బనకచర్ల కోసం చంద్రబాబు పట్టుబడుతున్న కారణమిదేనా ?

ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు సాధించుకోవాలన్న పట్టుదలతో చంద్రబాబు రెండురోజులుగా ఢిల్లీలోనే క్యాంపువేయటమే ఆశ్చర్యంగా ఉంది;

Update: 2025-07-16 10:09 GMT
Chandrababu

ఇంటా బయటా ఇంత వ్యతిరేకత ఎదురవుతున్నా నారా చంద్రబాబునాయుడు మాత్రం తాను పట్టుకున్న కుందేలుకు మూడేకాళ్ళన్నట్లుగా బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla) నిర్మాణంపై ఎందుకింత పట్టుదలగా ఉన్నారు ? ఎంతమంది వ్యతిరేకించినా సరే బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలన్న చంద్రబాబు(Chandrababu) పట్టుదలకు కారణం ఏమిటి ? కేంద్రప్రభుత్వ సంస్ధలు వ్యతిరేకించాయి, గోదావరి బోర్డు అభ్యంతరం చెప్పింది. రేవంత్(Revanth) తో పాటు యావత్ తెలంగాణలోని పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినాసరే ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు సాధించుకోవాలన్న పట్టుదలతో చంద్రబాబు రెండురోజులుగా ఢిల్లీలోనే క్యాంపువేయటమే ఆశ్చర్యంగా ఉంది. చివరకు ఒకపుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మాజీ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూడా ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించటమే కాదు రాష్ట్రంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

కేంద్రంలో చంద్రబాబు మద్దతుతోనే కొనసాగుతున్న ఎన్డేయే ప్రభుత్వం కొనసాగుతోంది. అందుకనే ఏపీ విషయంలో తాను ఏమిచెబితే అది జరిగితీరుతుందని చంద్రబాబు అనుకున్నట్లున్నారు. విధాన నిర్ణయాలు చేసేవారు ఓకే అన్న తర్వాత ఉన్నతాధికారులు, అనుమతులు ఇవ్వాల్సిన సంస్ధలు ఏమిచేస్తాయిలే ఓకే చెప్పకుండా అని చాలా లైటుగా తీసుకున్నట్లున్నారు. అయితే ప్రతిపాదనలు ఢిల్లీకి చేరినదగ్గర నుండి అడుగడుగునా ప్రాజెక్టుకు వ్యతిరేకత పెరిగిపోతోంది. దాంతో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా చంద్రబాబు వ్యూహాలన్నీ బెడిసికొడుతున్నాయనే సంకేతాలు పెరిగిపోతున్నాయి. దాంతో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుకున్నది అనుకున్నట్లుగా ఏమీ సాగటంలేదా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

గోదావరి వరదజలాల నీటితోనే బనకచర్ల ప్రాజెక్టు నిర్మించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని కొద్దిరోజులుగా చంద్రబాబు భీకరమైన ప్రకటనలు చేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. సహజంగానే చంద్రబాబు ప్రకటనకు తెలంగాణ నుండి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. విచిత్రం ఏమిటంటే తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా చంద్రబాబు ప్రకటనపై వ్యతిరేకత పెరిగిపోతోంది. హోలుమొత్తంమీద చూస్తుంటే తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా బనకచర్ల ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేరనే అనిపిస్తోంది. తాజాగా సీడబ్ల్యూసీ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ కూడా బనకచర్ల నిర్మాణం సాధ్యంకాదు పొమ్మన్నారు.

