‘తెలంగాణ వ్యవసాయ కమిషన్ రైతు నేస్తమని నిరూపించుకోవాలి‘

కమిషన్ రైతుకు, సేద్యానికి అండగా ఉండాలంటే ఏమి చేయాలో ‘రైతు స్వరాజ్య వేదిక’ నేత కన్నెగంటి రవి ప్రతిపాదిస్తున్న 11 సూత్రాలు

Update: 2024-11-05 02:52 GMT

2023 అసెంబ్లీ ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ ను జీవో నంబర్ 36 తో ఏర్పాటు చేసింది. మానిఫెస్టో లో హామీ ఇచ్చిన విధంగా ఇది చట్టబద్ధ అధికారాలు కలిగిన కమిషన్ గా లేనప్పటికీ సుదీర్ఘ కాలం రైతు ఉద్యమాలలో భాగస్వామిగా, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులుగా, జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్న ఎం . కోదండ రెడ్డి గారు ఛైర్మన్ గా, భూ చట్టాల నిపుణులు సునీల్ తో సహా మరో 6 గురు సభ్యులుగా ఈ కమిషన్ ఏర్పాటైంది. కమిషన్ మొదటి సమావేశం నవంబర్ 2 న ఉదయం రాష్ట్ర సెక్రటేరియట్ కు దగ్గరలో ఉన్న బూర్గుల రామకృష్ణా రావు భవన్ మొదటి అంతస్థులో నెలకొల్పిన కమిషన్ కార్యాలయంలో జరిగింది.

కమిషన్ ఆహ్వానం మేరకు వివిధ రైతు సంఘాల ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ కు రైతు స్వరాజ్య వేదిక , తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన మెమోరాండం ఇది. రాష్ట్ర వ్యవసాయ రంగంలో కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాలని, రైతు సమస్యల పరిష్కారానికి కమిషన్ నిరంతరం పని చేయాలని, రైతు ఆత్మహత్యలు ఆగిపోయే విధంగా కమిషన్ తగిన సిఫారసులు ప్రభుత్వానికి చేయాలని రైతు స్వరాజ్య వేదిక కోరింది.

