హైడ్రా తీరుపై హైకోర్టు సీరియస్
స్టేటస్ కో ఉన్న భూముల జోలికి వెళితే కోర్టు ధిక్కరణ కేసులు;
చెరువుల పరిరక్షణ పేరిట స్టేటస్ కో ఉత్తర్వులు ఉల్లఘించిన హైడ్రా కమీషనర్ రంగనాథ్ పై హైకోర్టు అగ్రహం వ్యక్తం చేసింది. స్టేటస్ కో ఉత్తర్వులు ఉన్నప్పటికీ హైడ్రా కమిషనర్ అవేవీ పట్టించుకోకుండా దూకుడుగా వెళ్తే కోర్టు దిక్కరణ కేసు ఎదుర్కోవల్సి వస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది.
రంగారెడ్డి జిల్లా శేర్ లింగంపల్లి ఖానామెట్ సర్వే నెంబర్ 37, 38లో ఉన్న తన 1. 07 ఎకరాల భూమిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారని జూబ్లిహిల్స్ కు చెందిన పిటిషనర్ ఎస్ వెంకటేశ్వరరావు ఏప్రిల్ 21న హైకోర్టునాశ్రయించారు. తమ్మిడికుంట చెరువు ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ల పేరిట హైడ్రా కమిషనర్ తమ భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మరో ఇద్దరు కూడా హైకోర్టులో పిటిషన్లు వేశారు.
అదే రోజు హైకోర్టు ఈ భూములపై స్టేటస్ కో ఇచ్చింది. స్టేటస్ కోను పక్కన పెట్టి హైడ్రా తమ భూములను ఆక్రమించుకునే ప్రయత్నాలు చేసినట్టు పిటిషనర్లు రంగనాథ్ పై జూన్ 11న కోర్టు దిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున తరుణ్ జి. రెడ్డి వాదనలు వినిపించారు. తమ్మిడికుంట చెరువు ఎఫ్టిఎల్ , బఫర్ జోన్లు నిర్దారించకుండానే హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుందని, స్టేటస్ కో ఉత్తర్వులను ఉల్లంఘించినట్టు పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై అగ్రహం వ్యక్తం చేసింది. ‘‘బాధ్యతాయుత పదవిలో ఉన్న కమిషనర్ దూకుడుగా వ్యవహరించడం సరి కాదు’’ అని కోర్టు అభి ప్రాయపడింది. సామాన్య ప్రజలను హైడ్రా ఇబ్బందులకు గురి చేస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. స్టేటస్ కో లేని చెరువులు ఉన్న ప్రాంతాల్లో మునకపై పరిస్థితి ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. ‘‘ఎఫ్ టిఎల్, బఫర్ జోన్ల విషయంలో విధాన పర నిర్ణయాలు తీసుకున్నారా’’ అని న్యాయస్థానం రంగనాథ్ ని ప్రశ్నించింది. చెరువుల పరిరక్షణ పేరిట సామాన్య ప్రజలను అవస్థలకు గురి చేయడం సరి కాదని పేర్కొంది.
హైడ్రా వాహనాల రంగుపై ఆక్షేపణ
‘‘సరిహద్దుల్లో యుద్దానికి వెళుతున్నట్లు హైడ్రా వాహనాలు దూసుకెళ్తున్నాయి’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. హైడ్రా వాహనాలకు ఆ రంగేమిటి అని హైకోర్టు రంగనాథ్ ని నిలదీసింది. స్టేటస్ కో ఉన్న భూముల జోలికి వెళితే ఉరుకోబోమని, దిక్కరణకు పాల్పడిన వారిని కోర్టుకు పిలిపించి కఠిన శిక్షలు వేస్తామని హైకోర్టు రంగనాథ్ ను హెచ్చరించింది. అనంతం విచారణ సోమవారానికి వాయిదా పడింది.