ప్రాజెక్టుల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాల్సిన సంస్ధలే తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే ఇక ప్రాజెక్టు పనులు ముందుకు ఎలా సాగుతాయి. నిర్మాణంలో ఉన్న పోలవరంప్రాజెక్టును పక్కనబెట్టేసి బనకచర్లను ఎందుకు ఎత్తుకున్నారు ? కేవలం కాంట్రాక్టుసంస్ధకు కాసులు కురిపించటం కోసమే రు. 84 వేలకోట్లతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని తలకెత్తుకుంటున్నట్లు చంద్రబాబు మీద ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఇన్నిరకాలుగా వ్యతిరేకత ఎదుర్కుంటున్న బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంకోసం చంద్రబాబు ఎందుకని ఇంతగా పట్టుబడుతున్నట్లు ? నీటి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాల్సిన గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్(జీఆర్ఎంబీ) సెంట్రల్ వాటర్ కమీషన్(సీడబ్ల్యూసీ), కేంద్ర అటవీ, పర్యవరణ శాఖ ఈ ప్రాజెక్టు సాధ్యంకాదని ప్రతిపాదనలను తిప్పిపంపాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటి(పీపీఏ) కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. తాజగా వెదిరె శ్రీరామ్ కూడా బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం సాధ్యకాదు పొమ్మన్నారు. గోదావరిలో వరదజలాలే లేనపుడు వరదజలాల ఆధారంగా బనకచర్లను చంద్రబాబు ఎలాగ నిర్మిస్తారని వెదిరె తీవ్రంగా ప్రశ్నించారు.

చంద్రబాబు చెబుతున్నట్లుగా సముద్రంలో కలిసేది ఏడాదికి 3 వేల టీఎంసీలు కాదని కేవలం 1,138 టీఎంసీలు మాత్రమే అని వెదిరే తేల్చిచెప్పేశారు. ప్రాజెక్టుపై చంద్రబాబు చెబుతున్న లెక్కలన్నీ కేవలం ఊహాజనితమే అని కొట్టిపారేశారు. బనకచర్లను నిర్మిస్తే తెలంగాణతో పాటు బేసిన్ లోని రాష్ట్రాలకూ నష్టమే అని చెప్పారు. హోలు మొత్తంమీద అర్ధమవుతున్నది ఏమిటంటే చంద్రబాబు మానసపుత్రిక లాంటి బనకచర్లపై ఇంటా బయటా అన్నిచోట్లా తీవ్రస్ధాయిలో వ్యతిరేకత పెరిగిపోతోంది.

మెఘా సంస్ధ కోసమేనా ? ఏబీవీ

రిటైర్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు ‘ఆలోచనాపరుల వేదిక’ అనే వేదికను ఏర్పాటుచేశారు. ఈవేదిక ఉద్దేశ్యం ఏమిటంటే పోలవరం-బనకచర్ల లింకు ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించటమే. మాజీ అధికారి కంభంపాటి పాపారావు, రచయిత అక్కినేని భవాని ప్రసాద్, టీ లక్ష్మీనారాయణతో కలిసి ఏబీ మీడియాతో మాట్లాడుతు, బనకచర్ల ప్రాజెక్టును రాష్ట్ర ప్రయోజనాలకన్నా కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే తలకెత్తుకున్నట్లుందని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ ప్రాజెక్టును చంద్రబాబు కేవలం మెఘా ఇంజనీరింగ్ సంస్ధ(MEIL) కోసమే చేపడుతున్నారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఏపీకి, తెలంగాణకు ఎలాంటి ప్రయోజనంలేదన్నారు. అయితే మెఘా సంస్ధకు మాత్రం బాగా ప్రయోజనాలు దక్కబోతున్నట్లు ఎద్దేవాచేశారు. ఈప్రాజెక్టు నిర్మాణంవల్ల దీర్ఘకాలంలో కృష్ణా జలాలపై ఏపీ వాటాకు పెద్ద దెబ్బతగలటం ఖాయమని ఏబీ ఆందోళన వ్యక్తంచేశారు. రాయలసీమలో ఇపుడు ఉన్న తెలుగుగంగ, గాలేరు-నగిరి, కేసీ కెనాల్ ప్రాజెక్టులు బనకచర్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవటం ఖాయమని ఆందోళన వ్యక్తంచేశారు. కొత్తగా బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి బదులుగా గాలేరు నగిరి, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తిచేయటంపై చంద్రబాబు దృష్టిపెట్టాలని సూచించారు.

Tags:    

Similar News