శ్రీయుత గౌరవనీయులైన,
ఎం. కోదండ రెడ్డి , ఛైర్మన్ ,
తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్
హైదరాబాద్ గారికి –
తెలంగాణ రాష్ట్ర మొదటి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మీకు అభినందనలు,శుభాకాంక్షలు తెలియ చేస్తున్నాము . కమిషన్ లో ఇతర సభ్యులకు , కమిషన్ సిబ్బందికి కూడా అభినందనలు తెలియ చేస్తున్నాము . రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, జాతీయ ఉపాధ్యక్షులుగా పని చేసిన మీరు, ఇతర రైతు సంఘాలను కలుపుకుని వెళుతూ, రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తూ వచ్చారు. కమిషన్ ఛైర్మన్ గా అదే స్పూర్తితో, మీ దృష్టికి వచ్చిన వ్యవసాయ , రైతు సమస్యలపై మీరు స్పందించి , రైతుల పక్షాన ప్రభుత్వానికి తగిన సిఫారసులు చేస్తారని, పరిష్కారాలు సాధిస్తారని ఆశిస్తున్నాము.
2014 జూన్ 2 నుండీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా ఉనికిలోకి వచ్చినప్పటికీ, మొదటి పదేళ్ళ కాలం గత ప్రభుత్వాల కాలంలో రాష్ట్ర వ్యవసాయ రంగంలో సానుకూల అడుగులు పడలేదు. సమగ్ర వ్యవసాయ విధానమే రూపొందలేదు. రైతులతో, రైతు సంఘాలతో, రైతు సహకార సంఘాలతో ఏ మాత్రం చర్చించకుండా, అప్పటి ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ పోయింది. ఫలితంగా 1995 లో మొదలైన వ్యవసాయ సంక్షోభం గత పదేళ్ళ పాటూ కొనసాగుతూ వచ్చింది. రైతుల ఆత్మహత్యలు కూడా కొనసాగుతూ వచ్చాయి.
ఈ కారణం చేతనే గ్రామీణ తెలంగాణ ప్రజలు, గత ప్రభుత్వాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఓడించి, ,ప్రస్తుత ప్రభుత్వానికి పట్టం కట్టారు . ఈ ప్రభుత్వం కూడా అభయ హస్తం పేరుతో ఇచ్చిన ఎన్నికల మానిఫెస్టో లో వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి సంబంధించి అనేక హామీలు ఇచ్చింది. రైతులు వాటిని విశ్వసించారు.
ఈ కమిషన్ ఏర్పాటు కూడా ఆ మానిఫెస్టో లో భాగంగానే ఉనికి లోకి వచ్చిందని కమిషన్ సభ్యులు నిరంతరం గుర్తుంచుకోవాలి. కమిషన్ ఏర్పాటుకు సంబంధించి జీవో వెలువడినప్పటి నుండీ కమిషన్ మొదటి సమావేశం కోసం మేము ఎదురు చూస్తున్నాము. ఈ మొదటి సమావేశం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాము.
కమిషన్ రోజువారీ పనితీరుకు సంబంధించి మా సూచనలు :
1. క్రమం తప్పకుండా కనీసం నెలకు ఒకసారి కమిషన్ పూర్తి స్థాయి సమావేశం నిర్వహించాలి. రైతులు, రైతు సంఘాలు , రైతు సహకార సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల ప్రజల సహకార సంఘాలు ఇచ్చే విజ్ఞప్తులను లోతుగా చర్చించి, కమిషన్ ప్రభుత్వానికి తగిన సిఫారసులు చేయాలి.
2. వ్యవసాయ , రైతు కమిషన్ సభ్యులు ఎవరో ఒకరు తప్పకుండా కమిషన్ కార్యాలయంలో ప్రతి రోజూ అందుబాటులో ఉండి , రాష్ట్రం నలు మూలల నుండీ కమిషన్ కార్యాలయానికి వచ్చే రైతులతో, రైతు ప్రతినిధులతో చర్చించి, వారు ఇచ్చే విజ్ఞాపనలను తీసుకోవాలి. తీసుకునే దరఖాస్తులకు, మెమోరాండం ముట్టినట్లుగా కమిషన్ కార్యాలయం నుండీ స్టాంప్ వేసి ఇవ్వాలి.
3. వ్యవసాయ, రైతు కమిషన్ కు అనుబంధంగా ఉండే నిపుణులకు, తగిన పని బాధ్యతలను అప్పగించి, వ్యవసాయ, అనుబంధ రంగాల సమస్యలు, వస్తున్న తాజా పరిణామాలపై అధ్యయనం చేయించాలి. కమిషన్ ఆ అధ్యయన నివేదికలను చర్చించి, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తగిన సిఫారసులు చేయాలి.
4. వ్యవసాయ, రైతు కమిషన్ ఎప్పుడూ హైదరాబాద్ లోనే సమావేశాలు నిర్వహించకుండా, జిల్లాలలో కూడా సమావేశాలు నిర్వహించాలి. అక్కడ స్థానికంగా రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల వారు ఇచ్చే దరఖాస్తులను తీసుకుని పరిష్కరించాలి.
5. కమిషన్ క్రమం తప్పకుండా , కనీసం రెండు నెలలకు ఒకసారి రైతు , వ్యవసాయ కూలీ సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి. ఆయా సంఘాలు లేవనెత్తే అంశాలను కమిషన్ సీరియస్ గా చర్చించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలి.
6. కమిషన్ , రాష్ట్రంలో పంటల వారీగా కూడా రైతులతో, రైతు సంఘాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, వారి ప్రత్యేక సమస్యలు చర్చించాలి. వాటి పరిష్కారానికి తగిన సిఫారసులు చేయాలి.
