రేవంత్‌ను తరిమేస్తేనే రాష్ట్రానికి శని పోతుంది: కేటీఆర్
ఇంతటి చేతకాని, బలహీన సీఎంను తానెప్పుడూ చూడలేదన్న కేటీఆర్.
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. ఇంతటి దద్దమ్మ ముఖ్యమంత్రిని, బలహీన ముఖ్యమంత్రిని తాను ప్రపంచంలో ఎక్కడా చూడలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాల దెబ్బకు ఐఏఎస్ అధికారులు కూడా ఉద్యోగాలు వదులుకునే పరిస్థితులు వచ్చాయని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి వేల కోట్ల రూపాయలు సంపాదించడంలో ఉంటే.. మంత్రులు వందల కోట్లు సంపాదించడంలో బిజీగా ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో తుపాకులతో బెదిరించే సెటిల్‌మెంట్ సెంటర్లు ఫుల్.. తూకాలు వేసి ధాన్యం కొనే కేంద్రాలు మాత్రం నిల్ అని చురకలంటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అయిందని, దందాలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు.
‘‘కాంగ్రెస్ పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. తెలంగాణను అగ్రికల్చర్‌లో మేము అగ్రస్థానంలో ఉంచితే.. కాంగ్రెస్ మాత్రం గన్‌కల్చర్ తీసుకొచ్చింది అధమ స్థానానికి తీసుకెళ్తోంది. నా రాజకీయ జీవితంలో ఇంతటి బలహీన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. ఎక్కడా చూడలేదు. అదే విధంగా ఒక మంత్రి ఇంటికి ముఖ్యమంత్రే టాస్క్ ఫోర్స్ పోలీసులను పంపడం. నిందితుడిని మంత్రి తన కారులో కూర్చోబెట్టుకుని వెళ్లిపోవడం కూడా ఎప్పుడూ చూడలేదు’’ అని అన్నారు.
సీఎంకు సిగ్గులేదా..
‘‘స్వయంగా సీఎం అనుచరుడు, ఆప్తుడు రోహిన్ రెడ్డి బెదరించారని, రేవంత్‌యే తుపాకీ ఇచ్చారని మంత్రి కుమార్తె ఆరోపించారు. బెదిరించడం నిజమేనని పోలీసులు చెప్తున్నారు. ముఖ్యమంత్రే తుపాకీ ఇచ్చి పంపాడని ఆరోపణ చేసినప్పుడు సీఎం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు. ఆ మంత్రిని పదవి నుంచి ఎందుకు తొలగించలేదు. సిగ్గు అనేది ఉంటే ఆ అంశంపై కనీసం స్పందించనన్న స్పందించాలి. నీపైన మంత్రి బిడ్డే ఆరోపణలు చేస్తే ఆ మంత్రిని పక్కకు జరపలేవు. నీ మంత్రులే నీపై ఆరోపణలు చేస్తున్నా ఏమీ చేయలేని బలహీన సీఎంవి నువ్వు. సిగ్గు ఉంటే పాలనపై పట్టు నిరూపించకోవాలి. రేవంత్‌కు తన పాలన, మంత్రులపై ఏమాత్రం పట్టు లేదని స్పష్టం అయిపోయింది. ఇలాంటి సీఎంను తరిమేసుకుంటేనే తెలంగాఱ రాష్ట్రానికి పట్టిన శని పోతుంది’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.
పోలీసులు ఏం చేస్తున్నారు..
‘‘రాష్ట్రంలో మాఫియా రాజ్యమేలుతోంది. మంత్రులు, సీఎం ఆధ్వర్యంలో ఇంత అరాచకం జరుగుతుంటే పోలీసులు ఏం పీకుతున్నారు. చోద్యం చూస్తున్నారా? పరిశ్రమల యజమానులకు తుపాకీలు పెట్టినప్పుడు, వాటాల పంచాయతీతోనే మంత్రులు బజారుకెక్కినప్పుడు, సీనియర్ అధికారులు పారిపోతుంటే.. పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? గన్ ఇచ్చింది రేవంత్, బెదిరించింది రోహిన్ అని మంత్రి కుమార్తె ఆరోపిస్తుంటే.. పోలీసులు మాత్రం గన్ ఇచ్చింది కొండా మురళి, బెదిరించింది సుమంత్ అని చెప్తున్నారు. రెండు సందర్భాల్లో కూడా గన్నుతో బెదిరించడం వాస్తవం. కానీ పోలీసులు ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంత తంతు జరుగుతుంటే డీజీపీ శివధర్ రెడ్డి ఏం చేస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘పింక్ బుక్కులు, రెడ్ బుక్కులు, బ్లూ బుక్కులు తమ దగ్గర ఉండవని శివధర్ రెడ్డి అన్నారు. వాళ్ల దగ్గర ఉండే ఖాకీ బుక్‌ను కాకి ఎత్తుకుపోయిందా. బీఆర్ఎస్ కార్యకర్తలను జైల్లో పెట్టిన పోలీసులు.. కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రయోజనం చేకూర్చేలా ఎందుకు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో కొందరు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల కన్నా అద్వాన్నంగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే.. గన్ను తెచ్చింది ఎవరు? గురి పెట్టింది ఎవరు అనే విషయాలను తేల్చాలి. ఈ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని విచారించి.. ఆయన అభిప్రాయాన్ని రికార్డ్ చేయాలి. సుమంత్‌ను విచారించి నిజానిజాలు బయటపెట్టాలి’’ అని డిమాండ్ చేశారు.