హైదరాబాద్ విమానాశ్రయానికి హ్యాట్రిక్ అవార్డు, ఎందుకు వచ్చిందంటే...

రాజీవ్ గాంధీ విమానాశ్రయం ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ ఉత్తమ విమానాశ్రయంగా మూడోసారి నిలిచింది. ఆర్‌జిఐఏకు దక్కిన ఈ అవార్డుతో వార్తల్లోకి ఎక్కింది.

Update: 2024-08-20 11:55 GMT

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జిఐఎ) వరుసగా మూడోసారి ఇండియా ట్రావెల్ అవార్డ్స్‌ లభించింది. ఈ అవార్డు పొందడంతో మరోసారి ఉత్తమ విమానాశ్రయంగా ప్రతిష్ఠాత్మకమైన టైటిల్‌ను కైవసం చేసుకుంది.

- ఉత్తమ విమానాశ్రయం అనే ప్రతిష్ఠాత్మక బిరుదును పొందడం ద్వారా ఆర్జీఐఏ అద్భుతమైన మైలురాయిని సాధించింది.ఈ ఘనత హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ కస్టమర్ సర్వీస్, నిర్వహణ సామర్థ్యం వల్ల దక్కింది.
- హైదరాబాద్ విమానాశ్రయం గత సంవత్సరం ఏప్రిల్ 17వతేదీన స్కైట్రాక్స్ ‘బెస్ట్ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఆసియా 2024’ అవార్డును గెలుచుకుంది.
- జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లోని ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్‌పో 2024లో ఈ విమానాశ్రయం దక్షిణాసియా, భారతదేశంలోని అన్ని ఇతర విమానాశ్రయాల్లో అగ్రస్థానంలో నిలిచినందుకు ఈ గుర్తింపు పొందింది.

దేశంలోనే రెండోస్థానం
హైదరాబాద్ విమానాశ్రయం దేశీయ,అంతర్జాతీయ టెర్మినళ్ల నుంచి నుంచి రాకపోకలు సాగించిన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక్క డిసెంబర్‌ నెలలోనే 22.51 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించి రికార్డు నెలకొల్పారు.దేశంలోని మిగతా అంతర్జాతీయ విమానాశ్రయాలతో పోలిస్తే శంషాబాద్‌ ఆర్జీఐఏ రెండోస్థానంలో నిలిచింది.

ఆర్జీఐఏ రికార్డు
అత్యధిక ప్రయాణికులు రాకపోకలు సాగించడంతో ఆర్జీఐఏకు రికార్డు దక్కింది. ప్రయాణికులకు కావాల్సిన సౌకర్యాల వల్ల కూడా ఈ విమానాశ్రయం బెస్ట్ గా నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1.8 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు.ఈ ఏడాది ఈ విమానాశ్రయం నుంచి 2.10 కోట్ల మంది ప్రయాణం సాగించారు.తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఒకటే విమానాశ్రయం ఉండటంతోపాటు ఇది అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్న విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది.

హ్యాట్రిక్ విజయం
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మూడుసార్లు ట్రావెల్ అవార్డులు గెలుచుకొని హ్యాట్రిక్ సాధించిందని ఆర్జీఐఏ మంగళవారం ట్వీట్ చేసింది. ఉద్యోగులు, ప్రయాణికుల మద్ధతుతో మేం అవార్డు సాధించామని ఆర్జీఐఏ తెలిపింది. ‘‘దేశీయంగా లేదా అంతర్జాతీయంగా మీ ప్రయాణాన్ని మెరుగుపర్చడమే మా లక్ష్యం’’ అని ఆర్జీఐఏ పేర్కొంది. ‘‘ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరి మద్దతుకు మేం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం,భవిష్యత్ లో మరెన్నో మైలురాళ్లు సాధిస్తామని’’ ట్వీట్ లో తెలిపింది.

Tags:    

Similar News