కమిషన్ 2024 నవంబర్ నెలలో దృష్టి సారించాల్సిన అంశాలు :
1. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మానిఫెస్టో లో హామీ ఇచ్చిన విధంగా రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర వ్యవసాయ విధానం తయారీకి కనీసం ముగ్గురు సభ్యులతో ఒక సబ్ కమిటీని వేయాలి. సమగ్ర వ్యవసాయ విధానం డ్రాఫ్ట్ డిసెంబర్ 31 లోపు తయారయ్యే విధంగా కాల పరిమితి విధించాలి. రైతు, వ్యవసాయ కూలీ సంఘాల నుండీ , రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి దారుల కంపెనీలు, వ్యవసాయ అనుబంధ రంగాల సహకార సంఘాల నుండీ కూడా సూచనలను ఆహ్వానించాలి.
వ్యవసాయ శాఖ, వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక విశ్వ విద్యాలయాల నుండీ కూడా తగిన సూచనలను ఆహ్వానించాలి.
2. 2025 మార్చ్ నాటికి పూర్తి నివేదిక తయారయ్యేలా శాస్త్రీయ పంటల ప్రణాళిక తయారీకి కూడా ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ ప్రణాళికను 2025 ఖరీఫ్ సీజన్ నుండీ అమలు చేయడానికి పూనుకోవాలి. రైతు, వ్యవసాయ కూలీ సంఘాల నుండీ , రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి దారుల కంపెనీలు, వ్యవసాయ అనుబంధ రంగాల సహకార సంఘాల నుండీ కూడా సూచనలను ఆహ్వానించాలి.
3. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా మార్గదర్శకాల కోసం అన్ని జిల్లాలలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. ఈ నేపధ్యంలో అన్ని జిల్లాలలో వాస్తవ సాగుదారులకు/ కౌలు రైతులకు రైతు భరోసా సహాయం అందించాలని ఎక్కువ మంది కోరారు. రైతు కమిషన్ కూడా ఈ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించి, 2011 భూ అధీకృత సాగుదారుల చట్టం ప్రకారం కౌలు రైతులను తక్షణమే గుర్తించి, ఈ సీజన్ లో రైతు భరోసా సహాయం అందించేలా ప్రభుత్వానికి సిఫారసు చేయాలి.
4. 2024 ఖరీఫ్ నుండీ పంటల బీమా పథకం అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, అమలు కాలేదు. పంటల బీమా పథకం అమలుపై కమిషన్ రైతు సంఘాలతో, బీమా రంగ నిపుణులతో తక్షణ సమావేశం జరిపి, పంటల బీమా పథకాన్ని అమలు లోకి తెచ్చే విధంగా సిఫారసు చేయాలి.
5. 2024 ఖరీఫ్ లో పంటలు నష్టపోయన కౌలు రైతులతో సహా , రైతులందరికీ బీమా పరిహారం అందించేలా సిఫారసు చేయాలి. 2024 ఖరీఫ్ లో 76,000 ఎకరాలలో పంటలు నష్ట పోయిన భూ యజమానులకు ఎకరానికి 10,000 చొప్పున పరిహారం అందించారు. కానీ ఆయా జిల్లాలలో ఒక్క కౌలు రైతుకు కూడా ఈ పరిహారం అందలేదని కమిషన్ గుర్తించి, వారికి కూడా సహకారం అందించేలా ప్రభుత్వానికి సిఫారసు చేయాలి.
6. రైతు బీమా పథకాన్ని భూమి లేని కవులు రైతులకు, వ్యవసాయ కూలీలకు కూడా విస్తరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మానిఫెస్టో లో హామీ ఇచ్చింది. కానీ ఈ సంవత్సరం ఆగస్ట్ 15 నుండీ మొదలైన రైతు బీమా సంవత్సరానికి , కేవలం భూమి యజమానులకు మాత్రమే ప్రీమియం కట్టారు. హామీ ఇచ్చిన విధంగా, భూమి లేని కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు రైతు బీమా పీమియం చెల్లించలేదు. ఈ విషయంలో కమిషన్ చర్చించి, కనీసం డిసెంబర్ 7 నుండీ ( ప్రభుత్వానికి ఏడాది నిండుతుంది) ప్రభుత్వం ఈ హామీ అమలు చేసే విధంగా సిఫారసు చేయాలి.
7. తెలంగాణ రాష్ట్రంలో బియ్యం , నూకలు, మొక్కజొన్న, జొన్న ఆధారిత 30 ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ఈ పరిశ్రమల వల్ల రైతులకు నేరుగా ఏ లాభం లేకపోగా , అవి వెదజల్లే వాయు కాలుష్యం లో విడుదలయ్యే రసాయనాలు కాన్సర్ కారకాలని అనేక నివేదికలు వచ్చాయి. ఇప్పటికీ నారాయణ పేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరులో ఇథనాల్ ఉత్పత్తి ప్రారంభించిన చోట స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గత దశాబ్ధ కాలంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్ల పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఇథనాల్ పరిశ్రమతో కూడా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిత్తనూరు ప్రజల అనుభవాలను చూసి వచ్చిన నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండల ప్రజలు తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చూస్తున్న ఇథనాల్ పరిశ్రమను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
