సెక్స్ హబ్‌గా హైదరాబాద్,విదేశీ వనితలతో జోరుగా సాగుతున్న వ్యభిచారం

హైదరాబాద్ నగరం ఐటీతోపాటు అంతర్జాతీయ సెక్స్ హబ్‌గా మారింది. నగరంలో విదేశాలకు చెందిన అమ్మాయిలతో నిర్వహిస్తున్న వ్యభిచార రాకెట్‌ల గుట్టును పోలీసులు రట్టు చేశారు.;

Update: 2025-03-17 09:46 GMT

హైదరాబాద్ నగరం ఐటీ,ఏఐ,ఎలక్ట్రానిక్, గ్లోబల్ లైఫ్ సైన్సెస్,బయోటెక్, ఫార్మా, వ్యాక్సిన్, రీసెర్చ్,హెల్త్, గ్లోబల్ హబ్‌గా మాత్రమే కాదు విదేశీ వనితలతో సెక్స్ హబ్‌గా కూడా మారింది. నగరంలో బంగ్లాదేశ్, బర్మా, థాయిలాండ్,ఉబ్జెకిస్థాన్, నేపాల్, రష్యా దేశాలకు చెందిన అమ్మాయిలతో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ లు నిర్వహిస్తున్నారు.

- ఈ ఏడాది ఫిబ్రవరి 26 : హైదరాబాద్‌లోని కమిషనర్ టాస్క్ ఫోర్స్,సౌత్ జోన్ బృందం,చాదర్‌ఘాట్, ఖైరతాబాద్ పోలీసులతో కలిసి చాదర్‌ఘాట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో నడుస్తున్న విదేశీ వనితల వ్యభిచార గృహాలపై ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో వివిధ దేశాలకు చెందిన 18 మంది అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన యువతులు దొంగచాటుగా పశ్చిమబెంగాల్ వద్ద సరిహద్దులు దాటి హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ వ్యభిచారం చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ అంతర్జాతీయ సెక్స్ రాకెట్ వెనుక బడా ముఠా హస్తం ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వ్యభిచార గృహాల్లో ఇద్దరు విదేశీ మైనర్ బాలికలు కూడా ఉన్నారు. వీరిపై పిటా యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
- సైబరాబాద్‌లో 14,190 మంది విదేశీ, స్వదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఆన్‌లైన్ సెక్స్‌రాకెట్‌ గుట్టును యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు ఛేదించారు. విదేశాల నుంచి అక్రమంగా తరలించి వారితో వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది.

బంగ్లాదేశ్ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో...
హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్, సౌత్ జోన్ బృందం దర్యాప్తులో పలు విస్తు పోయే విషయాలు వెలుగుచూశాయి. సంక్షోభంలో ఉన్న బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలను హైదరాబాద్ లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి ఆశ చూపించి ఇక్కడకు తీసుకువచ్చి వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నారని తేలింది. వ్యభిచారం రొంపిలో దిగిన బంగ్లా అమ్మాయిలు డబ్బును హవాలా మార్గాల్లో తమ దేశంలోని తల్లిదండ్రులకు పంపిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. హైదరాబాద్ నగరంతోపాటు బెంగళూరులోనూ వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నారని తేలింది. తమ దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నందున అమాయక బాలికలను లక్ష్యంగా చేసుకుని వారిని హైదరాబాద్ కు తరలించి సెక్స్ రాకెట్ నడుపుతున్నారు. పశ్చిమ బెంగాల్ నివాస చిరునామాలతో బంగ్లాదేశ్ అమ్మాయిలకు భారతీయ గుర్తింపు పత్రాలను అందించి వారిని వృత్తిలోకి దించారని సమాచారం.



 పదహారేళ్లుగా సెక్స్ రాకెట్

హైదరాబాద్‌లో 16 సంవత్సరాలుగా నడుస్తున్న సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. వ్యభిచార గృహాల్లో విటులకు ఒళ్లు అమ్ముకుంటూ దుర్భర జీవనం సాగిస్తున్న 14,190 మంది మహిళలను పోలీసులు రక్షించారు. ఈ కేసుకు సంబంధించి 17 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.వ్యభిచారంలో మగ్గుతున్న బాధిత మహిళలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అస్సాం, బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, ఉజ్బెకిస్తాన్, రష్యా మొదలైన ప్రాంతాలకు చెందినవారని పోలీసు అధికారులు తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు ఇతర ప్రదేశాలలో సైబరాబాద్ పోలీసు యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ నిర్వహించిన బహుళ దాడుల్లో నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు వివరించారు. గచ్చిబౌలి, హిమాయత్ నగర్, కూకట్ పల్లి, మాదాపూర్ కేంద్రాలుగా సెక్స్ రాకెట్ వ్యభిచార గృహాలు నిర్వహించిందని పోలీసులకు సమాచారం అందింది.

