నాగోల్ లో విషాదం చోటు చేసుకుంది. మెడలో తాళికట్టిన భర్తే ఏడాది తిరగక ముందే అదే మెడను కత్తితో కోసాడు. చికిత్స పొందుతున్న భార్య పరిస్థితి విషమంగా ఉంది.
అదనపు కట్నం కోసం భార్య మహలక్ష్మి(20)ని పెళ్లయినప్పటి నుంచి వేధిస్తున్న భర్త వేణుగోపాల్ కు పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నిత్యం తాగివచ్చి భార్యను చితకబాదేవాడని శనివారం అర్దరాత్రి కూడా భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగినట్టు స్థానికులు తెలిపారు. పెద్ద పెద్ద అరుపులు వినిపించాయన్నారు. మహలక్ష్మి మెడను కర్కశంగా చాకుతో కోశాడు భర్త. తీవ్ర రక్త స్రావం అవుతుండగా స్థానికులు, కుటుంబసభ్యులు ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నారు. ప్రస్తుతం మహలక్ష్మి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.