Hyderabad | అపరిశుభ్ర హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నా హోటళ్లలోని అపరిశుభ్ర పరిస్థితులు మెరుగుపడటం లేదు.నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.;

Update: 2025-02-06 10:45 GMT
హోటల్ కిచెన్ రూంలో కుళ్లిపోయిన కూరగాయలు(ఫొటొ కర్టసీ :ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఎక్స్ పోస్టు)

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయని తాజాగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్కఫోర్స్ బృందాలు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైంది. హోటళ్లు, రెస్టారెంట్లు, పీజీ హాస్టళ్ల వంటగదుల్లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు నివ్వెర పోయారు. ఆహార పదార్థాలను నిల్వ ఉంచేందుకు ప్రమాదకరమైన సిట్రిక్ యాసిడ్ లను ఉపయోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది. నగరంలోని పోష్ నాష్ లాంజ్ అండ్ బార్ , కేక్ ది హట్టి రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని వెల్లడైంది. ఫుడ్ కలర్స్, టేస్టింగ్ సాల్ట్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారని తనిఖీల్లో వెల్లడైంది. ఫిబ్రవరి నెల నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేశారు.


కిచెన్ రూంలో ఎలుకలు, బొద్దింకల సంచారం
శామీర్ పేటలోని నల్సార్ విశ్వవిద్యాలయంలోని శ్రీ సాయి గణేష్ కాటరర్స్ క్యాంటీన్ లో అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నాయని ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో వెల్లడైంది. యూనివర్శిటీ క్యాంటీన్ కు ఫుడ్ సేఫ్టీ లైసెన్సు పొందినా శిక్షణ పొందిన సూపర్ వైజర్ లేరు. క్యాంటీన్ లో నీటి విశ్లేషణ, తెగులు నియంత్రణ రికార్డులు లేవని తనిఖీల్లో తేలింది. క్యాంటీన్ స్టోర్ రూంలో ఎలుకలు, బొద్దింకలు సంచరిస్తున్నాయని పరిశీలనలో ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఎలుకల మలం, బొద్దింకల ఉధ్ధృతి కిచెన్ రూంలో కనిపించింది. లేబుల్ లేని రాజ్మాను అధికారులు సీజ్ చేశారు. క్యాంటీన్ కిటికీలకు కీటకాల నిరోధక తెరలు లేవు. ఆహార ముడి పదార్థాలను నేలపైనే ఉంచారు.ప్యాకింగ్ తేదీ, గడువు తేదీ, బ్యాచ్ నంబరు లేని పచ్చిశనగలను అధికారులు గుర్తించారు. క్యాంటీన్ అపరిశుభ్రతతో నల్సార్ వర్శిటీ ప్రతిష్ఠ మసకబారింది. ఈ క్యాంటీన్ నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు.



 ప్రమాదంలో విద్యార్థుల ఆరోగ్యం

తెలంగాణ రాష్ట్రంలోని పీజీ హాస్టళ్లు,ఇంజినీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని కిచెన్ లు అపరిశుభ్రంగా ఉండటంతో ఆ ఆహారం తిన్న విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలోని టాస్క్ ఫోర్స్ బృందం పరిశీలనల్లో తేలింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల శ్రీ చైతన్య విద్యా సంస్థల కిచెన్ ను సీజ్ చేశారు. నోటీసులు ఇవ్వడమే కాకుండా హోటళ్ల లైసెన్సులను రద్దు చేయాలని నిర్ణయించారు.

గడువు ముగిసిన ఆహార పదార్థాలు
నారాయణగూడలోని ఇండియన్ దర్బార్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు జరిపింది. వంటగదిలో కార్మికులు అప్రాన్లు లేకుండా కనిపించారు. ఉడికించిన గుడ్లను ఎలాంటి మూత పెట్టకుండా మురుగునీటి కాల్వ వద్ద ఉంచారు. వంటగదిలో బొద్దింకల బెడద కనిపించింది. ఆహార పదార్థాలను ఫ్రిడ్జిలో నిల్వ ఉంచారు. కిచెన్ రూంలో కుళ్లిన టమోటాలు,పచ్చిమిర్చి, క్యారట్ ను గుర్తించారు. స్టోర్ రూమ్‌లో ఆహార పదార్థాలతో పాటు శానిటరీ వస్తువులను ఉంచారు.వంటగదిలో పనిచేస్తున్న వంటవారికి ఫిట్ నెస్ సర్టిఫికెట్లు లేవు. వంటల్లో సింథటిక్ ఆహార రంగులను వాడుతున్నారని తనిఖీల్లో తేలింది. గడువు ముగిసిన మసాలా పౌడర్, జీలకర్ర పొడి, హాజెల్ నట్ ఫ్లేవర్డ్ సిరప్, పీచ్ ఫ్లేవర్డ్ సిరప్, మిరపకాయ ముక్కలను టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించి సీజ్ చేశారు.



 హోటల్ అశోకాలో అపరిశుభ్ర పరిస్థితులు

హైదరాబాద్ నగరంలోని లక్డీకాపూల్ ప్రముఖ అశోకా హోటల్ వంటగదిలో అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. వంటగది గోడలు అపరిశుభ్రంగా దుర్గంధాన్ని వెదజల్లుతుండటం గమనించారు.వంటగదిలో బొద్దింకల బెడద కనిపించింది.వంటగది, రిఫ్రిజిరేటర్‌లోని పాత్రలు తుప్పు పట్టి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హోటల్ లో తయారుచేసిన ఆహార పదార్థాల్లో సింథటిక్ ఆహార రంగులు ఉపయోగించారని తేలింది. వంటగదిలో కుళ్ళిన వంకాయలు,కాలీఫ్లవర్ కనిపించాయి. అశోకా హోటల్ లో 140 మంది వంట సిబ్బంది పనిచేస్తుండగా, వారిలో ఒక్కరు కూడా ఫుడ్ సేఫ్టీ శిక్షణ పొందలేదు. కాలం చెల్లిన రోజ్మేరి , చికెన్ ముక్కులు, ఇతర ఆహార పదార్థాలను అధికారులు కనుగొన్నారు. మంచినీటి పరీక్షల నివేదికలు కూడా లేవు.

 



 కిష్కింధ కిచెన్ లో కుళ్లి పోయిన కూరగాయలు

కిష్కింధ కిచెన్ లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఎలుకలు, బొద్దింకలు తిరుగుతూ కనిపించాయి. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 36లోని కిష్కింధ కిచెన్ రూంలో నీటి పరీక్షల రిపోర్టులు, ఫోస్టాక్ సర్టిఫికెట్లు లేవు. రిఫ్రిజిరేటరు అపరిశుభ్రంగా ఆహార వ్యర్థాలతో నిండి కనిపించింది. వంటగదిలో మురుగు కాల్వల్లో ఆహారవ్యర్థాలు పేరుకుపోయాయి.ఆహార పదార్థాలు, ఆహార ముడి పదార్థాలను ఒకే చోట ఉంచారు. నిమ్మకాయలు, బంగాళాదుంపలు, కూరగాయలు కుళ్లిపోయి కనిపించాయి. వంటగదిలో ఎలుకల మలం, బొద్దింకల బెడద కనిపించింది. కాలం చెల్లిన ఆరెంజ్ జ్యూస్, బటన్ మష్రూమ్స్, సన్ ఫ్లవర్ ఆయిల్ ఉన్నాయి.చేతులకు తొడుగులు లేకుండా వంటవాళ్లు పనిచేస్తుండటాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.








Tags:    

Similar News