హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం

రోడ్లపై ట్రాఫిక్ జాం, రాకపోకలకు అంతరాయం;

Update: 2025-08-13 07:31 GMT

హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, కెపిహెచ్ బి, జీడిమెట్ల, బోడుప్పల్‌, మేడిపల్లి, ఉప్పల్‌, రామాంతపూర్‌, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్‌, బహదూర్‌పురాలో భారీ వర్షం కురుస్తోంది . వర్షం కారణంగా రోడ్లపై ట్రాఫిక్ జాం అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికే.. హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమైంది. లోతట్టు ప్రాంత ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. కాగా, అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూకూడా సెలవులు పెట్టకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షంపై జరిగిన సమీక్షా సమావేశంలో చెప్పారు. హైడ్రాతో ఇరిగేషన్, పోలీసులు, ఫైర్ సేప్టీ, మున్సిపల్, హాస్పిటల్ తదితర అత్యవసర సేవలందించే సిబ్బంది సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ శాఖల్లో పని చేసే సిబ్బంది సెలవులు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదన్నారు.

ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్‌, 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది వాతావరణ శాఖ. మహబూబాబాద్‌, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్‌, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్‌, వరంగల్‌, కుమురం భీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది.

Tags:    

Similar News