TTD|శ్రీవారి దర్శనానికి భక్తులను టీటీడీ బోర్డు దూరంచేసిందా ?

ప్యాకేజీల ద్వారా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శనం చేసుకునే భక్తుల టికెట్లను కొత్తగా ఏర్పాటైన టీటీడీ బోర్డు(TTD Board) ఏకపక్షంగా రద్దుచేసేసింది.

Update: 2024-12-01 06:03 GMT
Tirumala Srivaru

క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. డిసెంబర్ 1వ తేదీనుండి అంటే ఈరోజు ఆదివారం నుండి ప్రైవేటు ట్రావెల్స్, ఆర్టీసీ, తెలంగాణా టూరిజం ప్యాకేజీల ద్వారా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శనం చేసుకునే భక్తుల టికెట్లను కొత్తగా ఏర్పాటైన టీటీడీ బోర్డు(TTD Board) ఏకపక్షంగా రద్దుచేసేసింది. ఒక్కసారిగా బోర్డు తీసుకున్న నిర్ణయంతో భక్తులకు పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే దర్శనాల రద్దుకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకునే ముందే దేశం మొత్తంమీద లక్షలాది మంది భక్తులు వివిధ ప్యాకేజీల్లో టికెట్లను బుక్ చేసుకుని ఉంటారు. అలా చేసుకున్న బుకింగులన్నింటినీ బోర్డు ఏకపక్షంగా రద్దుచేయటంతో భక్తులకు ఏమిచేయాలో దిక్కుతోచలేదు. టూర్లు, ప్యాకేజీల దర్శనాలను రద్దుచేసిన బోర్డు సాధారణ భక్తుల్లాగే తిరుమలకు చేరుకుని దర్శనాలు చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చింది.

బోర్డు తీసుకున్న ఈ నిర్ణయానికి కారణం ఏమిటంటే దర్శన టికెట్ల బ్లాక్ దందాను అరికట్టేందుకే అని సమర్ధించుకుంటోంది. దర్శనం టికెట్లలో ఎక్కడ దందాలు జరిగాయి ? ఎక్కడ బ్లాక్ మార్కెటింగ్ జరిగింది, ఎక్కడ అక్రమాలు జరిగాయన్న విషయాన్ని మాత్రం టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు(TTD Board Chairman BR Naidu) వివరించలేదు. బ్లాక్ మార్కెటింగ్ జరిగింది, దర్శనాల దందాలు జరుగుతున్నాయి అని చాలా సింపుల్ గా చెప్పేసి మొత్తం ప్యాకేజీలన్నింటినీ రద్దుచేసేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఇదివరకే ప్యాకేజీల్లో టికెట్లను బుక్ చేసుకున్న వాళ్ళ సంగతి ఏమిటన్న ప్రశ్నకు ఛైర్మన్ సమాధానం చెప్పటంలేదు. మిగిలిన ప్రాంతాల సంగతి ఎలాగున్నా తెలంగాణా(Telangana) నుండే ప్రతిరోజు పెద్దఎత్తున ఆర్టీసీ, తెలంగాణాటూరిజం(Telangana Tourism), ట్రావెల్స్ ప్యాకేజీల ద్వారా తక్కువలో తక్కువ 10 వేలమంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి చేరుకుంటారు.

