిస్టులారా..తీరవా మీ రక్తదాహాలు అంటు మరో పోస్టర్లో ప్రశ్నించారు.

‘అడవుల్లో బాంబులు...ఆదివాసుల గుండెల్లో గుబులు...మావోయిస్టులారా సిగ్గుసిగ్గు’ అంటు మరో పోస్టర్లో ఈసడించుకున్నది సంఘం. చివరగా ‘మావోయిస్టులారా...ఇదేనా మీ సిద్ధాంతం ? ఇందుకోసమేనా మీ పోరాటం’ ? అంటు నిలదీసింది. కర్రెగుట్టల్లో బాంబులు పెట్టాం కాబట్టి ఆదివాసీలు వస్తే పేల్చేస్తామని మావోయిస్టులు బెదిరిస్తున్నట్లు ఆదివాసీ సంఘం మండిపడుతోంది. ఆదివాసీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటంటే మావోయిస్టుల ఆచూకీ చెప్పమని పోలీసుల వేధింపులు. తమ ఆచూకీ చెబితే చంపేస్తామని మావోయిస్టుల బెదిరింపుల మధ్య ఆదివాసీలు నలిగిపోతున్నారు. మావోయిస్టులకు షెల్టర్ ఇచ్చారన్న ఆరోపణలతో ఆదివాసీలపైన పోలీసులు కేసులు పెట్టి అరెస్టు చేయటం అందరికీ తెలిసిందే. ఇదేసమయంలో పోలీసులకు తమ ఆచూకీ చెబుతున్నారన్న కోపంతో ఆదివాసీలను మావోయిస్టులు కాల్చి చంపుతున్న ఘటనలు అందరికీ తెలిసిందే. ఇద్దరి మధ్యా ఆదివాసీలు బాగా నలిగిపోతున్నారు. కర్రెగుట్టలపైన మావోయిస్టులు నిజంగానే బాంబులు పెట్టారా ? లేదా అన్న విషయంలో క్లారిలేదు. ఈ విషయాన్ని పోలీసులే నిర్ధారించాలి.

Tags:    

Similar News