పాతబస్తీలో ఉద్రిక్తత.. కూల్చివేతలను అడ్డుకున్న స్థానికులు

200 గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కట్టిన షాపులను హైడ్రా టీమ్ కూల్చివేసింది.;

Update: 2025-05-08 08:52 GMT

అక్రమ నిర్మాణాలు కనిపించడం ఆలస్యం హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. హైడ్రా ఏర్పడిన తర్వాత అధికారులు పాతబస్తీవైపు పెద్దగా చూడలేదు. కానీ గురువారం తెల్లవారుజామున చంద్రాయణగుట్ట నియోజగవర్గంలోని అక్బర్ నగర్‌లో భారీ కూల్చివేతలు చేపట్టింది. బండ్లగూడ మండలం పరిధిలో దాదాపు 200 గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కట్టిన షాపులను హైడ్రా టీమ్ కూల్చివేసింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త నెలకొంది. భారీబందోబస్త మధ్య జరుగుతున్న కూల్చివేత పనులను అడ్డుకునేందకు స్థానికులు ప్రయత్నించారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జేసీబీలను ఎక్కి కూల్చివేతలను ఆరోపించారు.

హైడ్రా చర్యలను ఎంఐఎం కార్పొరేటర్లు, మహిళా నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘హైడ్రా రంగనాథ్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. మరికొందరు రంగనాథ్‌పై అవినీతి ఆరోపణలు కూడా చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వచ్చి.. పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు, స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. అయితే పాతబస్తీలో హైడ్రా కూల్చివేతలు చేపట్టడాన్ని కొందరు సమర్థిస్తున్నారు. అక్రమ కట్టడం ఎక్కడున్నా కూల్చివేయాలని అంటున్నారు.

పాతబస్తీలోకి హైడ్రా అడుగు పెట్టడానికి కారణం ఇదే

బండ్ల‌గూడ మండ‌లం కందిక‌ల్ విలేజీలోని ప్ర‌భుత్వ స్థ‌లంలో ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా తొల‌గించింది. 303, 306 స‌ర్వే నంబ‌ర్ల‌లో ఉన్న 2500 గ‌జాల ప్ర‌భుత్వ స్థ‌లాన్నిహైడ్రా స్వాధీనం చేసుకుంది. వాస్త‌వానికి ఈ స్థ‌లం యూఎల్‌సీ ల్యాండ్ కాగా.. స‌య్య‌ద్ బ‌షీరుద్దీన్‌, స‌య్య‌ద్ అమీదుల్లా హుస్సేన్ క‌బ్జా చేశారు. అర్బ‌న్ ల్యాండ్ సీలింగ్ కింద ఉన్న భూమిని త‌న పేరుమీద రెగ్యుల‌రైజ్ చేసుకునేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌క‌పోయినా.. అందులో అనుమ‌తులు లేకుండా.. షెడ్డులు, రూంలు నిర్మించారు. ఈ మేరకు ప్ర‌భుత్వ భూమి క‌బ్జా జ‌రుగుతోంద‌ని.. కాపాడాల‌ని స్థానికుల నుంచి ప్ర‌జావాణికి ఫిర్యాదు అంద‌డంతో హైడ్రా అధికారులు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. సంబ‌ధిత అధికారుల నివేదిక ఆధారంగా ప్ర‌భుత్వ భూమి అని నిర్ధారించుకున్నారు. హైకోర్టు కూడా ఈ అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను తొల‌గించాల‌ని 2 నెల‌ల క్రితం స్ప‌ష్ట‌మైన ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు అక్క‌డ నిర్మించిన ఆర్‌సీసీ రూములు 4, రేకుల షెడ్డులు, షాపులు 4 వ‌ర‌కూ కూల్చివేసి.. ప్ర‌భుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలో స్థానిక రాజ‌కీయ నాయ‌కులు, క‌బ్జా చేసిన వారికి చెందిన వారు కూల్చివేత‌ల‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా స్థానిక పోలీసుల స‌హ‌కారంతో వారిని లిఫ్ట్ చేసి కూల్చివేత‌లను హైడ్రా కొన‌సాగించింది. ప్ర‌భుత్వ భూమిని కాపాడ‌గ‌లిగామంటూ స్థానికులు సంతోషం వ్య‌క్తం చేశారు. హైడ్రాకు ఫిర్యాదు చేయగానే క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆక్రమణల తొలగింపును చేపట్టిన హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు. 

Tags:    

Similar News