తెలంగాణా నుండి తిరుమల(Tirumala)కు ప్రతిరోజు తెలంగాణా ఆర్టీసీతో పాటు టూరిజం శాఖ పదులసంఖ్యలో ప్యాకేజీలను నడుపుతోంది. ఆర్టీసీ, టూరిజంశాఖల ప్యాకేజీలు కాకుండా ప్రైవేటు ట్రావెల్స్ కూడా చాలా ప్యాకేజీలను నడుపుతున్నాయి. ఇవన్నీ గతంలో టీటీడీతో ఒప్పందాలు చేసుకున్న తర్వాతనే ప్యాకేజీలను నడుపుతు భక్తులను శ్రీవారి దర్శనాలకు తిరుమలకు తీసుకుని వస్తున్నాయి. 24 గంటల ప్యాకేజీలు, రెండు, మూడురోజుల ప్యాకేజీల పద్దతిలో భక్తులకు పై సంస్ధలు టికెట్లను బుక్ చేస్తుంటాయి. 24 గంటల ప్యాకేజీల్లో హైదరాబాదుతో పాటు తెలంగాణాలోని అనేక ప్రాంతాల నుండి భక్తులను బస్సుల్లో ఎక్కించుకుని నేరుగా ఉదయానికి తిరుపతి చేరుకుంటాయి. తిరుపతిలోని టీటీడీ సత్రాల్లో అవసరాలు తీర్చుకున్న తర్వాత టిఫెన్ తినేసిన భక్తులు మళ్ళీ అవే బస్సుల్లో ఎక్కి తిరుమలకు చేరుకుంటారు. అక్కడ ముందే ఏర్పాటుచేసిన ధర్శనాల స్లాటులో భక్తులకు దర్శనాలు చేయించి సాయంత్రానికి మళ్ళీ అందరినీ ఆపరేటర్లు తిరుపతికి చేర్చుతారు. తిరుపతి సత్రాల్లో తమ అవసరాలు తీర్చుకోగానే బస్సులు రాత్రి భక్తులను ఎక్కించుకుని ఎక్కడైతే బయలుదేరాయో అక్కడే దింపేస్తాయి.

ఇక రెండు, మూడురోజుల ప్యాకేజీల్లో అయితే తిరుమల శ్రీవారి దర్శనం అయిపోగానే తిరుమలలోనే ఉన్న మరికొన్ని చారిత్రక ప్రాంతాలను చూపించి తిరుపతికి తీసుకొచ్చేస్తాయి. తిరుపతి చుట్టుపక్కల ఉన్న తిరుచానూరు, శ్రీవారి మంగాపురం, కాణిపాకం వినాయకుడి ఆలయం, శ్రీకాళహస్తికి భక్తులను తీసుకెళ్ళి దర్శనాలు చేయిస్తాయి. ఆర్టీసీ, టూరిజంశాఖ, ప్రైవేటు ట్రావెల్స్ నిర్వహిస్తున్న ప్యాకేజీల్లో ప్రత్యేకంగా మోసాలు జరిగే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ఎలాగంటే టికెట్ల ధరలు, బస, దర్శనాల వివరాలు అన్నింటినీ ప్యాకేజీల ధరల్లోనే స్పష్టంగా ఉంటాయి. చూపించిన ప్యాకేజీలకు మించి డబ్బులు వసూలు చేస్తున్నపుడే మోసాలు, దందాలు జరుగుతున్నాయని అనుకోవాలి. కాని అలా మోసాలు జరుగుతున్నట్లు ఇప్పటివరకు భక్తుల నుండి ఆరోపణలు రాలేదు.

ప్యాకేజీల రూపంలో శ్రీవారి దర్శనాల్లో దందాలు ఎక్కడ జరుగుతున్నాయో ఛైర్మన్ వివరించి ఉంటే బాగుండేది. అసలు ఈ ప్యాకేజీలకు ఇంతటి డిమాండ్ ఎందుకు ఉన్నది ? ఎందుకంటే మామూలుగా శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే మామూలు భక్తులకు ఉన్నది ఒకటే మార్గం. అదేమిటంటే ఆన్ లైన్లో(Online Sevas) టీటీడీ విడుదలచేసిన దర్శన టికెట్లను బుక్ చేసుకోవటమే. టీటీడీ దర్శనాల టికెట్లను ఆన్ లైన్లో పెట్టిన నిముషాల్లోనే లక్షల టికెట్లు అమ్ముడుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. నిముషాల్లోనే ఇన్నిలక్షల టికెట్లు ఎలాగ అమ్ముడుబోతున్నాయనే విషయంలోనే చాలామందికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఈ విషయాన్ని టీటీడీ బోర్డు ఛైర్మన్ ఆలోచిస్తే బాగుంటుందేమో. నిముషాల్లో లక్షల టికెట్లు అమ్ముడుపోతున్న విషయంపైనే చాలాకాలంగా ఆరోపణలున్నాయి. సరే, ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ఆన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి రైలు, బస్సుల్లో టికెట్లు దొరకటం చాలాకష్టం. రైలు, బస్సు టికెట్లు బుక్ అయితే తిరుమల దర్శన టికెట్లు దొరకవు. దర్శన టికెట్లు దొరికితే ప్రయాణ టికెట్లు దొరకటం కష్టం.

