హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహ నిమజ్జనంపై హైకోర్టు స్పష్టత

హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహ నిమజ్జనం పై ఏర్పడిన కన్ఫ్యూజన్ కి బ్రేక్ పడింది.

Update: 2024-09-10 14:05 GMT

హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహ నిమజ్జనం పై ఏర్పడిన కన్ఫ్యూజన్ కి బ్రేక్ పడింది. నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు స్పష్టతనిచ్చింది.హుస్సేన్ సాగర్ చుట్టూ వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధమని జీహెచ్ఎంసీ అధికారులు ఫ్లెక్స్ బ్యానర్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనం నిషేధిస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో కొన్ని వర్గాల నుంచి ఆందోళనలు వెల్లువెత్తాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "హుస్సేన్ సాగర్ లో కొత్తగా కలుషితం అయ్యేది ఏముంది.. ఇప్పటికే అది కలుషిత నీరు. ట్యాంక్ బాండ్ లో వద్దు అంటే మరి ఎక్కడ నిమజ్జనం చెయ్యాలో చెప్పండి అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. 

కాగా, పర్యావరణ సమస్యల దృష్ట్యా హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ (పీఓపీ)తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయరాదని హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. ఈ తీర్పును అమలు చేస్తూ జీహెచ్ఎంసీ అధికారులు హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనంపై నిషేధం విధించారు. అయితే వారు ఏర్పాటు చేసిన బ్యానర్లలో మట్టి విగ్రహాల నిమజ్జనానికి పర్మిషన్ ఉందా లేదా అనేది సూచించలేదు. దీంతో వివాదం చెలరేగింది. హిందూ సంఘాల నుంచి వ్యతిరేక స్వరం వినిపించింది. అయితే, గణేష్ విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో నేడు మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టులో లాయర్ వేణుమాధవ్ పిటిషన్ దాఖలు చేశారు. హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం చేయవద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్ తన పిటిషన్ లో కోరారు. అంతేకాదు, హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలని వేణుమాధవ్ కోరారు. ఈ పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ సందర్భంగా... హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాలు వద్దని, గతేడాది ఇచ్చిన తీర్పునే ఈసారి కొనసాగించాలని, హైడ్రాను కూడా ఇందులో ప్రతివాదిగా చేర్చాలని వాదనలు వినిపించారు. పూర్తి వాదనలు విన్న తర్వాత మట్టి, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు మాత్రమే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. పిఓపి విగ్రహాలను జిహెచ్ఎంసి ఏర్పాటు చేసిన పోర్టబుల్ చెరువుల్లోనే నిమజ్జనం చేయాలని  ఆదేశించింది. హైడ్రాను ప్రతివాదిగా చేర్చేందుకు నిరాకరించిన ధర్మాసనం... కోర్టు ధిక్కరణ పిటిషన్  ఇంత ఆలస్యంగా ఎందుకు వేశారని పిటిషనర్ ని ప్రశ్నించింది. విగ్రహాల నిమజ్జనం విషయంలో 2021లో ఇచ్చిన ఆదేశాలనే పాటించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలకు లైన్ క్లియర్ అయింది.

Tags:    

Similar News