వ్యవస్థీకృత సెక్స్ రాకెట్
పోలీసు విచారణ సమయంలో నిందితులు తాము వ్యవస్థీకృత సెక్స్ రాకెట్ నడుపుతున్నామని వెల్లడించారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను హైదరాబాద్ కు తీసుకువచ్చారని పోలీసు అధికారులు తెలిపారు. విటుల కోసం సెక్స్ రాకెట్ నిర్వాహకులు వెబ్‌సైట్‌లలో ప్రకటనలు పోస్ట్ చేశారు. కాల్ సెంటర్లు, వాట్సాప్ ద్వారా కస్టమర్లను సంప్రదించేవారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు విలాసవంతమైన జీవనశైలి, సులభంగా డబ్బు సంపాదనకు సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని తేలింది. కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బాధిత యువతులను వ్యభిచారంలోకి లాగారని ఓ పోలీసు అధికారి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

హైదరాబాద్ లో సెక్స్ రాకెట్లకు పెరిగిన ఆదరణ
హైదరాబాద్ నగరంలో విదేశీ వనితలతో ఏర్పాటైన సెక్స్ రాకెట్లకు డిమాండ్ పెరిగింది. హైదరాబాదీలు విదేశీ వనితలను ఇష్టపడుతూ, వారి నుంచి పడకగది సుఖం పొందాలని కోరుకుంటున్నారని, దీంతో దీనికి డిమాండు ఏర్పడటంతో వ్యభిచార గృహాల సంఖ్య పెరిగాయని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. విదేశీ అమ్మాయిలు తెల్లగా ఉండటంతో విటులు విదేశీ వనితలో లైంగిక ఆనందం కోసం పోటీ పడుతున్నారని తేలింది. దీంతో బంగ్లాదేశ్, బర్మా, థాయిలాండ్,ఉబ్జెకిస్థాన్, నేపాల్, రష్యా దేశాలకు చెందిన అమ్మాయిలi వచ్చి వ్యభిచారం సాగిస్తున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో గుట్టుగా వ్యభిచార దందా సాగుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని సెంట్రల్ జోన్ పోలీసు అధికారి ఒకరు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ఎవరి వాటా ఎంతంటే...
సెక్స్ రాకెట్ నిర్వాహకులే 70 శాతం తీసుకొని ఒళ్లు అమ్ముకుంటున్న బాధిత మహిళలకు కేవలం 30 శాతం మాత్రమే ఇస్తున్నారు.వ్యభిచార గృహాల్లో విటుల నుంచి వసూలు చేసిన డబ్బులో 30 శాతం మాత్రమే బాధిత అమ్మాయిలకు ఇస్తున్నారని,మిగతా 35 శాతం ప్రకటనదారులకు,కాల్ సెంటర్ వ్యక్తులకు కమిషన్ కింద ఇస్తున్నారు.మరో 35 శాతం డబ్బు సెక్స్ రాకెట్ నిర్వాహకులకు వెళుతుంది.

హనీ ట్రాప్ వలలో బ్యాంకు ఉద్యోగి
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి ఫిర్యాదు తర్వాత సెక్స్ రాకెట్ బాగోతం బయటపడింది. తాను మసాజ్ కోసం పార్లర్ కు వెళ్లానని బ్యాంకు ఉద్యోగి పోలీసులకు చెప్పాడు.అక్కడ బ్యాంకు ఉద్యోగి ఒక అమ్మాయిని శారీరకంగా కలిశాడు.బ్యాంకు ఉద్యోగి మహిళతో కలిసి ఉన్న సన్నిహిత క్షణాలను వీడియో చేసి అతన్ని బ్లాక్ మెయిల్ చేశారు. బ్యాంకు ఉద్యోగి ఫిర్యాదు మేర పోలీసులు 15 మందిని అరెస్టు చేశారు.మసాజ్ పార్లర్ యజమాని అయిన మహిళను కూడా అరెస్టు చేశారు.ఆ మహిళ బ్యాంకు ఉద్యోగిని హనీ ట్రాప్‌లో బంధించిందని పోలీసుల దర్యాప్తులో తేలింది.