అందుకనే ఆన్ లైన్లో దర్శనాల టికెట్లు బుక్ చేసుకునే అవకాశం, ప్రయాణ టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యంలేని చాలామంది భక్తులు ఆర్టీసీ, టూరిజం, ప్రైవేటు ట్రావెల్స్ నిర్వహిస్తున్న ప్యాకేజీలవైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి ప్యాకేజీల్లో కుటుంబం అంతా టికెట్లు బుక్ చేసుకుంటే ప్రయాణం, తిరుపతి(Tirupati)లో బస ఏర్పాటు, తిరుమల దర్శనాలు అన్నీ ప్యాకేజీల్లోనే కవర్ అయిపోతాయి కాబట్టి వేలాదిమంది భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటోంది. తిరుమలలోనే దర్శనాలు, ప్రసాదాల బ్లాక్ మెర్కెటింగ్, సేవల టికెట్ల అమ్మకాలపైనే చాలా ఆరోపణలున్నాయి. అలాంటి వాటిపై దృష్టిపెట్టి విచారణ జరిపి లోపాలను సరిదిద్దాల్సిన బోర్డు ఏకపక్షంగా ప్యాకేజీల దర్శనలాను రద్దుచేసి శ్రీవారి దర్శనాలకు వేలాదిమంది భక్తులను దూరం చేయటం బాధాకరమనే చెప్పాలి.

భక్తులను శ్రీవారికి దూరంచేయటమే


ఇదే విషయమై ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టాయ్)(Travel Agents Association of India) ఏపీ, తెలంగాణా ఛైర్మన్ పాంపాటి నగేష్(Pampati Nagesh) ‘తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు ‘ఏకపక్షంగా ప్యాకేజీల దర్శనాలను టీటీడీ బోర్డు రద్దుచేయటం దురదృష్టకరమ’న్నారు. ‘వివిధ ప్యాకేజీల ద్వారా ప్రతిరోజు తెలంగాణా నుండే పదివేలమంది భక్తులు తిరుమలకు వెళుతుంటార’ని చెప్పారు. అనువైన తేదీల్లో ఎప్పుడో ప్యాకేజీలను బుక్ చేసుకున్న భక్తులకు టీటీడీ బోర్డు నిర్ణయం షాకనే చెప్పారు. ‘రద్దుచేసిన ప్యాకేజీల దర్శనాలకు బోర్డు ప్రత్యామ్నయంగా ఏమి చేస్తుందో చూడాల’ని చెప్పారు. ‘ప్యాకేజీలు రద్దయిన కారణంగా బుకింగులు క్యాన్సిల్ చేసి ఎవరి డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తామ’న్నారు. ‘బోర్డు ఛైర్మన్ చెప్పినట్లుగా ప్యాకేజీల్లో మోసాలు, దందాలు జరిగినట్లు ఎప్పుడూ తమ దృష్టికి రాలేద’న్నారు. టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకోలేని భక్తులకు ప్యాకేజీల టూర్లు మంచి ప్రత్యామ్నాయని నగేష్ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News