అక్టోబర్ 18 న ఈ పరిశ్రమకు వ్యతిరేకంగా 5,000 మందితో బహిరంగ సభ జరిపి, తమ నిరసన వ్యక్తం చేశారు. గత 100 రోజులుగా రెండు గ్రామాల ప్రజలు దీక్షలు చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో వ్యవసాయ, రైతు కమిషన్ ఈ అంశాలను ఈ నవంబర్ నెల సమావేశంలో చర్చించి, వెంటనే చిత్తనూరు ,పర్ల పల్లి గ్రామాలను సందర్శించి, వాస్తవాలను అధ్యయనం చేయాలని, ఆందోళన చేస్తున్న దిలావర్ పూర్ ప్రజల గొంతు కూడా వినాలని, ఇథనాల్ పరిశ్రమ మంచి చెడులపై రైతు సంఘాలతో, నిపుణులతో, శాస్త్రవేత్తలతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి చర్చించాలని, క్షేత్ర పర్యటనలు, ఈ సమావేశాల ఆధారంగా ప్రభుత్వానికి తగిన సిఫారసులు చేయాలి.
8. తెలంగాణ రాష్ట్రంలో 2014 నుండీ 2024 వరకూ 7000 మందికి పైగా రైతుల ఆత్మహత్యలు జరిగాయి. వీరిలో కొందరు బాధిత కుటుంబాలకు రైతు బీమా పథకం క్రింద 5 లక్షల రూపాయల సహాయం అందింది. కానీ రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు జీవో 194 క్రింద అందవలసిన పరిహారం 2018 నుండీ పూర్తిగా ఆగిపోయింది. 2014- 2018 మధ్య కాలంలో కూడా ఇంకా అనేక వందల మందికి ఈ జీవో క్రింద పరిహారం అందలేదు. కమిషన్ ఈ అంశాన్ని కూడా ఈ నవంబర్ నెల సమావేశంలో చర్చించి, సమస్య పరిష్కారానికి తగిన సిఫారసులు చేయాలి.
9. రాష్ట్ర వ్యవసాయ శాఖలో పని చేస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులు , తాము చేయాల్సిన పనికి భిన్నంగా, తాము గ్రామాలలో క్లరికల్ పనులు చేయాల్సి వస్తున్నదని , ఫలితంగా రైతులకు అందాల్సిన నిజమైన విస్తరణ సేవలు అందడం లేదని ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా భూముల డిజిటల్ సర్వే కూడా తమనే చేయమని ఆదేశించడాన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు . ఇతర రాష్ట్రాలలో ఈ పనికి వేరే సిబ్బందిని నియమించారని, కానీ తెలంగాణ లో వ్యవసాయ విస్తరణ అధికారులతో చేయిస్తున్నారని వాళ్ళ ఆరోపణ. ఈ విషయం పై వాళ్ళు దీక్షలు, ధర్నాలు చేస్తున్నారు.
ఈ విషయంలో కమిషన్ , వ్యవసాయ విస్తరణ సిబ్బందితో , వారి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలి. సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వానికి సిఫారసు చేయాలి.
10. రాష్ట్రంలో ఆదివాసీ ప్రాంతాల రైతులు, ప్రజలు ఎదుర్కుంటున్న ప్రత్యేక సమస్యలపై కమిషన్ దృష్టి సారించాలి. ఆదివాసీ ప్రాంతాల్లో కేవలం పోడు పట్టాలు మంజూరు చేయడమే కాకుండా, అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం వారికి మొత్తం అటవీ నవనరులపై సాముదాయక హక్కులు కల్పించేలా, ప్రభుత్వానికి కమిషన్ సిఫారసులు చేయాలి. కలపేతర అటవీ ఉత్పత్తులకు కూడా కనీస మద్ధతు ధరలు లభించేలా కమిషన్ ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
11. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న గ్రామీణ మహిళలకు రైతులుగా గుర్తించి గుర్తింపు పత్రాలు ఇవ్వాలి. 2024 నవంబర్ నెల కమిషన్ ఎజెండా లో పెట్టుకున్నట్లుగా , రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చేటప్పుడు, కౌలు రైతులను, మహిళా రైతులను కూడా రైతులుగా గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఈ మేరకు మహిళా రైతుల తో పని చేస్తున్న సంఘాలతో, స్వచ్చంధ సంస్థలతో కూడా కమిషన్ చర్చించాలి.
12. మేము ఈ మెమోరాండం లో పేర్కొన్న అంశాలపై కమిషన్ చర్చించి, తగు నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిస్తున్నాము. మేము తెలంగాణ రాష్ట్ర గ్రామీణ వ్యవసాయ కుటుంబాల సంక్షేమం కోసం రెగ్యులర్ గా కమిషన్ తో కలసి పని చేస్తామని, కమిషన్ పనిని మెరుగు పరచడానికి మా వంతు కృషి చేస్తామని హామీ ఇస్తున్నాము . కమిషన్ పని తీరు స్వతంత్రంగా ఉండాలని, కమిషన్ సిఫారసులు ప్రభుత్వం తప్పకుండా అమలు చేసేలా, కమిషన్ తగు శ్రద్ధ వహించాలని మేము కోరుకుంటున్నాము.


Tags:    

Similar News