పోలీసుల దాడుల్లో బయటపడ్డ సెక్స్ రాకెట్
సోమాజిగూడలో నిర్వహిస్తున్న వ్యభిచార ముఠా బాగోతాన్ని పోలీసులు రైడ్ చేసి పట్టుకుంటే పలు వాస్తవాలు వెలుగు చూశాయి. వ్యభిచార గృహాల నిర్వాహకుల వాట్సాప్ గ్రూపులు, కాంటాక్టులను పరిశీలించగా దేశంలోని ఇతర నగరాల్లోనూ అమ్మాయిలను సరఫరా చేసే ముఠా బాగోతం బయటపడింది. ఈ ముఠా వ్యభిచారంతో పాటు విటులకు డ్రగ్స్ కూడా సప్లయి చేస్తున్నారని తేలింది. అమ్మాయిలకు ఉద్యోగాల ఆశ చూపించి వారిని నగరానికి తీసుకువచ్చి వారిన హోటళ్లు, ఓయో రూముల్లో ఉంచి విటులను పంపిస్తున్నారు. కాల్ సెంటర్ల ద్వారా కూడా విటులను ఆకర్షిస్తున్నారు. ఉగండా దేశ మహిళలు కూడా హైటెక్ సిటీ కేంద్రంగా సెక్స్ రాకెట్ నిర్వహిస్తుంటే వారిని పట్టుకున్నారు. వీరు వీఐపీలకు కూడా అమ్మాయిలను సప్లయి చేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. యాప్ సాయంతో కూడా విటులను ఆకర్షిస్తూ సెక్స్ దందాను జోరుగా నడిపిస్తున్నారని పోలీసులే చెబుతున్నారు.

పశ్చిమబెంగాల్ నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి...
హైదరాబాద్‌లోని కమిషనర్ టాస్క్ ఫోర్స్,వెస్ట్ జోన్ బృందం హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యభిచార గృహంపై దాడి చేసి ఇద్దరు వ్యభిచారిణులను అరెస్టు చేసింది. నిందితుల వద్ద నుండి రూ.10,500నగదు, మూడు సెల్ ఫోన్లు,పది ఉపయోగించిన కండోమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మానేపల్లి రవి కిరణ్ జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చి హైదరాబాద్‌లోని వివిధ ప్రదేశాలలో పనిచేశాడు.కానీ అతని సంపాదన అతని విలాసవంతమైన ఖర్చులను తీర్చడానికి సరిపోలేదు. దీంతో హైదరాబాద్‌లో వ్యభిచార గృహాన్ని నిర్వహించాలని ప్లాన్ చేశాడు.హైదరాబాద్‌లోని కళ్యాణ్ నగర్‌లోని ఎస్ ఆర్ నగర్‌లో ఓ ఇంటిని నెలకు రూ.15,000 అద్దెకు తీసుకుని, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మహిళా సెక్స్ వర్కర్లతో వ్యభిచార గృహాన్ని నడుపుతున్నాడు. 15 రోజులకు రూ.70,000 చెల్లింపు ఒప్పందంపై పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి బాలికలను హైదరాబాద్‌కు తీసుకువచ్చి, వారితో వ్యభిచార గృహాన్ని నడిపాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

సెక్స్ హబ్ కానీయొద్దు...
హైదరాబాద్ నగరాన్ని సెక్స్ హబ్ గా మార్చకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ యాక్టివిస్టు డాక్టర్ లుబ్నా సార్వత్ చెప్పారు. విదేశాల నుంచి హైదరాబాద్ నగరానికి అమ్మాయిలను అక్రమంగా తరలించి వ్యభిచారం నిర్వహిస్తుంటే ఇంటెలిజెన్స్ అధికారులు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. నగరంలోని ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు ప్రాంతాలు వ్యభిచారిణులకు నిలయంగా మారాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నగరాన్ని సెక్స్ హబ్ గా కాకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలని డాక్టర్ లుబ్నా సూచించారు. హైదరాబాద్ సినిమా పరిశ్రమలో మహిళా నటీమణులపై సాగుతున్న లైంగిక వేధింపులను నివారించడానికి దర్యాప్తు కమిటీ నివేదికను బహిర్గతం చేసి చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ఈ సెక్స్ రాకెట్లు లేకుండా చేయాలని ఆమె పోలీసులకు సూచించారు.

Tags:    

Similar News