Heavy Rain | భారీ వర్షంతో స్తంభించిన హైదరాబాద్..

పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్ జామ్. ఇబ్బందులు పడుతున్న ప్రజలు.;

Update: 2025-08-04 17:00 GMT

సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం దెబ్బకు హైదరాబాద్ స్తంభించింది. పలు ప్రాంతాల్లో భారీగా ట్రిఫిక్ జామ్ అయింది. గంటల తరబడి వేచిచూసినా మీటర్ల దూరం మాత్రమే ప్రయాణించే పరిస్థితి నెలకొని ఉంది. అనేక ప్రాంతాల్లో భారీ మొత్తంలో వర్షం నీరు నిలిచింది. ఈ పరిస్థితుల్లో ట్రిఫిక్ జామ్‌ను క్రమబద్ధీకరించడానికి పోలీసులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ప్రధాన కూడళ్లలో ఒకరికి నలుగురు పోలీసులు ఉండి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఖైరతాబాద్‌ వద్ద బుల్కాపూర్ నాలా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ ప్రాంతం జలమయమైంది. కార్లు, ద్విచక్ర వాహనాలు నీటమునిగాయి. అమీర్‌పేటలోని ఆదిత్య ట్రేడ్‌ సెంటర్‌ వద్ద భారీగా వరద చేరింది. ఈ నేపథ్యంలోనే నగర ప్రజలకు హైడ్రా అధికారులు కీలక సూచనలు చేశారు.

వరద ముప్పు ఉంటే ఫిర్యాదు చేయండి: రంగనాథ్

న‌గ‌రంలో సోమ‌వారం భారీ వ‌ర్షం కురిసింది. గంట వ్య‌వ‌ధిలో 7 నుంచి 8 సెంటీమీట‌ర్ల వ‌ర‌కూ వ‌ర్ష‌పాతం న‌మోదైంది. దీంతో ర‌హ‌దారులు, లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వ‌ర్షం ప‌డే అవ‌కాశాల‌ను రెండు గంట‌ల ముందుగానే గ్ర‌హించిన హైడ్రా క‌మిష‌న‌ర్ క్షేత్ర స్థాయిలో ఉండే అధికారుల‌ను, సిబ్బందిని అప్ర‌మ‌త్తం చేశారు. ప్ర‌జావాణి ఫిర్యాదుల‌ను ప‌రిశీలిస్తున్న స‌మ‌యంలోనే భారీ వ‌ర్షం కుర‌వ‌డంతో హైడ్రా క‌మిష‌న‌ర్ నేరుగా వ‌ర‌ద ముప్పు ఉన్న ప్రాంతాల‌కు వెళ్లారు. ల‌క‌డికాపూల్‌, ఖైర‌తాబాద్ త‌దిత‌ర ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. క్షేత్ర‌స్థాయిలో ఉన్న డీఆర్ ఎఫ్ సిబ్బందితో పాటు.. హైడ్రా మాన్సూన్ ఎమ‌ర్జ‌న్సీ బృందాల‌తో మాట్లాడి వ‌ర‌ద ముప్పు లేకుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను సూచించారు.

కొన్ని చోట్ల చెట్లు విరిగి ప‌డ‌గా.. సిబ్బంది వాటిని తొల‌గించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. మ‌రికోన్న చోట్ల వ‌ర‌ద‌కు చిక్క‌కున్న కార్ల‌ను ప‌క్క‌కు తొల‌గించి.. వాహ‌నాల రాక‌పోక‌ల‌కు ఇబ్బంది లేకుండా చేశారు. జూబ్లీహిల్స్‌, జీడిమెట్ల‌, ఉప్ప‌ల్ ఇలా అన్ని ప్రాంతాల్లో జీహెచ్ ఎంసీ, ట్రాఫిక్ పోలీసుల‌తో స‌మ‌న్వ‌యంగా ప‌ని చేసి ట్రాఫిక్ జామ్‌లు లేకుండా చూశారు. రోడ్డు అండ‌ర్ బ్రిడ్జిల వ‌ద్ద ఆటోమేటిక్ డీవాట‌ర్ పంపుల‌కు తోడుగా హైడ్రా నీటి పంపుల‌ను కూడా ఉంచి.. వ‌ర‌ద ముప్పు లేకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఎక్క‌డైనా వ‌ర‌ద ముప్పు ఉన్న‌ట్ల‌యితే రౌండ్‌ది క్లాక్ ప‌ని చేసే హైడ్రా కంట్రోల్ రూమ్ (9000113667)కి ఫిర్యాదు చేయాల‌ని సూచించారు.

కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు

రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షం కురవడంతో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ వర్చువల్‌గా సమావేశమయ్యారు. వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వరద నీటి ఉద్ధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారుల‌కు సీఎం సూచించారు. రానున్న రెండు మూడు రోజులు వ‌ర్షాలు ఉంటాయ‌నే స‌మాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు.

ఎక్కడ కూడా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాలు, వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కునేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు జిల్లాల్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఎప్పడికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. విప‌త్తు స‌హాయ‌క బృందాలు అందుబాటులో ఉండాల‌ని... త‌క్ష‌ణ‌మే స్పందించాల‌ని సీఎం ఆదేశించారు.

Tags:    

Similar News