గ్రూప్-1 పరీక్షను రద్దు చేయండి: కవిత

సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కోరిన కవిత.

Update: 2025-10-23 11:04 GMT

గ్రూప్-1 పరీక్షలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు సుప్రీంకోర్లు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. గ్రూప్-1 నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించారని, దీనిని సుమోమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల గ్రూప్-1 అభ్యర్థులకు సీఎం రేవంత్.. నియామపక పత్రాలు అందించారని తెలిపారు. శిల్పకళావేదికలో 562 మంది నియామక పత్రాలు అందించారని వివరించారు. గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, ట్రాన్స్‌లేషన్ సమస్య వల్ల డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, ప్రొఫెసర్లు మూల్యాంకనం సరిగా చేయలేకపోయారని అన్నారు. దాని కారణంగా మార్కుల్లో తీవ్ర వ్యత్యాసాలు వచ్చాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ప్రిలిమ్స్‌కు ఒక హాల్‌టికెట్ నెంబర్, మెయిన్స్‌కు ఒక నెంబర్ ఇవ్వడం వల్ల విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ఆమె తన లేఖలో ప్రస్తావించారు. అయితే ఈ అంశంపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలవడం, హైకోర్టుకు ర్యాంకుల జాబితాను రద్దు చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత హైకోర్టు తీర్పును టీజీపీఎస్సీ.. ఛాలెంజ్ చేసింది.

అసలు వివాదం ఏంటంటే..!

టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనాల్లో భారీ అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పరీక్షను తెలుగులో రాసిన వారికి మార్కులు తగ్గించారని వారు ఆరోపించారు. ఈ మేరకు వారు తమకు న్యాయం చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారించిన జస్టిస్ రాజేశ్వరరావు.. ‘‘తెలుగులో గ్రూప్‌-1 పరీక్ష రాసిన వారికి తక్కువ మార్కులు వచ్చాయన్నది ప్రధాన ఆరోపణ. దీనికి కారణమేమిటో స్పష్టత ఇవ్వాలి. మెయిన్స్‌ మూల్యాంకనంలో అనుసరించే ప్రాతిపదిక, మార్కుల కేటాయింపు విధానంపై వివరణ ఇవ్వాలి’’ అని టీజీపీఎస్సీని ఆదేశించారు.

హైకోర్టు తీర్పు ఏంటంటే..

మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల లిస్ట్‌ను రద్దు చేసింది. అంతేకాకుండా పునఃమాల్యాంకనం చేయాలంటూ అధికారులకు ఆదేశించింది. సంజయ్ వర్సెస్ యూపీఏస్సీ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తూ తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. అంతేకాకుండా ఈ ప్రక్రియను ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో మెయిన్స్ పరీక్షలనే రద్దు చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. అంతేకాకుండా ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్‌లు ఇవ్వడంలో, కేంద్రాల కేటాయింపులో కూడా పాదర్శకత లోపించిందని సింగిల్ జడ్జి బెంచ్ తన తీర్పులో పేర్కొంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను, సమగ్రతను కొనసాగించలేదని, పక్షపాతంతో వ్యవహరించినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. కమిషన్‌ తన సొంత నియమ, నిబంధనలను సైతం ఉల్లంఘించిందని పేర్కొంది కోర్టు. మూల్యాంకనం కోసం చేసిన ప్రొఫెసర్ల ఎంపికలోనూ పారదర్శకత పాటించలేదని, ఫలితంగా తెలుగు మాధ్యమ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Tags:    

Similar News