‘దేశంలోనే తెలంగాణ నెంబర్.1’

ఆపరేషన్ సిందూర్ టైమ్‌లో కూడా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించామన్న సీఎం రేవంత్.

Update: 2025-09-27 13:53 GMT

‘హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ కాదు. ఒరిజినల్ సిటీ. ఎన్నో ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు నగరం కొలువు’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. శిల్పారామంలో నిర్వహించిన వరల్డ్ టూరిజం డే మొదటి కాంక్లేవ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగానే హైదరాబాద్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శాంతిభద్రతల విషయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని, ఇది కేంద్రమే ప్రకటించిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో రక్షణ, శాంతిభద్రతల గురించి ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదని అన్నారు.అత్యంత సురక్షిత నగరం హైదరాబాద్ అని చెప్పారు.


‘‘హైదరాబాద్‌లో చార్మినార్, గోల్కొండ లాంటి ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. టైగర్ రిజర్వు, కవాల్ టైగర్ రిజర్వ్, వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంతో పాటు, వేయి స్తంభాల గుడి, ఆలంపూర్ శక్తి పీఠాలు.. ఇలా చెప్పుకుంటూపోతే అనేక ప్రత్యేకతలున్న ప్రాంతాలున్నాయి. తెలంగాణలో అత్యుత్తమ, సాంస్కృతిక పర్యాటక ప్రాంతాలున్నాయి. అందుకే ఎకో టూరిజం, మెడికల్ టూరిజం, టెంపుల్ టూరిజం ఇలా అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నాం. గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు. ఒరిజినల్ సిటీ. ప్రపంచ నగరాలతో పోటీ పడాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఐటీ, ఫార్మా రంగాలే కాదు. పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించాలి’’ అని పేర్కొన్నారు.


‘‘హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ కాదు. ఒరిజినల్ సిటీ. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఇక్కడ ప్రపంచ సుందరీమణులతో అందాల పోటీలు నిర్వహించాం. ప్రస్తుతం హైదరాబాద్ ప్రపంచ ప్రఖ్యాతి నగరాలతో పోటీ పడుతోంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. మీకు ప్రభుత్వం ఉండగా ఉండటమే కాదు.. లాభాలను కూడా అందిస్తుంది’’ అని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్.

రూ.15వేల కోట్ల పెట్టుబడులు..

టూరిజం కాంక్లేవ్ 2025లో తెలంగాణకు రూ.15,279 కోట్ల పెట్టుబడులు, 50వేల ఉపాధి అవకాశాలకు ఒప్పందాలు జరిగాయి. మొత్తం 30 ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఈ పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా రాష్ట్రంలో 19,520 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు రాబోతున్నాయని సీఎం వివరించారు. పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈ పెట్టుబడులతో 10వేల కొత్త హోటల్ రూమ్స్, థీమ్ పార్క్‌లు, ఫిలిం టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్స్ అభివృద్ధితో తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్బంగానే పెట్టబడులు తీసుకొచ్చిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును సీఎం అభినందించారు.



Tags:    

Similar News